ఎమ్మెల్సీగా రంగీలా ఫేమ్‌..?

By Srinivas Racharla Oct. 31, 2020, 04:39 pm IST
ఎమ్మెల్సీగా రంగీలా ఫేమ్‌..?

దేశ ఆర్థిక రాజధాని ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) అని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రంగీలా ఫేమ్‌ ఊర్మిళా మంతోడ్కర్‌కి చట్టసభలలో ప్రవేశించే అవకాశాన్ని తెచ్చిపెట్టింది.

గత సార్వత్రిక ఎన్నికల ముందు ప్రముఖ నటి ఊర్మిళా మంతోడ్కర్‌ బాలీవుడ్ నుంచి రాజకీయాలలోకి ఆరంగేట్రం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా నటి ఊర్మిళా మంతోడ్కర్‌ నార్త్ ముంబై నుంచి బరిలోకి దిగారు. కానీ బిజెపి అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో 4.6 లక్షల ఓట్ల తేడాతో ఆమె ఓటమి చవి చూశారు. అయితే పార్టీలో స్థానిక నాయకుల మధ్య సమన్వయ లోపం,క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సరిగా పని చేయకపోవడం, అభ్యర్థులకు నిధులు సమకూర్చకపోవడం వంటి సమస్యల వల్లనే తాను ఓడిపోయానని సొంత పార్టీని విమర్శించారు. పార్టీలో నెలకొన్న అంతర్గత రాజకీయాల కారణంగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తర్వాత బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ముంబైపై చేసిన పీవోకే వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఊర్మిళా శివసేనకు దగ్గరయ్యారు.

ఇక మహారాష్ట్ర శాసనమండలిలోని గవర్నర్ కోటాలో ఖాళీ అయిన 12 ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం మహా వికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది.గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలగా సాహిత్యం, కళలు, శాస్త్ర, సాంకేతిక రంగాలు, సామాజిక సేవ చేసిన వారిని మండలికి నామినేట్ చేస్తారన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంలో భాగస్వాములైన శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ సమాన ప్రాతిపదికపై ఒక్కొక్క పార్టీ నుండి నలుగురు చొప్పున ఎమ్మెల్సీగా ప్రతిపాదించనున్నారు. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ నుంచి హీరోయిన్ ఊర్మిళా మంతోడ్కర్‌ని సీఎం ఉద్ధవ్ థాక్రే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యే జాబితాలో మరాఠీ నటుడు ఆదాశ్ భండేకర్, సింగర్‌ ఆనంద్‌ షిండేతో పాటు ఇటీవల బిజెపి కి రాజీనామా చేసి ఎన్సీపీ చేరిన సీనియర్ నేత ఏక్‌నాథ్‌ ఖడ్సే పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

కాగా మూడు భాగస్వామ్య పక్ష పార్టీలు ప్రతిపాదిత ఎమ్మెల్సీల జాబితాను సీఎం ఉద్దవ్ థాకరేకి సమర్పించాల్సి ఉంది. తర్వాత మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదించి గవర్నర్ ఆమోదానికి ఆ జాబితాను పంపిస్తారు. ఇక కాంగ్రెస్ నుంచి ఎటువంటి అభ్యంతరం లేకపోతే లోక్‌సభ ఎన్నికలలో ఓడినప్పటికీ ఎమ్మెల్సీగా చట్టసభలలోకి అడుగుపెట్టే అదృష్టం ఊర్మిళా మంతోడ్కర్‌కి దక్కనుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp