రాజధాని పై రాష్ట్రానిది నిర్ణయాధికారం - తేల్చి చెప్పిన కేంద్రం

By Raju VS Aug. 06, 2020, 12:52 pm IST
రాజధాని పై రాష్ట్రానిది నిర్ణయాధికారం - తేల్చి చెప్పిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ లో రాజధానుల అంశంపై కేంద్రం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. మూడు రాజధానుల వివాదంలో తన అభిప్రాయాన్ని వెల్లడించింది. రాష్ట్రాల రాజధానుల అంశం తమ పరిధిలో లేదని తేల్చిచెప్పింది. ఏపీ హైకోర్టులో ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. తాజాగా మూడు రాజధానుల అంశంలో గెజిట్ పై హైకోర్ట్ స్టేటస్ కో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 14న దానిపై విచారణ జరగబోతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మూడు రాజధానుల అంశం కీలక దిశగా సాగుతున్నట్టుగానే చెప్పవచ్చు.

ఆంధ్రప్రదేశ్ లో పాలనా వికేంద్రకణలో భాగంగా జగన్ సర్కారు మూడు రాజధానుల అంశంపై గత డిసెంబర్ లో ప్రస్తావన చేసింది. నాటి నుంచి దానిని అడ్డుకునేందకు విపక్ష టీడీపీ నేతలు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. తొలుత జనవరిలో , ఆతర్వాత జూన్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మండలిలో తమ బలాన్ని ఉపయోగించారు. సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకున్నారు. అయితే నిబంధనల ప్రకారం రాజ్యాంగాన్ని అనుసరించి గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో చివరకు వాటికి చట్ట రూపం దక్కింది. ఈ నేపథ్యంలో ఏపీలో మూడు రాజధానులకు అంతా సిద్ధమయిన తరుణంలో మరోసారి హైకోర్టులో పిటీషన్లతో ఆ వ్యవహారాన్ని మరింత జాప్యం చేయాలనే లక్ష్యంతో ప్రతిపక్ష టీడీపీ ఉన్నట్టు కనిపిస్తోంది.

ఇటీవల హైకోర్టులో వేసిన పిటీషన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పార్టీగా చేర్చారు. ఆ మేరకు హోం శాఖకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. వారి వైఖరి తెలియజేయాలని ఆదేశాలు వెళ్లాయి. దానికి అనుగుణంగానే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తమ వైఖరిని స్పష్టం చేస్తూ అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే ఈ అంశంపై గతంలోనే పార్లమెంట్ సాక్షిగా చెప్పినప్పటికీ తాజా ఉదంతంలో మరోసారి పునరావృతం చేయడంతో రాజధానుల అంశంలో కేంద్రం నుంచి జగన్ కి పూర్తి ఆమోదం ఉన్నట్టుగా తేలిపోయింది. దాంతో ఇక న్యాయపరమైన ఇబ్బందులకు ఆటంకాలు క్రమంగా తొలగిపోతున్నట్టుగానే పలువురు భావిస్తున్నారు.

అమరావతి రైతుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన, మరింత మెరుగైన ప్యాకేజీ అమలు చేసేందుకు సిద్ధమయిన తరుణంలో దానిని కూడా ప్రశ్నించే అవకాశాలు స్వల్పమేనన్నది పలువురి అంచనా. దాంతో ఇక ఏపీలో రాజధానుల అంశంలో టీడీపీ ఆశలకు నీళ్లొదలాల్సిన పరిస్థితి వస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp