రాత్రంతా ఏం జరిగింది.. ?

By Amar S Dec. 06, 2019, 02:36 pm IST
రాత్రంతా ఏం జరిగింది.. ?

దిశ నిందితుల ఎన్కౌంటర్ నేపధ్యంలో ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసులో బుధవారం సాయంత్రం నుంచి అనేక అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈకేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. అయితే మొదటినుంచి పోలీసుల నిర్లక్ష్యం ఉందని విమర్శలు రావడంతో నిందితులను షాద్‌నగర్‌ కోర్టు కస్టడీకి ఇచ్చారు. అయినా ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. షాద్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్, డీజీపీ కార్యాలయాలు అత్యంత గోప్యత పాటించాయి. ఇన్నిరోజులుగా మీడియాలో ఎలాంటి కథనాలు వచ్చినా.. సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా పోలీసులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆ నలుగురు నిందితుల కస్టడీపై తమకు కోర్టునుంచి ఏ ఆదేశాలు రాలేదని చెబుతున్నారు.

పాతి పెట్టిన ఫోన్ ను తవ్వి తీయించారు..

ప్రాథమిక సమాచారం మేరకు బుధవారం అర్ధరాత్రి 2గంటలకు నిందితులు మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులును చర్లపల్లి జైలునుంచి రహస్యంగా పోలీసులు తరలించారు. ముందు తొండుపల్లి టోల్‌గేట్‌ వద్ద ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. అక్కడ లారీ నిలిపిన స్థలం, మద్యం తాగిన ప్రాంతాలను పరిశీలించారు. అసలు దిశను ముందుగా చూసిందెవరు.? అత్యాచారం ఆలోచన ముందు ఎవరికి వచ్చింది.? తదితర వివరాలు తెలుసుకున్నారు. ఆమె స్కూటీకి పంక్చర్‌ చేసిందెవరు.? స్కూటీ బాగు చేయించేందుకు ఎవరు ఏ షాప్‌కు వెళ్లారు.? తర్వాత దిశను ఎలా ఎత్తుకెళ్లారో నిందితులు పోలీసులకు చూపించారు. అత్యా చారం జరిగిన ప్రాంతంలో పాతిపెట్టిన దిశ మొబైల్‌ను నిందితులతోనే తవ్వించి తీయించారు. అక్కడినుంచి దిశ మృతదేహాన్ని క్యాబిన్‌లో ఎలా వేసుకుని వెళ్లారు.? ఎవరెవరు సాయం చేశారు? నవీన్, శివ పెట్రోల్‌ కొన్న బంకులు కూడా చూపించారు.. ఇక షాద్‌నగర్‌ వైపు వెళ్లిన తర్వాత వెనక్కి రావడం, చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద మృతదేహాన్ని దహనం చేసేవరకు జరిగిన ఉదంతాన్ని నిందితులు పోలీసులకు కళ్లకు కట్టారు.

దిశ చనిపోయిందనుకుని ఈడ్చుకెళ్లారట..

చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద లారీని ఆపిన నిందితులు మృతదేహాన్ని క్యాబిన్‌ నుంచి దించారట. అప్పటికే ఆమె చనిపోయిందనుకుని వారే మోసుకెళ్లి బ్రిడ్జికింద ఒక మూలకు ఈడ్చుకెళ్లినట్లు పోలీసులకు వివరించారు. తొండుపల్లి వద్ద ఘటనాస్థలంలోనే దిశ చనిపోయినా ఇంకా బ్రతికే ఉండొచ్చన్న అనుమానంతో ఆనవాళ్లు కూడా దొరక్కుండా వెంటతెచ్చుకున్న పెట్రోల్‌తో పాటు, లారీనుంచి డీజిల్‌ తీసి దహనం చేసిన విధానాన్ని చూపారు. ఆ మంటల్లోనే దిశ సిమ్‌ కార్డులు వేసి కాల్చినట్లు వివరించారు.

Read Also: ఇప్పుడు ఏపీకి ఏమిచ్చారని ఇలా మాట్లాడుతున్నావ్ పవన్?

మరోసారి లారీ పరిశీలన.. మొత్తం 50మంది పోలీసులు..

చటాన్‌పల్లి నుంచి నేరుగా క్లూస్‌ టీం షాద్‌నగర్‌లోని ఆర్టీసీ డిపోలో ఉంచిన లారీ వద్దకు వెళ్లి మరోసారి ఆనవాళ్లు సేకరించింది. క్యాబిన్‌లో ఆధారాలు సేకరించింది. దిశ రక్తపుమరకలు, దిశ వెంట్రుకలు, వేలి ముద్రలు, ఆమె వేసుకున్న బ్లాంకెట్‌ పోగులు తదితర ఆనవాళ్లను సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ఈ దర్యాప్తులో మొత్తం 50 మంది పోలీసులు పాలుపంచుకుంటున్నారట. మొత్తం 7 బృందాలను సీపీ సజ్జనార్‌ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. నలుగురు అదనపు ఎస్పీ స్థాయి అధికారులు ఈ బృందాల్లో కీలకంగా వ్యవహరించారు

ఘటనను చూసిన సాక్షులు లేరు.. మరి ఏ ఆధారాలున్నాయి.?

ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు 20రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేయాలనే గడువు విధించుకోవవడంతో కేసును విభజించి దర్యాప్తు చేసారు. డీఎన్‌ఏ, శరీర స్రావాల విశ్లేషణ, ప్రత్యేక సాక్షుల నుంచి వివరాలు సేకరించడం, టెక్నాలజీ ద్వారా ఆధారాలైన సెల్‌ఫోన్‌ సిగ్నల్స్, సీసీ టీవీ ఫుటేజీ, లారీ, వాహనాల టైర్ల మార్కుల సేకరణ, లీగల్‌ ప్రొసీడింగ్స్‌ ఇలా ప్రతి పనిని విభజించి ఆయా బృందాలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈఏడు బృందాలకు శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. కేసు వివరాలను ఎప్పటికపుడు సీపీ సజ్జనార్‌ తెలుసుకున్నారు. ఈకేసులో ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో సాంకేతిక, ఫోరెన్సిక్‌ ఆధారాలే కీలకమయ్యాయి. ఘటన జరిగిన ప్రాంతంలో మనుషుల సంచారం లేకపోవడం, ఘటనను నేరుగా చూసిన వారు లేకపోవడంతో ఈకేసులో నిందితుల పాత్ర నిరూపించడం పోలీసులకు సవాలుగా మారింది. మరోవైపు ఈకేసు గురించి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండటంతో తెలంగాణ పోలీసులపై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. దీంతో పైకోర్టుకు వెళ్లినా శిక్షలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోకుండా పకడ్బందీగా సాక్ష్యాలు సేకరించారు.

Read Also: ఏపీలో బ్యాంకు పెడతానంటున్న సీఎం జగన్.. ఎంతైనా బిజినెస్ మేన్ కదా

వరంగల్ కేసులా కాకూడదనే పట్టుదలతో ఖాకీలు..

గతంలో వరంగల్‌లో 9 నెలల పాపపై హత్యకేసులో కూడా ప్రత్యక్ష సాక్షులెవరూ లేరు.. కానీ, కేసులో నిందితుడి పాత్ర నిరూపించడంలో పోలీసులు సఫలమయ్యారు. ముందు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఉరిశిక్ష విధించినా నిందితుడు పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన కోర్టు.. అత్యంత అరుదైన కేసుల్లోనే ఉరి శిక్ష విధించాలని నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇప్పుడు దిశ కేసును దర్యాప్తుచేస్తున్న బృందంకూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వరంగల్‌ పోలీసుల సలహాలు తీసుకున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులు పైకోర్టుకు వెళ్లినా శిక్షలో మార్పు లేకుండా చూడాలన్న పట్టుదలతో పోలీసులు పనిచేసారు.

గొర్రెల కాపరి, కానిస్టేబుల్‌ ఇద్దరూ సకాలంలో స్పందించడం వల్లే..

దిశ మృతదేహం కాలిపోతుండగా చూసిన గొర్రెలకాపరి, అతడిచ్చిన సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి వెళ్లిన కానిస్టేబుల్‌ ఇద్దరూ వెంటనే స్పందించడంతోనే పోలీసులు బాధితురాలిని గుర్తించడం సాధ్యమైంది.. ఆధారాల సేకరణ కూడా చాలా వేగంగా జరిగింది. ఈ ఇద్దరూ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే దర్యాప్తు సాఫీగా సాగింది.

Read Also: ఆ బుల్లెట్‌ దాచుకోవాలని ఉంది.

నిర్ధారించిన సజ్జనార్..

దిశ హత్యకేసులో నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ నిర్థారించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాన్ని శుక్రవారం తెల్లవారుజామున పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చటాన్‌పల్లి వద్ద ఈ తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. నిందితులు పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు’అని సజ్జనార్ తెలిపారు.

జై పోలీస్.. జై కేసీఆర్ నినాదాలు..

ఈ ఘటన పట్ల ప్రజలంతా మొదటినుంచీ ఒకే డిమాండ్ వినిపించారు. పోలీసులను తెలంగాణ ప్రభుత్వాన్ని నిందితులను ఉరితీయాలని, చంపేయాలని కోరుతూ వచ్చారు. శుక్రవారం వారిని ఎన్ కౌంటర్ చేసిన ప్రాంతానికి వేలల్లో వచ్చిన ప్రజలు జై పోలీస్, జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ నినాదాలు చేసారు. భారీఎత్తున ప్రజలు రావడంతో హైవేపై ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాహనాల్ని పునరుద్ధరించడం కూడా సాధ్యం కాలేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp