లద్దాఖ్‌ వద్ద పరిస్థితిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ప్రకటన

By Srinivas Racharla Sep. 15, 2020, 06:33 pm IST
లద్దాఖ్‌ వద్ద పరిస్థితిపై  కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ప్రకటన

భారత్‌ - చైనా సరిహద్దులలో తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. 1962లో భారత్‌,చైనా మధ్య జరిగిన యుద్ధం సందర్భంగా లద్దాఖ్‌లో 90వేల చదరపు కి.మీల భారత భూభాగాన్ని డ్రాగన్‌ దేశం ఆక్రమించిందని లోక్‌సభలో వెల్లడించారు.అప్పటినుండి చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదని,ఎల్ఏసీ విషయంలో ఇరు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయని తెలిపారు.

సరిహద్దు సమస్య తేలేవరకు ఎల్‌ఏసీని గౌరవించాలన్న నిర్ణయాన్ని చైనా తరుచు ఉల్లంఘిస్తోందని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.గత మే నెల నుంచి సరిహద్దులకు పెద్ద ఎత్తున సైన్యాన్ని తరలించిన చైనా భారీగా ఆయుధాలను మోహరించినట్లు ఆయన వివరించారు.భారత్‌ కూడా అందుకు దీటుగా సైన్యాన్ని సరిహద్దుకు తరలించిందన్నారు. అలాగే లద్దాఖ్‌ వద్ద సరిహద్దులను మార్చాలన్న చైనా కుట్రను మన సైన్యం తిప్పికొట్టిందని కేంద్ర రక్షణ మంత్రి పేర్కొన్నారు.గల్వాన్‌ ఘర్షణల అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ లద్దాఖ్‌ వెళ్లి సైనికులను కలిశారని సభ దృష్టికి ఆయన తీసుకొచ్చారు.

దౌత్య మార్గంలో సామరస్య చర్చలతో సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి భారత్ ప్రయత్నిస్తున్నట్లు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉద్ఘాటించారు.చైనాతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నాం.ద్వైపాక్షిక సంబంధాల కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.కానీ డ్రాగన్ దూకుడు చర్యలతో శాంతి ఒప్పందానికి తూట్లు పడుతున్నట్లు ఆరోపించారు.ఆగస్టులో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిందని, చైనా ఏకపక్ష చర్యల్ని ఖండిస్తున్నామన్నారు.

1993,1996 ఒప్పందాలను చైనా ఉల్లంఘించిందని మండిపడ్డారు.ఇప్పటికైనా ఎల్‌ఏసీని గౌరవించి సరిహద్దులో శాంతి నెలకొల్పడానికి తమతో కలిసి నడవాలని చైనాను కోరుతున్నామని పేర్కొన్నారు.భారత్‌ ఎప్పుడూ శాంతి, సామరస్యమే కోరుకుంటుంది. సంప్రదింపులు,చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవాలి అనేదే భారత విధానమని రష్యాలో జరిగిన సమావేశంలో చైనా రక్షణ మంత్రికి స్పష్టం చేశామని కేంద్ర రక్షణ మంత్రి లోక్ సభలో పునరుద్ఘాటించారు.

ఆగస్టు 29, 30 తేదీలలో రాత్రి పూట భారత సరిహద్దులను మార్చాలని చైనా చేసిన ప్రయత్నాన్ని మన సైన్యం తిప్పికొట్టింది.దేశ సౌర్వభౌమత్వ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని,ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సరిహద్దులో బలగాలను మరింత పెంచాం.తీవ్ర కఠిన పరిస్థితులలోనూ డ్రాగన్ ఆర్మీని భారత సైనికులు నిలువరించారని పేర్కొన్నారు.పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కదలికలను నిరంతరం నిశితంగా గమనిస్తున్నామని వివరించారు.సరిహద్దులలో మౌలిక సదుపాయాలను సమకూర్చామని ఆయన తెలిపారు.దేశం మొత్తం సైన్యం వెంటే ఉందని రాజ్‌నాథ్‌ ప్రకటించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp