UP elections - యూపీలో ఎస్పీ-ఆప్ జోడీ -అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సరికొత్త సవాల్

By Ramana.Damara Singh Nov. 25, 2021, 05:15 pm IST
UP elections - యూపీలో ఎస్పీ-ఆప్ జోడీ  -అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సరికొత్త సవాల్

ఉత్తర్‌ప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో అధికార బీజేపీ సరికొత్త సవాల్ ఎదురుకానుంది. యూపీ ఎన్నికల బరిలో తొలిసారి పోటీకి సిద్ధం అవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలి అడుగులోనే కొత్త సమీకరణానికి తెరతీసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. అసలే ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న బీజేపీకి ఈ కొత్త కూటమి సమస్యగా పరిణమించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

గత ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై అనేక కారణాల వల్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. ఇటీవల వెలువడిన ప్రీ పోల్ సర్వేలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. కమలం మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ సీట్ల సంఖ్య మాత్రం 220-230 స్థాయికి పడిపోయి బొటాబొటీ మెజారిటీ దక్కుతుందని సర్వేలు అంచనా వేశాయి. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ తన సీట్లను 150 వరకు పెంచుకోవచ్చని అంచనా వేశాయి. ఈ స్థితిలో ఎస్పీకి ఆప్ తోడైతే బీజేపీకి గెలుపు అంత ఈజీ కాదని అంటున్నారు.

యూపీ బరిలో తొలిసారి ఆప్

సామాన్యుడి పార్టీగా ఢిల్లీలో కొన్నేళ్ల నుంచి అధికారంలో కొనసాగుతున్న ఆప్ ను ఇతర రాష్ట్రాల్లో విస్తరించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో పోటీకి చాన్నాళ్ల క్రితం నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పంజాబ్‌ లో  కేజ్రీవాల్ పార్టీయే ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ప్రీ పోల్ సర్వేలు అంచనా వేశాయి. మరోవైపు యూపీలో కూడా సత్తా చాటాలని ఆప్ భావిస్తోంది. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా అక్కడి ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీతో జత కట్టింది. లక్నోలో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో ఆప్ యూపీ ఇంఛార్జి, ఎంపీ సంజయ్ సింగ్ జరిపిన చర్చల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలనే ఒప్పందానికి వచ్చారు. ఉమ్మడి అజెండా, సీట్ల పంపకాలపై కూడా చర్చలు మొదలయ్యాయని సంజయ్ సింగ్ చెప్పారు.

బీజేపీ వ్యతిరేక శక్తుల కలయిక

సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికే జయంత్ సింగ్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ)తో పొత్తు కుదుర్చుకుంది. యూపీలో అధిక సంఖ్యలో ఉన్న జాట్ వర్గంలో ఈ పార్టీకి గట్టి పట్టు ఉంది. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జాట్ రైతులే ఉద్యమాన్ని నిర్మించారు. ఆర్ ఎల్డీ వారికి వెన్నుదన్నుగా నిలిచింది. ఎస్పీతో ఆ పార్టీకి పొత్తు ఉండటంతో జాట్ ఓటర్లు ఆ కూటమి వైపు మొగ్గు చూపుతారు. తాజాగా ఆప్ కూడా కలవడంతో కూటమి బలం మరింత పెరిగి బీజేపీకి పరిస్థితి సంక్లిష్టం అవుతుంది. ప్రధానంగా పశ్చిమ యూపీలో ఎక్కువ సీట్లను ఆప్ ఆశిస్తోంది. ఢిల్లీలో వలస జీవనం సాగిస్తున్న లక్షలాది యూపీ వాసులు కొన్నేళ్లుగా ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ది పొందుతున్నారు. అదీ కాకుండా ఢిల్లీ సమీపంలోని నోయిడా, ఘజియాబాద్, గౌతమబుద్ధ నగర్, మీరట్ జిల్లాల్లో ఆప్ చాలా కాలంగా విస్తృత కార్యకలాపాలు నిర్వహిస్తూ గట్టి పునాదులు వేసుకుంది. ఇవన్నీ ఎన్నికల్లో ఎస్పీ ఆధ్వర్యంలోని కూటమికి మేలు చేస్తాయని భావిస్తున్నారు.

Also Read : Up Congress - పోరాడుతున్నా ప్రయోజనం లేదు. యూపీలో కాంగ్రెస్‌ నామమాత్రమేనా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp