ఉండ‌వ‌ల్లి స్వ‌రం పెరుగుతోందా?

By Raju VS Feb. 20, 2020, 07:43 am IST
ఉండ‌వ‌ల్లి స్వ‌రం పెరుగుతోందా?

ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ..మాజీ ఎంపీ. రాజ‌కీయంగా ఆయ‌న మాట పెద్ద దుమారం రేపిన ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి. గ‌త ప్ర‌భుత్వ కాలంలో ఆయ‌న ప‌దే ప‌దే మీడియా స‌మావేశాల్లో చంద్ర‌బాబు తీరు మీద సూటిగా చేసిన విమ‌ర్శ‌లు సంచ‌ల‌నంగా మారిన అనుభ‌వాలున్నాయి. ఇక తాజాగా ఆయ‌న గ‌త ఏడాది కాలంగా మౌనంగా ఉన్నారు. తొలుత ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చింద‌నే పేరుతోనూ, త‌ర్వాత ప్ర‌భుత్వం ఏర్ప‌డి స్వ‌ల్ప‌కాల‌మే అయ్యింద‌నే కార‌ణంగానూ ఆయ‌న పెద్ద‌గా మాట్లాడింది లేదు.

ఇప్పుడు మ‌ళ్లీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ స్వ‌రం పెంచుతున్నారు. క్ర‌మంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం మీద కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. పాల‌నా వైఫ‌ల్యాల‌ను ఆయ‌న ఎండ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. కొద్దికాలం క్రితం స‌ల‌హాలు ఇచ్చిన ఆయ‌న ఇప్పుడు సూటిగానే త‌ప్పిదాలు ఎత్తిచూపుతున్నారు. స‌రిదిద్దుకోవాల‌ని చెబుతున్నారు. ఇలాంటి స‌మ‌స్య‌లు పెరిగితే ప్ర‌భుత్వానికి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌ని కూడా హెచ్చ‌రిస్తున్నారు.

తాజాగా మీడియా స‌మావేశంలో ఉండ‌వ‌ల్లి రెండు కీల‌కాంశాల‌ను ప్ర‌స్తావించారు. పోల‌వ‌రం ప్రాజెక్ట్ పట్ల ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంద‌న్నారు. జాతీయ ప్రాజెక్టు విష‌యంలో గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేసిన త‌ప్పిదాల‌ను జ‌గ‌న్ పున‌రావృతం చేయ‌డం వెనుక కార‌ణాలు ఏంట‌ని నిల‌దీస్తున్నారు. జాతీయ ప్రాజెక్ట్ కేంద్రం పూర్తి చేయ‌కుండా, రాష్ట్ర ప్ర‌భుత్వానికి సంబంధం ఏమిట‌ని నాడు నిల‌దీసి, ఇప్పుడు మ‌ళ్లీ అదే తీరున జ‌గ‌న్ సాగుతున్నార‌ని మండిప‌డ్డారు. పున‌రావాసం కింద రావాల్సిన నిధుల కోసం కేంద్రాన్ని ప్ర‌శ్నించాల‌ని సూచించారు.

ఇసుక స‌మ‌స్య‌లోనూ జ‌గ‌న్ స‌ర్కారు విఫ‌ల‌మ‌వుతోంద‌ని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికిప్పుడు అంద‌రినీ నీతిమంతులు అయిపోవాలంటే సాధ్యం కాద‌నే విష‌యం జ‌గ‌న్ గుర్తించాల‌న్నారు. ఇసుక ల‌భించ‌క జ‌నం స‌మ‌స్య‌ల్లో ప‌డుతున్నార‌ని అయినా ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌డం లేద‌న్నారు. అదే స‌మ‌యంలో ఆర్థిక వ్య‌వ‌హారాల్లో కేంద్రం ఇచ్చిన నిధుల‌ను కూడా ప‌క్క‌దారి ప‌ట్టించ‌డంపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. పోల‌వ‌రం కోసం ఇచ్చిన నిధుల‌ను లిక్క‌ర్ కంపెనీల బ‌కాయిలు, ఆరోగ్య శ్రీ కోసం వినియోగించ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఆర్థిక ప‌రిస్థితి ద‌యనీయంగా మారుతోంద‌ని, బ‌డ్జెట్ లో అయినా స్ప‌ష్ట‌త వస్తుందా అన్న‌ది సందేహంగా క‌నిపిస్తోంద‌ని ఉండ‌వ‌ల్లి వ్యాఖ్యానించ‌డం విశేషం అవుతోంది.

ఈ ప‌రిణామాల‌తో ఉండ‌వ‌ల్లి తీరు మ‌రోసారి చ‌ర్చ‌కు దారితీస్తోంది. క్ర‌మంగా గొంతు పెంచుతున్న ఆయ‌న తీరుతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం మీద దండెత్త‌డానికి సిద్ధ‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. దానిని వైఎస్సార్సీపీ శ్రేణులు ఎలా ఎదుర్కొంటారన్న‌దే ఆస‌క్తిక‌రం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp