కార్యనిర్వాహక రాజధానిలో తొలి కార్యాలయం, విశాఖ వైపు పడుతున్న అడుగులు

By Raju VS Oct. 26, 2020, 08:30 am IST
కార్యనిర్వాహక రాజధానిలో తొలి కార్యాలయం, విశాఖ వైపు పడుతున్న అడుగులు

ఏపీలో పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉంది. ఇప్పటికే చట్టాలు ఆమోదించారు. దానికి అనుగుణంగా పలు చర్యలు తీసుకుంటున్నారు. అయితే హడావిడి లేకుండా, అన్నీ సర్థుమణిగిన తర్వాత కార్యనిర్వాహక రాజధాని వైపు కదలాలని ఇప్పటికే జగన్ నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా క్రమంగా పలు ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖలో రాజధానికి అనుగుణంగా కార్యాలయాల ఎంపిక, ఇతర వ్యవహారాలపై దృష్టి పెట్టారు. వివిధ శాఖలు అందుకు అనుగుణంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. సీఎంవో, సెక్రటేరియేట్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి సంబంధించి ఇప్పటికే తుది నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారంలో ఉంది. కొత్త సంవత్సరం తొలి అర్థభాగంలోనే అందుకు కార్యాచరణ ఉంటుందని అంతా ఆశిస్తున్నారు.

ఈలోగా వివిధ శాఖలకు సంబంధించిన కీలక విభాగాల తరలింపు క్రమంగా చేసేందుకు ప్రణాళికలు వేశారు. అందులో భాగంగానే ఎపి మెట్రో రైల్‌ ప్రాజెక్టు కార్యాలయాన్ని బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. పరిపాలన వికేంద్రీకరణ చేపట్టిన నేపథ్యంలో విశాఖ అభివృద్ధిలో భాగంగానే మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు, మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి డిపిఆర్‌ను ముఖ్యమంత్రి ఆమోదానికి పంపుతామన్నారు. విశాఖ మెట్రో రీజనల్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాలో 79.91 కిలో మీటర్లు లైట్‌ మెట్రో రైలు కారిడార్‌లు, 60 కిలో మీటర్ల మేర మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్‌ల అభివృద్ధి కోసం మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించామన్నారు. లైట్‌ మెట్రో, మోడ్రన్‌ ట్రామ్‌ల నిమిత్తం వేర్వేరుగా రెండు డిపిఆర్‌ల రూపకల్పనలకు యుఎంటిసి కన్సల్టెంట్‌లను నియమించామని చెప్పారు. మెట్రో డిపిఆర్‌ను నవంబర్‌ రెండో వారంలోనూ, మోడ్రన్‌ ట్రామ్‌ డిపిఆర్‌ను డిసెంబర్‌ రెండో వారంలోనూ ప్రభుత్వానికి సమర్పించనున్నామని తెలిపారు. ట్రాఫిక్‌, ఇతర అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అనంతరం 75.31 కిలో మీటర్లలో 4 కారిడార్లలో 52 స్టేషన్లను ఏర్పాటు చేయాలని కన్సల్టెంట్లు సిఫార్సు చేశారన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ - కొమ్మాది జంక్షన్‌, గురుద్వారా - పాత పోస్ట్‌ ఆఫీస్‌, తాడిచెట్లపాలెం - చిన్న వాల్తేర్‌, కొమ్మాది జంక్షన్‌ - భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ వరకు ప్రతిపాదనలను తయారు చేశామన్నారు.

తద్వారా విశాఖ మెట్రో ప్రాజెక్ట్ అంశం కొలిక్కి వస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు కూడా సాగుతున్నాయి. రాబోయే మూడేళ్లలో అది కూడా అందుబాటులోకి వస్తుంది. అప్పటికి మెట్రో సన్నాహాలు సిద్ధమయితే రాజధాని నగరంగా విశాఖ వైభవం కనిపిస్తుందని ఆశిస్తున్నారు. విజయవాడ నుంచి విశాఖకు మెట్రో రైల్ కార్యాలయం తరలిన నేపథ్యంలో తదుపరి కదలికలు వేగవంతం అయ్యే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా భవనాలు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంటే ప్రతిపాదనలకు అనుమతి ఇచ్చే ఆలోచనలో సీఎం ఉన్నట్టు చెబుతున్నారు. దాంతో విశాఖ వైపు పాలనా వ్యవహారాలు మళ్లఢం ఖాయంగానే చెప్పవచ్చు.
హైకోర్టులో విచారణలో ఉన్న కేసుల ప్రక్రియ కూడా ముగింపు దశకు వచ్చింది. తీర్పు కూడా వస్తే మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనల ప్రకారం చట్టం రూపొందించిన తరుణంలో, కేంద్రం కూడా విశాఖకు అడ్డంకులు లేవని తేల్చిచెప్పిన తరుణంలో త్వరలోనే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని అంచనాలో ఉన్నారు. అదే జరిగితే రాజధాని వ్యవహారం మరింత జోరందుకుంటుందనే చెప్పవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp