కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది.?

By Amar S Dec. 13, 2019, 11:53 am IST
కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది.?

కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారా..? కర్ణాటకలో జిల్లాల వారీగా ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు వర్గాల వారీగా విడిపోయారా? అధినేత్రి సోనియా వద్ద గుర్తింపుకోసం పార్టీ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారా? రాష్ట్ర న్యాయకత్వం ఏర్పాటు చేయనున్న పదవుల పందేరం కోసమే నేతలంతా ఆరాట పడుతున్నారా? ఎన్నికల అయిపోయిన వెంటనే ఎందుకు కర్ణాటకలో ఈ హడావిడి అంటే.. పార్టీపరంగా రాజీనామాలు చేసిన పీసీసీ, ఇన్ చార్జ్ పదవులకోసమేనని తెలుస్తోంది.

తాజాగా ఉపఎన్నికల ఫలితాల అనంతరం కర్ణాటకలో బీజేపీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈక్రమంలో అధికారంలో భాగస్వామ్యం కావాలని భావించిన కాంగ్రెస్ కు నిరాశ ఎదురైంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలనాటికి మరింత పఠిష్టం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. రాష్ట్ర కాంగ్రెస్‌ ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా పార్టీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. పార్టీలో జవసత్వాలు నింపే సమర్థుడైన నేతలకోసం ఏ నాయకుడి చేతికి బాధ్యతలు అప్పగించినా అందరినీ కలుపుకెళ్లే నాయకుడికోసం అన్వేషిస్తోంది. ఇటీవల గుండూరావు, సిద్దరామయ్యలు రాజీనామాలు చేయడంతో సమర్థవంతమైన నాయకుల అవసరం పార్టీకి ఉందని అగ్రన్యాయకత్వం భావిస్తోంది.

ఈ క్రమంలో పార్టీ నాయకులను, కార్యకర్తలను ఒకేతాటిపై నడిపించడంలో విఫలమైన కేసీ వేణుగోపాల్‌ కు బదులుగా మరొక ప్రముఖనేత గులాంనబీ ఆజాద్‌ను ఇన్ చార్జ్ గా నియమించాలని అధిష్టానం ఆలోచిస్తోంది. ఆజాద్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించి కర్ణాటక పీసీసీ అధ్యక్ష పగ్గాలు మల్లికార్జునఖర్గేకు అప్పగించాలంటూ ఓ వర్గం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి సూత్రప్రాయంగా సూచించినట్టు సమాచారం. అలాగే ఉద్యమకారుడిగా పేరుగాంచిన ప్రముఖ దళిత నేత మాజీ కేంద్రమంత్రి కేహెచ్ మునియప్ప పేరు కూడా వినిపిస్తోంది. మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, మునియప్పల పేర్లు ప్రముఖంగా పరిశీలిస్తున్నారని వీరిలో ఎవరో ఒకరికి పీసీసీ పగ్గాలు దక్కనున్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఎన్నికల ప్రచారానికి పార్టీ సీనియర్లు దూరంగా ఉండటాన్ని గమనించిన పార్టీ అగ్రన్యాయకత్వం వీరికి కూడా తగిన ప్రాధాన్యత కల్పించాలని, సీనియర్లను వినియోగించుకుంటూనే యువతకు పెద్దఎత్తున ప్రాధాన్యతనివ్వాలని ఆలోచిస్తోంది.

ఈ తాజా పరిణామాలతో నూతనంగా అవకాశాలకోసం ఎదురు చూసేవారంతా కేపీసీసీ అధ్యక్ష పదవికి గుండూరావు, సీఎల్పీ పదవికి మాజీసీఎం సిద్దరామయ్య చేసిన రాజీనామాలను వెంటనే ఆమోదించాలని డిమాండ్‌ చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి తిష్ట వేసిన పార్టీకి చెందిన సీనియర్లు బీకే హరి ప్రసాద్‌, కేహెచ్ మునియప్ప, బీసీ చంద్రశేఖర్‌, డీకే సురేశ్‌లు పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీని బలోపేతంచేసేలా సమర్థ నేతలకు అవకాశమివ్వాలని కోరారు. మొత్తంగా మరికొన్నిరోజుల్లో కర్ణాటక కాంగ్రెస్ కొత్త టీం సిద్ధమైపోనుందని తెలుస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp