దేశంలో ఎక్కడినుండైనా ఓటు వేయొచ్చు - సునీల్ అరోరా

By Kiran.G Feb. 13, 2020, 03:07 pm IST
దేశంలో ఎక్కడినుండైనా ఓటు వేయొచ్చు - సునీల్ అరోరా

దేశంలో ఎలక్షన్స్ వస్తే చాలు.. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్న,లేదా పొట్టకూటి కోసం దేశంలో అనేక ప్రాంతాలకి వలస వెళ్లిన వారు తిరిగి తమ స్వస్థలాలకు పయనమవ్వాల్సిందే.. కొందరు ఓటు వేయడానికి అంతదూరం ఏం వెళ్తాములే అని ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు...

ఈ సమస్యను అధిగమించడానికి దేశంలో ఏ ప్రాంతం నుండైనా ఓటు హక్కు వినియోగించుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టామని దీనికోసం మద్రాస్ ఐఐటీ సహకారంతో బ్లాక్ చైన్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు.. ఢిల్లీలో బుధవారం జరిగిన ‘టైమ్స్‌ నౌ సమిట్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈవీఎంల గురించి పలు విషయాలు మాట్లాడారు.

ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, స్వస్థలంలో వేయాల్సిన ఓటును మీరు నివసిస్తున్న పట్టణం లేదా గ్రామం లోని పోలింగ్ కేంద్రాల నుండి వేయొచ్చని సునీల్ అరోరా పేర్కొన్నారు.. ఈవీఎంలపై పలువురికి అనేక సందేహాలు ఉన్నాయని.. కారు లేదా పెన్నులాగే ఈవీఎంలు కూడా మొరాయించవచ్చేమోగానీ టాంపర్‌ చేయడం అసాధ్యమని చెప్పారు. ఎన్నికల విషయంలో మరిన్ని సంస్కరణలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.. ఇందుకోసం భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలతో చర్చిస్తామని పేర్కొన్నారు.

ఒకవేళ నివసిస్తున్న పట్టణం/గ్రామం నుండే ఓటు వేసే వెసులుబాటు అమల్లోకి వస్తే దేశంలో ఓటింగ్ శాతం పెరగడంతో పాటుగా రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.. దీనికి కారణం లేకపోలేదు..వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న పలువురు ఉన్నత విద్యావంతులు స్వస్థలానికి వెళ్లి ఓటు వేయడం ఇష్టం లేక ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు.. ఒకవేళ ఉన్న ప్రాంతం నుండి ఓటు వేసే పద్దతి అందుబాటులోకి వస్తే వారి ఆలోచనల్లో మార్పు వచ్చి రాజకీయంగా పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందనేది కాదనలేని సత్యం..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp