ఏమైంది చంద్ర‌బాబుకి..?

By Kalyan.S Aug. 06, 2020, 09:17 am IST
ఏమైంది చంద్ర‌బాబుకి..?

నారా చంద్ర‌బాబునాయుడు.. 40 ఏళ్ల రాజ‌కీయ జీవితం.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కీర్తి, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న ఘ‌న‌త‌. గ‌తంలో ఆయ‌న ఏ అంశంపై మాట్లాడినా.. ఫుల్ క్లారిటీతో, సంపూర్ణ అవ‌గాహ‌న మాట్లాడ‌తార‌ని ప్ర‌తీతి. కొన్ని సంద‌ర్భాల్లో అది నిజం కూడా. కానీ.. 2019 ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వం త‌ర్వాత నుంచీ ఆయ‌న వాగ్దాటిలో కాస్త తేడా క‌నిపిస్తూనే ఉంది. తాజాగా ప్ర‌భుత్వానికి 48 గంట‌ల డెడ్ లైన్ ప్ర‌క‌టించడం.. డెడ్ లైన్ అనంత‌రం ఆయ‌న మాట్లాడిన తీరు చంద్ర‌బాబు రాజ‌కీయ అనుభ‌వానికి, ప్రతిష్ట‌త‌కు త‌గిన విధంగా లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ప్ర‌భుత్వ ప‌నితీరు న‌చ్చ‌క‌పోతే దానికి నిర‌స‌న‌గా ధ‌ర్నాలు చేసిన ప్రతిప‌క్షాల‌ను చూశాం.. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయ‌డం చూసినాం.. చివ‌ర‌కు రాజీనామా చేస్తామ‌న‌డం.. చేయ‌డం కూడా చూశాం. దానికి విరుద్ధంగా ప్ర‌భుత్వాన్ని రాజీనామా చేయ‌మ‌న‌డం బ‌హుశా దేశ రాజ‌కీయాల్లోనే ఇటువంటి స్టేట్‌మెంట్ ఇచ్చిన నేత చంద్ర‌బాబే అయి ఉంటారు.

డెడ్ లైన్ అనంత‌రం కూడా న‌వ్వొచ్చేలా..

48 గంట‌ల డెడ్ లైన్ అనంత‌రం కూడా జూమ్ ద్వారా ప్ర‌సంగించిన చంద్ర‌బాబు మాట‌ల్లోనూ స‌రైన ప‌స లేదు. పైగా మూడు రాజ‌ధానులు చేస్తామ‌ని ముందే చెప్పి చేశారా..? అని ప్ర‌భుత్వాన్నిప్ర‌శ్నించ‌డం కూడా న‌వ్వుల పాలు చేసింది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. న‌‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ తొలి ముఖ్య‌మంత్రిగా చేసిన చంద్ర‌బాబు అంత‌కు ముందే అమ‌రావ‌తిని రాజ‌ధానిని చేస్తాన‌ని ప్ర‌క‌టించారా..? ‌లేదు క‌దా..! ఏ ప్ర‌భుత్వ‌మైనా అధికారంలోకి వ‌చ్చాక కొన్ని కీల‌క నిర్ణ‌యాలు ప‌రిపాల‌న‌లో భాగంగా ఎదురైన ప‌రిస్థితుల‌ను బ‌ట్టి తీసుకుంటుంది. జ‌గ‌న్ కూడా అదే చేశారు. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ ఆవ‌శ్య‌క‌త‌ను గుర్తించి మూడు రాజధానుల ప్ర‌క‌టన చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు కూడా చెప్పలేదు. పైగా ప్రభుత్వ భూములు అపారంగా వున్న ప్రకాశం జిల్లా, దోనకొండ ప్రాంతాన్ని కాదని, ప్రయివేటు భూములు సేకరించి మరీ అమరావతికి వెళ్లారు. దోనకొండ ప్రాంతంలో జగన్ కు భూములు వున్నాయని, అందుకే అక్కడకు వెళ్లడం లేదని కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి.

అంత‌టా దానిపైనే చ‌ర్చ‌..

ఇటీవ‌ల కొంత కాలంగా, ముఖ్యంగా 48 గంట‌ల డెడ్ లైన్ కు సంబంధించి చంద్ర‌బాబు చేసిన స‌వాల్ ను చూసి అంద‌రూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయ‌న వ్య‌వ‌హార శైలి వింత‌గా ఉంటోంద‌ని చ‌ర్చించుకుంటున్నారు. బుధ‌వారం సాయంత్రం ఆయ‌న జామ్ ద్వారా మాట్లాడిన సంద‌ర్భంలో ఆయ‌న ముఖ క‌వ‌లిక‌ల‌ను గ‌మ‌నిస్తే ఏదో ఆందోళ‌న‌లో ఉన్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. వాయిస్ లోనూ గంభీరం త‌గ్గింది. ఈ స‌వాల్ కు సొంత పార్టీ ఎమ్మెల్యే లే స్పందించ‌క‌పోవ‌డం దానికి ఓ కార‌ణం అయి ఉండొచ్చ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ముందుగా త‌న ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తే హుందాగా ఉండేది. కానీ.. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు, వింతైన స‌వాళ్లు చేసి 40 ఏళ్ల అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు త‌న ప్ర‌తిష్టను నోరారా.. దిగ‌జార్చుకుంటున్నారో అన‌డం అతిశ‌యోక్తి కాదేమో..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp