ఆ చ‌ట్టం.. శాసనసభ ఎన్నికలకు వ‌ర్తింప చేస్తే సగం మంది ఎమ్మెల్యేలు ఔట్‌!

By Kalyan.S Jul. 16, 2021, 09:10 pm IST
ఆ చ‌ట్టం.. శాసనసభ ఎన్నికలకు వ‌ర్తింప చేస్తే సగం మంది ఎమ్మెల్యేలు ఔట్‌!

జనాభా నియంత్రణ చ‌ట్టం - 2021.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. జనాభా నియంత్రణలో భాగంగా ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్యానాథ్‌ ఆధ్వర్యంలో యూపీ సర్కార్ తెరపైకి తెచ్చిన ఈ చ‌ట్టం ముసాయిదాను ఈ నెల 19న ప్రారంభ‌మ‌య్యే పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనే కొంత మంది ఎంపీలు వేర్వేరుగా ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఇక్క‌డ విశేషం ఏంటంటే.. నలుగురు పిల్లలున్న యూపీలోని గోరఖ్‌పూర్‌ బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్‌.. జనాభా నియంత్రణ బిల్లును (ప్రైవేటు) పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఈ బిల్లును శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు కూడా వ‌ర్తింప చేస్తే యూపీలో ప్ర‌స్తుతం ఇప్పుడున్న ఎమ్మెల్యేల‌లో స‌గం మంది త‌ర్వాతి ఎన్నిక‌ల్లో పోటీ చేసే అర్హ‌త‌ను కోల్పోతారు. ఎందుకంటే వారంద‌రికీ ముగ్గురు అంత‌కంటే ఎక్కువ పిల్ల‌లున్నారు.

ఇటీవ‌ల ఉత్తరప్రదేశ్ ప్ర‌భుత్వం జనాభా నియంత్రణ-2021 పేరుతో ముసాయిదా బిల్లును సిద్ధం చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఇద్దరు కన్నా ఎక్కువమంది పిల్లలున్న వారు స్థానిక ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులు. ఉత్తరప్రదేశ్‌ జనాభా నియంత్రణ ముసాయిదా బిల్లు చట్టమై.. దాన్ని రాష్ట్ర అసెంబ్లీకి కూడా వర్తింపచేస్తే సగం మంది అధికార బీజేపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడనుంది. ఎందుకంటే 304 మంది అధికార బీజేపీ ఎమ్మెల్యేల్లో 152 మందికి (సరిగ్గా సగం) ముగ్గురు అంతకంటే ఎక్కువమంది పిల్లలున్నట్టు తేలింది. యూపీ అసెంబ్లీ వెబ్‌సైట్‌లో 397 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అధికారిక వివరాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది.

Also Read : ప్రతి పదం ఆలోచించి రాశాం.. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ గెజిట్లపై కేంద్ర జలశక్తి శాఖ

జనాభా నియంత్రణ చ‌ట్టం ప్ర‌కారం.. ఇద్దరు కన్నా ఎక్కువమంది పిల్లలున్న వారు స్థానిక ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులు. అలాగే ఇలాంటివారు ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోడానికి, ఉద్యోగులైతే పదోన్నతులు పొందడానికి వీలుండదు. ప్రభుత్వ సబ్సిడీలు పొందడానికీ ‘పిల్లల’ నిబంధన తప్పనిసరి చేయనున్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యేల విషయానికి వస్తే.. ఒకరికి ఏకంగా 8 మంది పిల్లలున్నారు. మరొక ఎమ్మెల్యేకి ఏడుగురు ఉన్నారు. ఎనిమిది మందికి ఆరుగురు, 15 మందికి ఐదుగురు, 44 మందికి నలుగురు చొప్పున, 83 మందికి ముగ్గురు పిల్లలున్నారు. జనాభా నియంత్రణ చట్టాన్ని శాసనసభ ఎన్నికలకు కూడా వర్తింపచేస్తే వీరంతా తమ పదవులను కోల్పోవడం ఖాయం.

ఇక, దేశ జనాభా నియంత్రణ కోసం కొంతమంది ఎంపీలు ఈ వర్షాకాల సమావేశాల్లో వేర్వేరుగా ప్రైవేటు మెంబర్స్‌ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. నలుగురు పిల్లలున్న యూపీలోని గోరఖ్‌పూర్‌ బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్‌.. జనాభా నియంత్రణ బిల్లును(ప్రైవేటు) పార్లమెంటు వర్షాకాల సమావేశంలోనే ప్రవేశపెట్టనున్నారు. ఇద్దరుకన్నా ఎక్కువమంది పిల్లలున్నవారు ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి, సర్కార్‌ అందించే రాయితీలను పొందడానికి అనర్హులుగా గుర్తించాలన్నది ఆయన ప్రవేశపెట్టనున్న ప్రైవేటు బిల్లు సారాంశం. కాగా, 168 మంది సిట్టింగ్‌ ఎంపీలకు ఇద్దరు కన్నా ఎక్కువమంది పిల్లులున్నట్టు లోక్‌సభ వెబ్‌సైట్‌ చెబుతోంది. వీరిలో బీజేపీ ఎంపీలే 105 మంది ఉన్నారు.

యూపీ జనాభా నియంత్రణ చట్టం అమల్లోకి వస్తే దాని ప్రభావం అణగారిన ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలపైనే తీవ్రంగా ఉండనుంది. ‘పిల్లల నిబంధన’ అమలుద్వారా అమలుకానున్న ప్రోత్సాహాకాల వల్ల ఉన్నత కులాల్లోని ధనికులే తక్షణం లబ్ధిపొందనున్నారు. సంతానోత్పత్తిస్థాయిలకు సంబంధించిన అందుబాటులో ఉన్న గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. పునరుత్పత్తి రేటు ఎస్సీల్లో 3.1 శాతం, ఎస్టీల్లో 3.6 శాతం, ఓబీసీల్లో 2.8 కాగా, ఇతరుల్లో ఇది 2.3 శాతంగా ఉంది. సామాజిక, ఆర్థిక వెనకబాటుతనమే సంతానోత్పత్తి రేటు అధికంగా ఉండడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ బిల్లుపై ఇప్పుడు అటు రాజ‌కీయంగాను, ఇటు సామాజికంగాను తీవ్ర దుమారం రేగుతోంది. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో దీనిపై ఎటువంటి చ‌ర్చ/ర‌చ్చ జ‌రుగుతుందో చూడాలి.

Also Read : జగన్‌ తపన ప్రధానికి అర్థం అవుతుందా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp