విప‌త్తు వేళ విప‌క్షాల పంచ్ లు : దేశంలో క‌రోనా.. బెంగాల్ లో మోదీ

By Kalyan.S Apr. 20, 2021, 07:32 am IST
విప‌త్తు వేళ విప‌క్షాల పంచ్ లు : దేశంలో క‌రోనా.. బెంగాల్ లో మోదీ

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్ ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తుంటే... రాజ‌కీయాలు రంజుగా మారుతున్నాయి. ఇదే అదునుగా విప‌క్షాలు కేంద్రంపైనా, ప్ర‌ధాని మోదీపైనా ఫోక‌స్ పెంచాయి. విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెడుతున్నాయి. దేశం కన్నా.. బెంగాల్‌లో ప్రచారానికే మోదీ మొగ్గు చూపుతున్నారంటూ ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. క‌రోనా తొలి ద‌శ‌కు, రెండో ద‌శ‌కు మ‌ధ్య చాలా స‌మ‌యం వ‌చ్చిన‌ప్ప‌టికీ నిర్ధిష్ట‌మైన ప్ర‌ణాళిక ప్ర‌కారం ఏర్పాట్లు చేయ‌డంలో విఫ‌ల‌మైన మోదీ రాజీనామా చేయాల‌నే డిమాండ్ ను లేవ‌నెత్తుతున్నాయి. క‌రోనా కరాళనృత్యం చేస్తున్న వేళ కేంద్రం, మహారాష్ట్ర మధ్య రాజకీయ రగడ ర‌చ్చ‌గా మారింది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ కొరత, రెమ్‌డెసివిర్‌ నిల్వల్లేకపోవడంతో ఇబ్బందుల్లో ఉన్నామని, ఆదుకోండని కోరడానికి ప్రధాని నరేంద్ర మోదీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఫోన్‌ చేశారు. కానీ బెంగాల్లో ప్రచారంతో ఆయన బిజీగా ఉన్నారంటూ తన ఫోన్‌ను ఆయన రిసీవ్‌ చేసుకోలేదని ఠాక్రే స్వయంగా వెల్లడించడంతో దుమారం రేగింది.

మ‌మ‌త‌పై విజ‌య‌మే ముఖ్య‌మైపోయిందా : ఎన్‌సీపీ

ప్రజలు ఓ పక్క చనిపోతుంటే ప్రధానిగా ఉన్న వ్యక్తి రాజకీయ ప్రచారాలకే ప్రాధాన్యమిస్తున్నార‌ని విపక్షాలు మండిప‌డుతున్నాయి. ‘‘నేను ఆయనతో మాట్లాడడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ ఆయనకు ఫోన్‌ ఇవ్వడానికి ఆయన సిబ్బంది అంగీకరించలేదు’’ అని ఠాక్రే ఫిక్కి సమావేశంలో చెప్పారు. ‘‘ ఇక్కడ ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌లకు విపరీతమైన కొరత ఉంది. 20 లక్షల డోసులున్న రెమ్‌డెసివిర్‌ను ఎగుమతి చేసే 16 కంపెనీలను మేం సంప్రదించాం. అయితే వారిచ్చిన సమాధానం... మహారాష్ట్రకు రెమ్‌డెసివిర్‌ సరఫరా వద్దని కొన్ని కంపెనీలకు మోదీ సర్కార్‌ ఆదేశాలిచ్చింది. ఎగుమతిపై నిషేధం విధించినందున వాటిని దేశీయంగా అమ్ముకోడానికి అవకాశం ఇవ్వాలని కంపెనీలు కోరితే కేంద్రం అందుకు నిరాకరించింది. ఇంతకంటే దారుణం ఇంకోటుంటుందా? ఇది సమాఖ్య స్ఫూర్తికే దెబ్బ. పరిస్థితి విషమిస్తున్నందున మాకు మరో దారి లేదు. ఆ కంపెనీల నుంచి రెమ్‌డెసివిర్‌ నిల్వలను రాష్ట్రప్రభుత్వమే స్వాధీనం చేసుకోవడం తప్ప...!’’ అని ఎన్‌సీపీ నేత, మైనారిటీ వ్యవహారాల మంత్రి నవాబ్‌ మాలిక్‌ చెప్పారు. కరోనా విజయంపై కంటే మోదీకి మమతపై విజయం ముఖ్యమైపోవడం బాధాకరం అని ఆయన దాడి చేశారు.

ప్ర‌చార‌క‌ర్త పాత్ర : సీపీఎం

దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా.. పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో మోదీ ప్రచారాన్ని కొనసాగిస్తుండటంపై సీపీఎం మండిపడింది. దేశ ప్రధాని కన్నా పార్టీ ప్రచారకర్తగానే మోదీ పాత్ర పోషిస్తున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆరోపించారు. దేశం కన్నా బెంగాల్‌లో పార్టీ ప్రచారానికే మోదీ మొగ్గు చూపిస్తున్నారని వరుస ట్వీట్లతో ధ్వజమెత్తారు. ‘కొవిడ్‌ మహమ్మారి విజృంభణతో మనమంతా వణికిపోతున్నాం. అయితే దురదృష్టవశాత్తు మనకు కేంద్ర ప్రభుత్వం అనేది లేకుండాపోయింది. ఏ మాత్రం సమయం చిక్కినా ప్రధాని మోదీ బెంగాల్‌లో ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని ఏచూరి ఆరోపించారు.

రాజీనామా చేయాలి : టీఎంసీ‌

కరోనా సెకండ్‌ వేవ్‌ నియంత్రణలో పూర్తిగా వైఫల్యం చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని టీఎంసీ నేత‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ డిమాండ్‌ చేశారు. ఆరోగ్య అత్యయిక స్థితిని ఎదుర్కొనడానికి ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో ఆయన విఫలమయ్యారని ఆరోపించారు. గత ఏడాది సెప్టెంబరులో మొదటి వేవ్‌ సద్దుమణిగాక... ఎంతో సమయం లభించినా సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కొనడానికి కేంద్రం ఏమాత్రం సంసిద్ధం కాలేదన్నారు. అవసరాలకు సరిపడా మెడికల్‌ ఆక్సిజన్, టీకాల సరఫరా లేక రాష్ట్రాలు అల్లాడుతున్నాయని... ఈ సమస్యను అధిగమించడానికి మోదీ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. బారక్‌పోర్‌లో ఆమె మాట్లాడుతూ... దేశంలో ఒకవైపు వ్యాక్సిన్లకు కొరత ఉంటే మరోవైపు మోదీ అంతర్జాతీయంగా తన ఇమేజ్‌ను పెంచుకోవడానికి విదేశాలకు టీకాలను ఎగుమతి చేశారన్నారు. ప్రస్తుత కోవిడ్‌ సంక్షోభానికి ఆయనే కారణమని, అందుకే ప్రధాని రాజీనామా చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలు, కార్యాకర్తలు వచ్చి బెంగాల్‌లో కోవిడ్‌ను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.

ప్ర‌చారాలు, ప‌ర్య‌ట‌న‌లు మానండి : కాంగ్రెస్

కాంగ్రెస్‌ నేత పి చిదంబరం కూడా - ‘ఈ ప్రచారాలు, పర్యటనలు మాని ఢిల్లీలో డెస్క్‌ వద్ద ప్రధానిగా చేయాల్సినది చేయండి. ప్రజలు చనిపోతున్నారు’ అని హితవు పలికారు. మోదీకి ప్రజల ప్రాణాల కంటే రాజకీయమే ముఖ్యమని అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఆరోపించారు. కొవిడ్‌ వ్యాప్తికి కేంద్రం, ఎలక్షన్‌ కారణమని శివసేన దుయ్యబట్టింది. మహమ్మారి ప్రబలడానికి కారణం చైనా కారణమైతే సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా కమ్మేయడానికి ఈ రెండూ కారణం. రాష్ట్రాల నుంచి ఒక్కో ప్రాంతానికి విస్తరిస్తోంది. ఎన్నికల వల్ల మరింత వ్యాపిస్తోంది’ అని శివసేన సామ్నాలో రాసింది.

చిల్ల‌ర రాజ‌కీయాలు మానండి : బీజేపీ

ప్ర‌ధాని మోదీ, కేంద్రంపై విప‌క్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రులు హర్షవర్ధన్‌, పీయూశ్‌ గోయెల్‌ తిరస్కరించారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని గోయెల్ సూచించారు. ‘‘అత్యంత నాణ్యమైన ఆక్సిజెన్‌ను మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నాం. ప్రధాని దీనిపై శుక్రవారం ఉదయం కూడా సమీక్ష జరిపారు. కేంద్రరాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అది మానేసి ఉద్ధవ్‌ ఠాక్రే ఆక్సిజెన్‌ లేదంటూ జిమ్మిక్కులు చేస్తున్నారు. ఇది దిగ్భ్రాంతిక‌రం ’ అని ఆయన అన్నారు. మహారాష్ట్రను అన్నివిధాలా ఆదుకుంటున్నట్లు, ఠాక్రేతో మాట్లాడినట్లు ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు. ‘రెమ్‌డెసివిర్‌ నిల్వలపై కేంద్ర సాధికారిక బృందంఎప్పటికప్పుడు మహారాష్ట్రతో సంప్రదిస్తోంది. కొవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ సరఫరాలోనూ కొరత లేదు. నవాబ్‌ మాలిక్‌ ఆరోపణలు పచ్చి అబద్ధాలు’ అని కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఎదురుదాడిచేశారు. అటు ప్రధాని కార్యాలయం (పీఎంఓ) కూడా ఓ ప్రకటన జారీ చేస్తూ దేశంలో ఎక్కడా ఆక్సిజన్‌, వ్యాక్సిన్‌, రెమ్‌డెసివిర్‌ కొరత లేకుండా చూడాలని ప్రధాని నిర్దిష్టంగా ఆదేశించారని, ఆరోపణలు అవాస్తవమని పేర్కొంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp