భారత్ బయోటెక్ కు అమెరికాలో ఎదురుదెబ్బ

By Ramana.Damara Singh Jun. 11, 2021, 04:01 pm IST
భారత్ బయోటెక్ కు అమెరికాలో ఎదురుదెబ్బ

దేశీయ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ కు అమెరికాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోవిడ్ సోకకుండా కాపాడే కోవాగ్జిన్ వ్యాక్సిన్ రూపొందించిన ఈ సంస్థ దాని అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ చేసిన దరఖాస్తును అమెరికా ప్రభుత్వం తిరస్కరించింది. కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ వివరాలు లేనందునే ఈ దరఖాస్తును తిరస్కరించినట్లు అమెరికాలో ఔషధాలు, వ్యాక్సిన్లకు అనుమతుల జారీ ప్రక్రియను పర్యవేక్షించే ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీ ఏ) విభాగం స్పష్టం చేసింది. అదనపు సమాచారంతో అత్యవసర వినియోగానికి కాకుండా బయలాజిక్స్ లైసెన్స్ అప్లికేషన్ (బీఎల్ ఏ) కోసం దరఖాస్తు చేయాలని సూచించింది. కోవాగ్జిన్ కు అంతర్జాతీయ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్న బయోటెక్ సంస్థకు ఇది పెద్ద దెబ్బే. దీనివల్ల అమెరికాలో ఈ వ్యాక్సిన్ వినియోగంలోకి రావడం మరింత ఆలస్యమవుతుంది.

మూడో దశ ఫలితాల డేటా లేకుండానే..

కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐసీఎంఆర్, ఎంఐవీల సహకారంతో భారత్ బయోటెక్ కోవిడ్ నియంత్రణకు పూర్తి దేశీయ టీకా కోవాగ్జిన్ ను అభివృద్ధి చేసింది. దీన్ని మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే వినియోగ అనుమతులు ఇవ్వాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం మూడో దశ ట్రయల్స్ పూర్తి కాకముందే కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. దాంతో ఉత్పత్తి ప్రారంభించి.. వ్యాక్సినేషన్ కూడా మొదలు పెట్టేశారు. ఇరుగు పొరుగు దేశాలకు సైతం ఎగుమతి చేశారు. ఇదేరీతిలో అమెరికాలోనూ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ భారత్ బయోటెక్ అమెరికన్ పార్ట్నర్ అయిన ఆక్యుజెన్ సంస్థ ఎఫ్డీ ఏ అధికారులకు దరఖాస్తు చేసింది. సంస్థ సమర్పించిన మాస్టర్ ఫైల్ ను పరిశీలించిన అధికారులు మూడోదశ క్లినికల్ ట్రయల్స్ డేటా, మరికొంత ఆదనపు సమాచారం కోరారు. ఆ వివరాలతో బయలాజిక్స్ లైసెన్స్ అప్లికేషన్ కోసం దరఖాస్తు చేయాలని సూచిస్తూ ఫైల్ ను తిప్పి పంపారు. దీనిపై ఆక్యుజెన్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ శంకర్ ముసునూరి స్పందిస్తూ.. ఎఫ్డీ ఏ కోరిన అదనపు సమాచారంతో పూర్తి స్థాయి అనుమతుల కోసం దరఖాస్తు చేస్తామన్నారు. ఈ పరిణామం వల్ల అమెరికాలో కోవాగ్జిన్ వినియోగంలోకి రావడం మరికొంత ఆలస్యం అవుతుందని అన్నారు.

అంతర్జాతీయంగా ఇబ్బందులు

మనదేశంలో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు పొందిన బయోటెక్ యాజమాన్యం ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు విదేశాల అనుమతులు పొందడంలో కొంత నిర్లక్ష్యం వహించింది. మూడో దశ ట్రయల్స్ డేటా లేకపోవడం లోపంగా మారింది. ఇదే కారణంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) కూడా ఇంతవరకు కోవాగ్జిన్ ను గుర్తించలేదు. పలు యూరోపియన్ దేశాలు కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు ఇబ్బంది పడుతున్నారు. గుర్తింపులేని కోవాగ్జిన్ టీకా వేసుకున్న వారిని పలు దేశాలు అనుమతించడంలేదు. అయితే కెనడా ప్రభుత్వం కోవాగ్జిన్ కు అనుమతి ఇచ్చింది డాక్టర్ శంకర్ వెల్లడించారు.

Also Read : మాజీ కాబోతున్న బీద రవిచంద్ర .. టీడీపీలో కలవరం..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp