వంటింటిని తాకుతున్న ధరల సెగ

By Jaswanth.T Sep. 28, 2020, 07:40 pm IST
వంటింటిని తాకుతున్న ధరల సెగ

ఒక పక్క ఉద్యోగాలు కోల్పోవడం, మరో పక్క చేస్తున్న ఉద్యోగం ఉంటుందో? ఊడుతుందో? అర్ధం కాని పరిస్థితిని కోవిడ్‌ కాలంలో ఉద్యోగజీవులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఇతర రంగాల్లోని వారు సైతం వారివారి ఇబ్బందుల్లో వారున్నారు. దాదాపుగా ప్రజలందరినీ ఏదో ఒక వైపు నుంచి కరోనా రూపంలో ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ఆరోగ్య పరంగానా? ఆర్ధికంగానా? సామాజికంగా? అన్నది పక్కన పెడితే ఇబ్బంది మాత్రం అందరికీ కామన్‌గానే వచ్చింది.

అయితే ఇప్పుడిప్పుడే జనజీవనం గాడిన పడుతున్న వేళ వంటింటికీ ధరల సెగ పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, వంట నూనెల ధరల రోజు రోజుకు పెరుగూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న, మధ్యతరగతి జీవులకు ధరాభారం తప్పడం లేదు. ఎప్పటికి పరిస్థితులు సాధారణం అవుతాయన్న ప్రశ్నకు కొమ్ములు తిరిగిన ఆర్ధిక వేత్తలు కూడా ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో చేతిలో ఉన్న సొమ్మును పొదుపుగా ఖర్చు చేసుకునేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దీని ప్రభావం మార్కెట్‌పై కూడా కన్పిస్తోంది. సాధారణంగా కొనుగోలు చేసే నిత్యావసర వస్తువుల కంటే తక్కువ పరిమాణంలోనే కొనుగోలు చేస్తున్నట్లు పలు సర్వేలు తేల్చాయి.

ఇటువంటి పరిస్థితుల్లో ధరల పెరుగుదల సామాన్య, మధ్య తరగతిపై తీవ్ర ప్రభావాన్నే చూపుతుందని చెప్పాలి. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులకు తోడు వాతావరణం కూడా సహకరించక పోవడంతో ప్రస్తుతం ధరలకు రెక్కలొస్తున్నాయని చెబుతున్నారు. వర్షాలు విపరీతంగా కురుస్తున్న నేపథ్యంలో ఉద్యాన, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో కూరగాయల ధరల్లో రెట్టింపు పెరుగుదల కన్పిస్తోంది. «

దరలను స్థిరంగా ఉంచడంలో రవాణా సదుపాయాలు కూడా కీలకంగా పనిచేస్తాయి. రవాణా సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఉల్లి వంటి నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులను దాటేస్తున్నాయి. దీనితోడు వంట నూనె ధరలు కూడా పెరుగుతోంది. లీటరు రూ. 30ల వరకు వంటనూనెల ధరల్లో పెరుగుల నమోదైంది. ఫ్యూచర్‌మార్కెట్‌లో తాను ఎప్పుడూ కొనే సరుకుకంటే ఎక్కువ సరుకుని చైనా కొనేయడంతో మార్కెట్‌లో డిమాండ్‌ ఏర్పడిందని చెబుతున్నారు. దీని కారణంగానే ధరలు పెరుగుతున్నాయని వివరిస్తున్నారు. సరిహద్దుల వద్ద నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలోనే చైనా ఈ విధంగా వ్యవహరిస్తోందన్న వాదన కూడా లేకపోలేదు.

ఏది ఏమైనా ఒకవైపు ప్రకృతి, మరో వైపు అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఏర్పడుతున్న ధరల సెగ సామాన్య, మధ్యతరగతి ప్రజల వంట గదిని నేరుగానే తాకుతుందనే చెప్పాలి. ప్రజల్లో ఆర్ధిక స్థిరత్వం లేనప్పుడు ఇలా ధరల పెరుగుదల అంతిమంగా వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్నే మిగులుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధరలు భారీగా పెరిగితే ప్రజలు కొనుగోలు శక్తి సన్నగిల్లుతుందని, అంటే సమృద్దిగా ఆహారం తీసుకోవడం తగ్గుతుందని దాని ద్వారా వారిలో రోగనిరోధక శక్తి తగ్గడానికి కారణమవుతుందని వివరిస్తున్నారు. ఈ వలయంలో ఏది ఎక్కువైనా లేదా తక్కువైనా అంతిమంగా బాధ్యత ప్రభుత్వాలపైనే పడుతుంది. కాబట్టి ముందస్తు వ్యూహాలతో పెరిగే ధరల కట్టడికి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరముందని పలువురు సూచిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp