చివరికి మనుష్యుల శరీరాల్లోకే..!

By Jaswanth.T Dec. 10, 2020, 11:00 am IST
చివరికి మనుష్యుల శరీరాల్లోకే..!
‘‘ప్రకృతిలో ఒక చోట జరిగే చర్యను మరొక చోట జరిగిపోయిన చర్య నియంత్రిస్తుంది’’ దీన్నే బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌గా చెబుతుంటారు. అంటే గుర్తు తెలియని వ్యాధి భారిన పడి ఇబ్బందిలు పడుతున్నాము అంటే దీని ప్రభావం ఎక్కడో ఉన్న పరిశ్రమ నుంచి విడుదలైన కాలుష్యం కావొచ్చు, ఇళ్ళలో క్లీనింగ్‌కు వినియోగించుకునే కెమికల్స్‌ కావొచ్చు.. పంటలపై వాడే పురుగు మందులు కావొచ్చు లేదా వ్యాపారి స్వార్ధం కోసం చేసిన కల్తీ కూడా అయ్యుండొచ్చన్న మాట. ఇది నిన్న మొన్న లేదా ఒక్కరోజులో మనిషిపై ప్రభావం చూపించేది కాదన్నది నిపుణులు చెబుతున్న మాట. కొన్నేళ్ళపాటు నెమ్మది నెమ్మదిగా మనిషి శరీరంలోకి చేరి, శరీరం తట్టుకోలేనప్పుడు వివిధ వ్యాధుల రూపంలో, రకరకాల లక్షణాల రూపంలో బైటపడుతుంటాయని వివరిస్తున్నారు.

ప్రస్తుతం ఏలూరులో జనం అస్వస్థతకు గురికావడానికి వారి రక్తంలో భార లోహాలుగా చెప్పే, నికెల్, లెడ్‌ తదితర పదార్ధాలు నిర్ణీత పరిమాణాని కంటే కూడా అత్యధికంగా ఉన్నాయని పరీక్షలో తేలుతున్నాయి. కొన్ని రకాల కెమికల్స్‌ పేర్లు కూడా సామాన్య జనం నోటికి తిరగనవి కూడా ఇందులో ఉంటున్నాయని చెబుతున్నారు. నిర్ణీత పరిమాణానికంటే అధికంగా ఇవి శరీరాల్లోకి చేరితే వెంటనే అస్వస్థత కలుగుతుంది. కానీ స్లో పాయిజన్‌ మాదిరిగా అతి కొద్ది మోతాదులో మాత్రం చేరుతుంటే పరిస్థితి తీవ్రమైతే తప్ప బైటపడేందుకు అవకాశం ఉండదు. ఇక్కడ బాధితుల వయస్సులు, వారి శరీర తత్వాలను బట్టి కూడా వీటి ప్రభావంలో మార్పులు ఉంటుంటాయని నిపుణులు వివరిస్తున్నారు.

అనేక మార్గాల్లో..

మనిషి శరీరంలోకి ఇటువంటి పదార్ధాలు చేరేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కాలువల్లోకి చేరే మురుగునీరు, ఇతర వ్యర్ధాలు, ప్రమాదకర రసాయనాలు ఎంత శాతం అన్నది అంచనా వేయడానికి పెద్దగా సర్వేలే చేయనక్కర్లేదు. కేవలం కాలువలు కట్టేసినప్పుడు పరిశీలిస్తే సరిపోతుంది. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లోనూ నదులు, కాలువల వెంబడి అనేక పరిశ్రమలు తమ వ్యర్ధాలను నదుల్లోకే చేరుస్తున్నాయి. అక్కడి నుంచి కాలువలు, చెరువుల్లోకి, అట్నుంచి త్రాగునీటి ట్యాంకుల ద్వారా మనుష్యులు ఆ వ్యర్ధాలన్నీ చేరిపోతున్నాయి. ఇళ్ళలో వాడే కెమికల్స్‌ది కూడా అదే తీరు. ఇళ్ళక్లీనింగ్‌లో వాడే రసాయనాలు, డిటర్జెంట్‌లు, సోప్‌లు, షాంపూలూ ఇవన్నీ కూడా మురుగు కాల్వల ద్వారా పంట కాలువల్లోకి, అక్కడ్నుంచి రక్షిత మంచినీటి పథకాలు, భూగర్భజలం ద్వారా మనుష్యుల్లోకే చేరుతున్నాయని నిపుణులు ఎప్పట్నుంచో మొత్తుకుంటున్నారు.

ఇంకో పక్క సాగులో వాడే రసాయనిక మందులు కూడా అదే మార్గంలో వస్తున్నాయి. వంకాయలో పుచ్చులేదంటే దానికి కారణం నాణ్యత కాదు, కేవలం పురుగు మందుల గాఢతేనంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. దాదాపు అన్ని రకాల కూరగాయలపై కూడా పురుగు మందుల ప్రభావం అధికంగా ఉంటుందన్నది బహిరంగ రహస్యంగానే మారిపోయింది. పంటను కాపాడుకోవాలన్న ఆత్రం రైతుది కాగా, తన వ్యాపారం పెంచుకోవాలన్నది పురుగుమందుల వ్యాపారి ఆత్రం. దీంతో అనేక రకాలైన నిషేధి మందులు కూడా పేర్లు మార్చుకుని మార్కెట్‌లోకి విచ్చలవిడిగా వచ్చిపడుతున్నాయి. 80–90శాతం మంది రైతులు కేవలం వ్యాపారులు ఇచ్చే మందులనే నమ్మి వినియోగిస్తుండడం ఉభయ గోదావరి జిల్లాల్లోనూ అత్యధికంగా సాగుతుంది.

అంతే కాకుండా ఆహార పదార్ధాల కల్తీ కూడా జోరుగానే సాగుతుంటోంది. స్వీట్లు, మాంసాహారం నిల్వ ఉంచేందుకు ప్రమాదకర రసాయనాలను కలుపుతున్నట్లు పలు చోట్ల ఇప్పటికే బైటపడింది. నిల్వ చేసేందుకే కాకుండా, పదార్ధాల రుచిని పెంచేందుకు సైతం రసాయనాలను వినియోగిస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. దీనికి తోడు వాహన కాలుష్యం సైతం భారీగానే పెరిగిపోతోంది. 14 సంవత్సరాలు దాటిన వాహనాలను వాటి కండిషన్‌ను బట్టి రోడ్లపై తిరగనీయకుండా చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ గత కొన్నేళ్ళుగా ఈ నిబంధనలను సమర్ధవంతంగా అమలు చేస్తున్న దాఖలాల్లేవు. దీంతో వాటి నుంచి వెలువడే పొగ మనుష్యుల ఆరోగ్యానికి గొడ్డలిపెట్టుగా మారిపోతోంది.

ఇలా బహురూపాల్లో మానవ శరీరాల్లోకి ప్రమాదకర పదార్ధాలు చేరిపోయేందుకు అవకాశం చిక్కుతోంది. ఇటువంటి రసాయనాల మోతాదు ప్రమాదకర స్థాయికి పెరిగినప్పుడే ఏలూరు వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల వంటివి ఎదురవుతుంటాయని వైద్యరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి పట్ల, అందులో వస్తున్న మార్పుల పట్ల, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడంతో పాటు, ఆ ప్రకృతిని కలుషితం చేయకుండా ఎవరికి వారు వ్యక్తిగతంగా ఎంత నియంత్రణ పాటిస్తే అంతమంచిదన్న సూచనలు చేస్తున్నారు.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp