యునెస్కో గుర్తింపు : రామప్ప ఆలయం.. విశిష్టతలకు నిలయం

By Kalyan.S Jul. 26, 2021, 07:31 am IST
యునెస్కో గుర్తింపు : రామప్ప ఆలయం.. విశిష్టతలకు నిలయం

అక్కడి రాళ్లను మీటితే స్వరాగాలు పలుకుతాయి. ఆ శిల్పాలు అద్భుత శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనాలు. ఎనిమిది వందల ఏళ్ల నాటి ఆ కట్టడ నిర్మాణశైలి నేటి ఇంజనీరింగ్‌ నిపుణులను సైతం అబ్బురపరుస్తుంది. ఇసుక పునాదులు, నీటిలో తేలియాడే ఇటుకలు ఏ నిర్మాణంలోనూ కనిపించవు. అదెలాగో ఆధునిక నిపుణులకు కూడా అంతుచిక్కని రహస్యం. ఏనుగు పేడ, తవుడు, కరక్కాయి, చెట్టజిగురు తదితర వాటి మిశ్రమంతో తయారు చేసిన ఇటుకలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఆలయ గోపురాన్ని నిలబెడుతున్నాయి. ఎన్నో విశిష్టతలు గల ఆ కట్టడమే.. రామప్ప ఆలయం. ప్రపంచ వారసత్వ గుర్తింపుతో నేడు అందరి దృష్టీ ఆకర్షిస్తోంది.

శిల్పి పేరుతో ప్రాచుర్యంలోకి...
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో ఈ రామప్ప ఆలయం ఉంది. కాకతీయుల కాలంలో క్రీ.శ. 1213 సంవత్సరంలో గణపతి దేవుడి కాలానికి చెందిన సైన్యాధిపతి రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించినట్లు చరిత్ర చెబుతోంది. దేవుడి పేరుతో కాకుండా ఆలయాన్ని నిర్మించిన ప్రధాన శిల్పి రామప్ప పేరుతో ప్రాచుర్యం పొందడం గొప్ప విశిష్టత. ఆ కాలంలో శిల్పులకు ఎంత ప్రాధాన్యం ఉండేదో తెలియజేస్తుంది. శిల్పి పేరుతో పాటు ఆలయంలో ఉన్న శివుడి పేరు కలిపి రామలింగేశ్వరుడిగా గుర్తింపు పొందినట్లు స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ రాముడు, శివుడు ప్రధాన దేవుళ్లుగా ఉంటారు. గర్భాలయంలోని ఎత్తైన పీఠంపై నల్లని నునుపురాతితో చెక్కిన పెద్ద శివలింగం ఆలయంలో దర్శనమిస్తుంది.

అద్భుతం.. శిల్ప కళా వైభవం
ఆలయ మహామండపం మధ్యభాగంలో ఉన్న కుంఢ్యస్తంభాలు, వాటి దూలాలపై అతి రమణీయమైన శిల్పాలు చెక్కపడ్డాయి. రామాయణ, పురాణ, ఇతిహాస గాథలతో అవి నిండి ఉండడం ఆశ్చర్యం కలిగిస్తాయి. వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మధనిక, నాగిణి శిల్పాలు కాకతీయుల శిల్ప నైపుణ్యానికి నిదర్శనం. అతి సూక్ష్మమైన శిల్పాలు ఇక్కడ కొలువుదీరాయి. ఆలయం బరువును మోస్తున్నట్లుగా వందలాది ఏనుగుల శిల్పాలను చెక్కారు. ఒక ఏనుగుతో మరో ఏనుగురే సంబంధం లేకుండా భిన్నంగా ఉండడం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది.

ఏ దిక్కున చూసినా మనవైపే..
ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ నంది. ఏ దిక్కు నుంచి చూసినా అది మన వైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది. నాటి శిల్పుల అద్భుత పనితీరుకు ఇది ఒక నిదర్శనం. శివుడు ఎదురుగా ఉన్న నంది శివుడి ఆజ్జ కోసం ఎదురుచూస్తున్నట్టు చెవిని లింగం వైపు పెట్టి లేవడానికి తయారుగా ఉన్నట్టుగా శిల్పి దీన్ని మలిచారు. దీంతోపాటు ఆలయంలో ఉన్న మండపం నిర్మాణం అద్భుతం. భూకంపాలు, దండయాత్రలతో కొద్దిగా ఆలయం శిథిలమైనా, నేటికీ చెక్కు చెదరకుండా ఎనిమిది వందల ఏళ్లనాటి ఈ కట్టడం చారిత్రక వైభవాన్ని చాటుతోంది.

నేటికి నెరవేరిన కల
రామప్ప ఆలయానికి వారసత్వ గుర్తింపు కోసం కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు, రాష్ట్ర ప్రభుత్వాలు తొమ్మిదేళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. తొలిసారిగా 2012లో యునెస్కోకు నామినేట్‌ అయింది. తర్వాత 2013, 14, 19లో కూడా నామినేట్‌ అయింది. 2019 వారసత్వ కట్డడాల ఎంపిక కోసం 2020లో జరగాల్సిన యునెస్కో ప్రతినిధుల సమావేశం కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది. చైనాలోని ఫ్యూజు వేదికగా వర్చువల్‌గా జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా ఐక్యరాజ్యసమితి విద్యా, విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది.

వ్యతిరేకించిన నార్వే.. చొరవ చూపిన రష్యా
ప్రపంచ వారసత్వ జాబితాలోకి రామప్పను చేర్చడాన్ని నార్వే వ్యతిరేకించింది. రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించేందుకు తొమ్మిది లోపాలు ఉన్నట్లుగా 2019లో పాలంపేటను సందర్శించిన పురావస్తు కట్టడాలు, క్షేత్రాల అంతర్జాతీయ మండలి (ఐసీవోఎంవోఎస్‌) ప్రతినిధులు తమ నివేదికలో ప్రస్తావించారు. తక్షణమే రామప్పను వారసత్వ కట్టడంగా గుర్తించేలా రష్యా ప్రత్యేక చొరవ తీసుకుంది. 2019 నాటి ఐసీవోఎంవోఎస్‌ నివేదికను తోసిరాజని 22.7 నిబంధన కింద రామప్పను కట్టడాల నామినేషన్లలో పరిగణనలోకి తీసుకునేలా చేసింది.

17 దేశాల మద్దతు
రామప్ప కు గుర్తింపు కోసం భారత్‌ కూడా దౌత్య పద్ధతిలో రాయబారం నెరిపింది. చారిత్రక కట్టడాలను ఎంపిక చేసేందుకు విచ్చేసిన ప్రతినిధుల తాలూకు 24 దేశాలకు చారిత్రక కట్టడంగా రామప్ప విశిష్టత గురించి వివరించింది. ఇది ఫలితాన్నిచ్చింది. రామప్పకు మద్దతుగా 24 దేశాల్లో రష్యా సహా ఇథియోపియా, ఒమన్‌, బ్రెజిల్‌, ఈజిప్ట్‌, స్పెయిన్‌, థాయ్‌లాండ్‌, హంగరీ, సౌదీ అరేబియా, సౌత్‌ ఆఫ్రికా తదితర 17 దేశాలు ఓట్లు వేశాయి. 2019లో భారత్‌ నుంచి యునెస్కోకు రామప్ప ఆలయం ఒక్కటే నామినేట్‌ అయింది. రామప్పకు మనదేశం నుంచి ఇతర కట్టడాలేవీ పోటీలో లేకపోవడంతో ఈ గుర్తింపు లభించింది.

ప్రధాని సందేశం
తెలంగాణలోని రామప్ప ఆలయానికి అరుదైన గుర్తింపు లభించడం పట్ల తెలంగాణ సహా దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘అద్భుతం! రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించినందుకు అందరికీ.. ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. ఘనకీర్తి గల కాకతీయుల అద్భుత నిర్మాణ కౌశలానికి రామప్ప ఆలయం గొప్ప ప్రతీక. ప్రజలరా.. ఈ అద్భుత ఆలయానికి వెళ్లండి. ఆలయ ఠీవీని ప్రత్యక్షంగా తిలకించి ఆ అనుభూతిని సొంతం చేసుకోండి’’ అని ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp