రాములమ్మ రాజకీయం

By Kranti Nov. 29, 2020, 04:20 pm IST
రాములమ్మ రాజకీయం

బీజేపీ గూటికి చేరనున్న రాములమ్మ అవకాశం దొరికినప్పుడల్లా టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తోంది. సొంతపార్టీని గులాబీ దళంలో మెర్జ్ చేసిన విజయశాంతి అటు తిరిగీ ఇటు తిరిగీ చివరకు మళ్లీ కలమం గూటికే చేరనుంది. దేశ వ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో తనకు అనువైన గుంపు అదే అని భావిస్తోంది. రేపో మాపో అధికారికంగా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న ఆమె పాత సహచరులపై ఘాటు విమర్శలు చేస్తోంది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ పంచ్ డైలాగ్ లు విసురుతోంది.

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేసీఆర్ పై రాములమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను చూసుకోవాలంటే ఇప్పుడే చూసుకోవాలని, మళ్లీ ఎప్పటికి కనిపిస్తారో తెలీదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి దొర గారిని ఒకసారి చూసుకోండి, ఇప్పట్లో ఎన్నికలు లేకుంటే మళ్లీ కనబడరు అంటూ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ బహిరంగసభలో బీజేపీ అగ్రనేతలపై విమర్శలు గుప్పించిన ముఖ్యమంత్రిపై తాజాగా మరోమారు స్పందించారు రాములమ్మ. తనలాంటి ఒక బక్కజీవిని ఢీకొనడానికి ఇంతమంది కేంద్రమంత్రులు రంగంలోకి దిగాలా అంటూ ప్రశ్నించిన కేసీఆర్ కు విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. కరోనా వైరస్ కూడా కంటికి కనిపించదని, అలాంటి వైరస్ పై ఇన్ని దేశాలు పోరాడడం సరైందేనా అని ప్రశ్నించినట్లుందన్నారు. కేసీఆర్ కరోనా వైరస్ కంటే ప్రమాదకరమని వ్యాఖ్యనించారు. దుష్టశక్తిని తుదముట్టించేందుకు దైవ శక్తులన్నీ ఒక్కటి కావల్సిందే అన్నారు. కాగా... విజయశాంతి వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగానే రాములమ్మ టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నాయి. గ్రేటర్ ఎన్నికలను అభివృద్ధికి, అరాచకానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా టీఆర్ఎస్ అభివర్ణించింది. బీజేపీ సైతం అదే స్థాయిలో స్పందిస్తోంది. టీఆర్ఎస్ పాలన అంతమయ్యే సమయం దగ్గరపడిందని, ఎప్పుడైనా మధ్యంతర ఎన్నికలు రావచ్చని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలపై రాములమ్మ చేస్తున్న విమర్శలు ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి.

కలమ దళానికి బలాన్నిచ్చేందుకే విజయశాంతి ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు అదే నిజమే అని నిరూపిస్తున్నాయి. జాతీయ పార్టీలు వరుస విజయాలు సాధించిన చోట గొప్ప అభివృద్ధి జరిగిందని, అందువల్లే ప్రజలు ఆ పార్టీలకు పట్టంగడుతున్నారని వ్యాఖ్యానించారు విజయశాంతి. ఆయా రాష్ట్రాల్లో అరాచక పాలన లేదని స్పష్టం చేశారు. రాములమ్మ ప్రస్తావించిన జాతీయ పార్టీ బీజేపీయేనని స్పష్టంగానే అర్థమవుతోంది. అధికారికంగా బీజేపీలో చేరక ముందే టీఆర్ఎస్ పై దాడిని ముమ్మరం చేసిన రాములమ్మ కమలం గూటికి చేరాక ఏస్థాయిలో దూకుడును పెంచుతుందో అర్థం చేసుకోవచ్చు. కానీ... వేరు వేరు పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలెవ్వరూ ఆ పార్టీలో ఉన్నత స్థానాలు పొందలేకపోయారని, వారికి సరైన గౌరవం దక్కలేదనే విమర్శలూ ఉన్నాయి. ఆ లెక్కన రేపొద్దున రాములమ్మ భవిష్యత్తు ఏంకానుందో ఏమో మరి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp