సరి కొత్తగా టీటీడీ ఆలోచన!

By Mavuri S Feb. 25, 2021, 01:42 pm IST
సరి కొత్తగా టీటీడీ ఆలోచన!

నానాటికీ కలుషితమవుతున్న తిరుమల దివ్య క్షేత్రాన్ని కాపాడుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గం సరికొత్త ఆలోచనను ఆవిష్కరించింది. ఇప్పటికే ఎన్నో కాలుష్య రహిత కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న టీటీడీ ఇప్పుడు కీలకమైన విభాగంలో భక్తుల సహకారంతో ఓ వినూత్న ఆలోచన ద్వారా కాలుష్యరహిత తిరుమలను సాధ్యం చేసేందుకు ప్రయత్నిస్తోంది.

గతంలో కంటే భిన్నం!

గతంలోని పాలక మండళ్లు తిరుమల విషయంలో అనేక నిర్ణయాలు తీసుకున్నాయి. కాలుష్యం నుంచి దివ్య క్షేత్రాన్ని కాపాడుకునేందుకు నిధుల విజయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు తప్ప దాని నుంచి తక్కువ ఫలితాలు రాబట్టుకున్నారు. ఎలక్ట్రికల్ బస్సు లు, కాలుష్యం వెదజల్లే వాహనాల తనిఖీ అంటూ యంత్రాలు, వ్యర్థలతో కంపోస్ట్ ఎరువుల తయారీ అంటూ వివిధ అంశాలపై కోట్ల మేర ఖర్చు పెట్టారు. అయితే అనుకున్న మేర ఫలితాలు లభించలేదు. ఎన్ని విఫల ప్రయోగాలు గానే నిలిచిపోయాయి. తిరుమలలో వ్యర్థపు నీటిని మళ్లీ ప్యూరిఫై చేసి వినియోగించే యూనిట్ మాత్రమే మంచి ఫలితాలను ఇచ్చింది. వ్యర్థపు నీటిని శుద్ధి చేసి మొక్కలకు, ఇతర అవసరాలకు వాడుకునే ప్రాజెక్ట్ తప్ప మిగిలిన అంశాలు పెద్దగా ప్రయోజనం చూపలేకపోయాయి.

ప్లాస్టిక్ రహిత మే లక్ష్యం

ప్రస్తుత పాలకమండలి కొండపై ప్లాస్టిక్ రహిత తిరుమలను తీర్చిదిద్దాలి అన్న ప్రధాన లక్ష్యంతో ముందుకు వెళుతోంది. ఇప్పటికే కొండపై ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నిషేధించారు. అలాగే గ్లాసులను ఫ్లాట్ లను సైతం కొండపైకి తీసుకు రాకుండా నిరోధించ గలిగారు. ఇప్పుడు దీనిలో భాగంగా లడ్డూ సంచులను సైతం పర్యావరణ హితంగా తయారుచేయాలని టీటీడీ భావిస్తోంది.

వినూత్న ఆలోచన!

తిరుమలలో భక్తులు లడ్డూలను తీసుకెళ్లేందుకు తక్కువ ధర, పర్యావరణ హితం తో కూడిన సరికొత్త గ్రీన్ మంత్ర సంచులను టిటిడి అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి తయారీ అంతా పూర్తిగా చెట్ల ఆధారిత పదార్థాలతోపాటు కందమూలాలు ప్రధాన ముడిపదార్థంగా దీనిలో వినియోగిస్తారు. ఈ సంచి కిందిభాగంలో 200 నుంచి 300 వరకూ తులసి విత్తనాలు ఉంటాయి. బ్యాగులను వినియోగించిన అనంతరం మట్టిలో వేసి నీరు పోస్తే కొద్దిరోజులకే ఇంట్లో తులసి మొక్కలు మొలకెత్తుతాయి. ఐదు లడ్డూలు పట్టే బ్యాగు మూడు రూపాయలు, 10 లడ్డూలు పట్టే పెద్ద బ్యాగు 6 రూపాయలకే టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ధర కూడా తక్కువగా ఉండటంతో పాటు, తిరుమల నుంచి తులసి విత్తనాలు తెచ్చుకున్నట్లు, అది దేవదేవుడే పంపినట్లు భక్తులు భావిస్తున్నారు. బ్యాగులను పూర్తిస్థాయిలో తయారీ చేసి రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది. ఇది విజయవంతం అయితే వేల తులసి మొక్కలు సంవత్సరంలో పెరుగుతాయని ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp