యుగపురుషుడు కందుకూరి వెలుగు దివ్వెనిచ్చిన రోజు

By Kotireddy Palukuri Dec. 11, 2019, 06:30 pm IST
యుగపురుషుడు కందుకూరి వెలుగు దివ్వెనిచ్చిన రోజు

మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నరోజులవి. ముక్కు పచ్చలారని చిన్నారులను పెళ్లి పీటలు ఎక్కిస్తూ ఉజ్వల భవిష్యత్తు ను ఆర్పివేస్తున్న కాలమది. ముసలి భర్త చనిపోతే ఆ చిన్నారి వితంతువై ఇంటికే పరిమితమై జీవచ్చవంలా బతుకుఈడ్చుకునే రోజులకు పులుస్టాప్ పెడుతూ ఒక వెలుగు దివ్వె దూసుకొచ్చింది. వితంతువులైన యువతుల జీవితంలో వెలుగు నింపింది. ఆ వెలుగు పేరే కందుకూరి వీరేశలింగం పంతులు.

18వ శతాబ్దంలో మూఢనమ్మకాలను పారద్రోలేందుకు ఈ భూమ్మీదుకు పంపిన యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు. రాజమహేంద్రవరం లో పుట్టిన గోదారమ్మ ముద్దు బిడ్డ వీరేశలింగం పంతులు. అయన ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లేందుకు దేవుడు పంపినట్లుగా సతీమణి రూపంలో వచ్చిన రాజ్యలక్ష్మి. ఇద్దరూ కలసి సమాజంలో మూఢనమ్మకాలను పారద్రోలేందుకు నడుం బిగించారు.

సరిగ్గా ఇదే రోజు.. 1881 డిసెంబరు 11 రాత్రి , రాజమహేంద్రవరం, గోదారి గట్టున వంకాయల వారి వీధి లోని కందుకూరి నివాసం సరికొత్త చరిత్రకు వేదికైంది. వ్యతిరేకత, సంప్రదాయం పేరున విమర్శలు, నగరంలో పెద్దలు మాటల దాడులు మధ్య కందుకూరి దంపతులు తమ నివాసంలో మొదట వితంతు పునర్వివాహం జరిపారు.

ఎలా జరిగిందంటే..

కృష్ణ జిల్లా తిరువూరు మండలం డిప్యూటీ తహసీల్దార్ దర్భా బ్రహ్మానందం కందుకూరి ఓ లేఖ రాశారు. తిరువూరు మండలం రేపూరు గ్రామంలో గౌరమ్మ అనే 12 ఏళ్ల వితంతు బాలిక ఉందని. ఆమెకు పెళ్లి చేసేందుకు బాలిక తల్లి సుముఖంగా ఉందని ఆ లేఖ సారాంశం. ఈ లేఖతో కందుకూరి లో రెట్టించిన ఉత్సహం. ఎన్నాళ్లగానో తాను అనుకుంటున్న వితంతు పునర్వివాహం జరిపించడానికి తొలి మెట్టు దొరికింది.

అదే సమయంలో విశాఖపట్టణంలో పోలీస్ శాఖలో పని చేస్తున్న గొంగులపాటి శ్రీరాములు భార్యను కోల్పోయారు. విద్యావంతుడైన శ్రీరాములుకు కందుకూరి వారి పై ఎనలేని గౌరవం. అయన ఆశయం నెరవేర్చేందుకు శ్రీరాములు ముందుకొచ్చారు.

ఇరు కుటుంబాలను రాజమహేంద్రవరం పిలిపించారు. డిసెంబర్ 11న పెళ్లి. కందుకూరి వారి స్వగృహమే వేదిక. తెల్లవారగానే ఈ వార్త పట్టణమంతా వ్యాపించింది. వంట మనిషి కందుకూరి వారికి ఇంటికి రావడం మానేసింది. అదే బాటలో పూజారి. ఇక కందుకూరి పై బంధువులు కారాలు మిరియాలు నూరారు. ఇంకేముంది... అంతా నాశనమే అంటూ శాపనార్ధాలు పెట్టారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కందుకూరి దంపతులు గౌరమ్మ, శ్రీరాములకు పునర్వివాహం జరిపించారు. 11 రాత్రి జరిగిన పునర్వివాహం స్మరిస్తూ కందుకూరి వారి నివాసంలో ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కందుకూరి దంపతులు దాదాపు 39 పునర్వివాహాలు జరిపినట్లు చరిత్ర చెబుతోంది.

అందుకే..
' ఆంద్రకేసరి' చిత్రంలో.. 'వేదంలా ఘోషించే గోదావరి.. అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి.. ' పాటలో.. '' కొట్టుకొనిపోయే కొన్ని కోటి లింగాలు.. వీరేశలింగమొకడు మిగిలెను చాలు..'' అంటూ కందుకూరి వారి ఔన్నత్యం గురించి ఒక్క మాటలో తెలియజేసారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp