వెంకటగిరి పోలీస్ స్టేషన్ మూసివేశారా?

By Raju VS Jul. 05, 2020, 03:30 pm IST
వెంకటగిరి పోలీస్ స్టేషన్ మూసివేశారా?

ఏపీలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికే ఫలితాన్నిస్తున్నాయి. అయినప్పటికీ చిన్న చిన్న ఘటనలను భూతద్దంలో చూపడం ద్వారా జగన్ సర్కారుని బద్నాం చేసే లక్ష్యంతో విపక్ష టీడీపీ, దాని అనుకూల మీడియా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ క్రమంలోనే అర్థసత్యాలు , అసత్యాలు కూడా వేగంగా ప్రచారం చేసే పని సాగిస్తున్నారు. ఇప్పటికే అలాంటి కథనాలకు సంబంధించి జీ వో 2431 ప్రకారం నోటీసులు జారీ అయ్యాయి, అయినప్పటికీ తాజాగా మరో కథనం ముందుకొచ్చింది. ఈసారి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పోలీస్ స్టేషన్ మూతపడిందని పలు మీడియా వెబ్ సైట్లలో కథనాలు వచ్చాయి. కానీ వాస్తవం దానికి పూర్తి భిన్నంగా ఉంది.

వెంకటగిరి పోలీస్ స్టేషన్ లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా వివిధ స్థాయిల్లో పోలీస్ అధికారులు వైరస్ తాకిడి పాలవుతున్నారు. ఆ క్రమంలో తమిళనాడులో ఓ డీజీ స్థాయి పోలీస్ అధికారి మరణించడం గమనార్హం. అదే విధంగా ఎస్కార్ట్ విధులకు వెళ్లిన వెంకటగిరి పోలీసులు 10మంది కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఓ హత్య కేసులో నిందితుడి వెంట ఎస్కార్ట్ గా వెళ్లిన వారికి కరోనా సోకినట్టుగా ప్రకటించారు. బాలాయపల్లి పోలీస్ స్టేషన్ లో కరోనా సోకిన వారిలో ఎటువంటి లక్షణాలు కూడా లేవని పోలీసులు ప్రకటించారు. వారిని ఇప్పటికే ఐసోలేషన్ కి కూడా తరలించి, వైద్య సహాయం అందిస్తున్నారు.

కానీ దానిని వక్రీకరించి కొందరు ఏకంగా పోలీస్ స్టేషన్ మూతపడిందంటూ ప్రసార సాధనాల్లో వార్తలు ఇవ్వడం కలకలం రేపింది. వెంకటగిరి సర్కిల్ లో మొత్తం 61 మంది అనుమానిత పోలీసులకు పరీక్షలు నిర్వహించగా అందులో 10 మందికి మాత్రమే పాజిటివ్ గా తేలింది. ఈ ఘటన వెలుగులోకి రాగానే పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని అన్ని పీఎస్ లను శానిటైజ్ చేశారు. సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దానికి మించి ఏకంగా పోలీస్ స్టేషన్ మూతపడిందనే ప్రచారానికి దిగిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవని నెల్లూరు పోలీస్ చెబుతున్నారు. అన్ని పీఎస్ లు యధావిధిగా పనిచేస్తున్నప్పటికీ ఇలాంటి ప్రచారానికి దిగడం సరికాదని హెచ్చరిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp