Up congress - పోరాడుతున్నా ప్రయోజనం లేదు. యూపీలో కాంగ్రెస్‌ నామమాత్రమేనా?

By Prasad Nov. 25, 2021, 09:30 am IST
Up congress - పోరాడుతున్నా ప్రయోజనం లేదు. యూపీలో కాంగ్రెస్‌ నామమాత్రమేనా?

దేశానికి ఎక్కువ మంది ప్రధానులను అందించిన రాష్ట్రంగానే కాదు... నెహ్రూ.. గాంధీ కుటుంబాలకు కంచుకోటగా గుర్తింపు పొందిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. జవహర్లాల్‌ నెహ్రూ.. ఫిరోజ్‌ గాంధీ.. ఇందిరా గాంధీ... సంజయ్‌ గాంధీ... రాజీవ్‌గాంధీ.. సోనియా గాంధీ... రాహూల్‌ గాంధీ... ఇలా దేశ ప్రధానులు.. ఇందిర కుటుంబంలో కీలక సభ్యులు ఉత్తరప్రదేశ్‌ నుంచే పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు. వీరిలో ముగ్గురు దేశ ప్రధానులుగా సేవలందించారు. కాంగ్రెస్‌కు... అటు ఇందిర కుటుంబానికి ఉత్తరప్రదేశ్‌ అతి పెద్ద బలం. ఇప్పుడు అదే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ... ఇందిర కుటుంబం ఉనికికోసం పాట్లు పడుతోంది. ఇందిర ముఖ కవళికలతో పుట్టి.. మరో ఇందిరగా అభిమానుల నుంచి పిలుపించుకునే ప్రియాంక గాంధి కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నా ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ పుంజుకోవడం లేదు. యోగి ఆధిత్యనాథ్‌ ప్రభుత్వంపై అలుపులేని పోరాటం చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం దక్కడం లేదు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఓట్లు.. సీట్లు పెరుగుతాయని సర్వేలు చెబుతున్నా అవి వేళ్లమీద లెక్కపెట్టుకునే స్థాయిలోనే ఉండడంతో ఆ పార్టీకి మింగుడుపడని అంశంగా మారింది.

ఉత్తరప్రదేశ్‌కు వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కేవలం ఆరు నుంచి పది అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చే అవకాశముందని ఏబీపీ ` సీ వోటరు సర్వేలో వెల్లడయ్యింది. ఈ ఒక్క సర్వేనే కాదు.. యూపీ ఎన్నికలు దగ్గర నుంచి పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు సైతం కాంగ్రెస్‌ పార్టీ విజయంపై ఇంతకన్నా పెద్ద నమ్మకం లేదు. ఎన్నికలు ప్రకటించిన తరువాత ఆ పార్టీ కొద్దిమేర పుంజుకుంది. గత సెప్టెంబరులో అయితే కేవలం మూడు నుంచి ఏడు సీట్లు మాత్రమే వస్తాయని తేలింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ సాధించింది కూడా ఏడు స్థానాలు మాత్రమేకావడం విశేషం. 2017లో ఆ పార్టీ కేవలం 6.3 శాతం ఓట్లు మాత్రమే సాధించగా, ప్రస్తుత ఎన్నికల్లో 8.9 శాతం వస్తుందని తేలింది. ఈ పెరుగుదల వల్ల ఆ పార్టీకి పెద్దగా ప్రయోజనం లేదు. ఇక్కడ అన్నీతానై పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోరాడుతున్నారు.

ఇటీవల యూపీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు వెళుతున్న కాన్వాయ్‌ ఢీ కొట్టిన ఘటనలో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, మాయావతి కన్న ప్రియాంకా గాంధీ ఎక్కువగా పోరాటం చేసింది. గత నాలుగేళ్లుగా ప్రియాంక గాంధీ యూపీలో పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలయాలకు వెళుతూ హిందూ వ్యతిరేక ముద్రను తొలగించుకుంటున్నారు. మహిళ, యువత ఓట్లు లక్ష్యంగా పలు ఎన్నికల తాయిళాలు ప్రకటిస్తున్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహూల్‌ గాంధీల కన్నా కాంగ్రెస్‌ పార్టీలో  ప్రియాంక గాంధీనే చమటోడుస్తున్నారు. అయినా కాంగ్రెస్‌ పార్టీకి మైలేజ్‌ రావడం లేదు.

యూపీలో ప్రాభల్యం కోల్పోయిన తరువాతనే కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి రాలేని పరిస్థితి నెలకొంది. 1989 అసెంబ్లీ ఎన్నికల తరువాత నుంచి ఆ పార్టీ క్రమేపీ తన ఉనికిని కోల్పోతూ వచ్చింది. 1951లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 388 స్థానాలు సాధించింది. తరువాత 1957లో జరిగిన ఎన్నికల్లో 286, 1962లో (249), 1967లో (199), 1969లో (211), 1974లో (215), 1977లో (47), 1980లో (309), 1985లో (269), 1989లో (94), 1991లో (46), 1993లో (28), 1996లో (33), 2002లో (25), 2007లో (25), 2012లో (28), 2017లో కేవలం తొమ్మిది స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 1985లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 269 సీట్లు సాధించింది.

ఉత్తరప్రదేశ్‌లో చివరిసారిగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ ఎన్నికల్లోనే. 1988 నుంచి 1989 వరకు పనిచేసిన నారాయణ్‌దత్‌ తివారి చివరి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి. ఆ తరువాత నుంచి ఆ పార్టీ పతనం మొదలైంది. ఇక సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పీ), బహుజన సమాజ్‌వాది పార్టీ (బీఎస్పీ)లు రంగంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్‌ పార్టీ నామమాత్రంగా మారిపోయింది. వచ్చే ఏడాది ఆరంభంలో జరగబోయే ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, ఎస్పీల మధ్యనే ఉండనుందని సర్వేలు, మీడియా తేల్చి చెబుతున్నాయి. ఇదే ప్రియాంక ఆశలు ఆవిరి చేస్తున్నాయి. తాజా సర్వేలలో సమాజ్‌వాది పార్టీకి ఆశాజనకంగాను, బీఎస్సీ, కాంగ్రెస్‌ పార్టీలకు స్వల్పంగా ఓట్లు శాతం పెరుగుతున్నాయని చెబుతున్నాయి. ఈ మూడు పార్టీలు జట్టు కడితే కాంగ్రెస్‌ పార్టీకి సీట్లు పెరిగే అవకాశముందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp