కాలం చెల్లిన కుట్రలకు మళ్ళీ తెరలేపుతున్నారా బాబూ..

ఎన్టీఆర్ ని గద్దె దింపేందుకు 25 ఏళ్ల క్రితం సంధించిన అస్త్రాలనే నేటికీ ఉపయోగించాలనే తపనలో చంద్రబాబు ఉన్నట్టు కనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్టామినా బాగా ఎరిగిన నేతగా ఆయన వెన్నుపోటు రాజకీయాలే తప్ప నేరుగా ఎదుర్కోవడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని చంద్రబాబు నమ్మిన బంటు వేమూరి రాధాకృష్ణ కూడా స్పష్టం చేసేశారు. ప్రస్తుతం జగన్ ప్రజాబలాన్ని ఎదుర్కోవడం విపక్షాల వల్ల సాధ్యం కావడం లేదని నిర్ధారణకు వచ్చారు. అందుకే గెరిల్లా తరహా పోరాటమే శరణ్యమన్నట్టుగా సంకేతాలు ఇచ్చేశారు. తద్వారా జగన్ ని సూటిగా ఎదుర్కునే సత్తా లేని చంద్రబాబు ప్రస్తుతం కుట్రల ద్వారానే ముందుకు సాగే యత్నంలో ఉన్నారని చెప్పకనే చెప్పేశారు.
ఆంధ్రప్రదేశ్ లో తమకు అధికారం శాశ్వతం అన్నంత రీతిలో బాబు అండ్ బ్యాచ్ వ్యవహరించారు. కానీ ప్రజలు భిన్నంగా ఆలోచించారు. ప్రజల సంక్షేమం విస్మరించి, అమరావతి చుట్టూ అల్లిన కథలను కాదు పొమ్మన్నారు. దాంతో తమ చేతి నుంచి పగ్గాలు చేజారిపోయిన క్షణం నుంచి చంద్రబాబు తో పాటుగా ఆయన అనుచరగణం అల్లాడిపోతున్నారు. అధికారం కోల్పోయిన నాటి నుంచి తీవ్రంగా కలత చెందుతున్నారు. తమ హవా చెల్లుబాటు కాదని జనం స్పష్టం చేసినా జీర్ణించుకోలేని స్థితికి చేరారు. ప్రజలు ఛీదరించినా వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఏడాదిన్నర కాలంలో ఎన్నో కుయుక్తులు పన్నారు. పలు కుట్రలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే యత్నం చేశారు. ప్రజలను పక్కదారిపట్టించే ప్రయత్నాలకు పూనుకున్నారు. తమకు తెలిసిన విద్యగా ఉన్న వెన్నుపోటు వ్యూహాలు రచించారు. సొంత వర్గపు మీడియా సహాయంతో ఘటనల ఆధారంగా గగ్గోలు పెడుతూ అన్నింటినీ నేరుగా జగన్ కి ముడిపెట్టేందుకు సిద్ధమయ్యారు. చివరకు కుల, మత రాజకీయాలకు తెరలేపి ఏపీ పరువు తీసేందుకు సైతం వెనుకాడలేదు.
అన్ని రకాల కుట్రలు, కుయుక్తులు కూడా జగన్ ముందు పారలేదు. ప్రభుత్వాధినేత ముందుచూపుతో కరోనాని ఎదుర్కోవడంలోనే దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరిస్తే అలాంటి పచ్చ వైరస్ ని మరింత పట్టుదలగా ఎదుర్కుంటారనడంలో సందేహం లేదు. సరిగ్గా జగన్ పాలనా కాలమంతా అదే కనిపిస్తోంది. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతుంటే దానిని పక్కదారి పట్టించే పనికి ప్రతిపక్షాలు పూనుకున్నాయి. అందుకు అనుగుణంగానే అర్థసత్యాలతో అందరినీ నమ్మించే యత్నం చేసి బోర్లా పడ్డాయి. చివరకు కియా వంటి కంపెనీలు ఏపీ నుంచి తరలిపోతున్నాయనే ప్రచారానికి పూనుకున్నారు. కానీ ఏపీలోని మరింత విస్తరణకు ఆ సంస్థ సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది. పారిశ్రామికాభివృద్ధి కోసం జగన్ చేస్తున్న కృషి ఫలించేందుకు మార్గం సుగమం అవుతున్నట్టుగా తాజాగా కొత్త పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలవడం నిదర్శనంగా కనిపిస్తోంది. పాలనా వికేంద్రీకరణ ప్రయత్నాలను అడ్డుకోవడానికి మండలి సాక్షిగా పన్నాగాలు, న్యాయస్థానాలను వేదికగా చేసుకుని నడిపిన ప్రహసనాలు అన్నీ బట్టబయలయ్యాయి. చివరకు ఇప్పుడు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ని కేవలం ఒకే ఒక్క లేఖతో జగన్ బదిలీ చేయించారని టీడీపీ భజన బృందాలన్నీ తమ బాధను వెళ్లగక్కే పరిస్థితి వచ్చింది.
నిజంగా జగన్ లేఖని బట్టి సీజేని బదిలీ చేస్తే ఆయన లేఖ సారాంశం సరైనదేనని అంగీకరించినట్టేగా. అంటే ముఖ్యమంత్రి రాసిన లేఖ చుట్టూ టీడీపీ, పచ్చ మీడియా చేసిన వ్యాఖ్యానాలన్నీ చెల్లవని స్పష్టమయినట్టేగా. తద్వారా ముఖ్యమంత్రి చట్టపరమైన మార్గంలో సాగుతున్నట్టు అంగీకరించినట్టేగా. న్యాయస్థానాల సాక్షిగా చేసిన కుయుక్తులు చెల్లుబాటు కాలేదని చెప్పకనే చెబుతున్నారనేగా. ఇలా అన్ని రంగాల్లో, ప్రతీ విషయంలో పాలనకు అడ్డంకులు సృష్టించే యత్నాలు చేసినా జగన్ దూకుడు ఆపడం బాబు బ్యాచ్ తరం కావడం లేదు. ముఖ్యమంత్రిగా జగన్ ఛరిష్మా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న తీరు వారిని కుదురుకోనీయడం లేదు. చివరకు ఈ అసహనం ఎక్కడకు దారితీసిందంటే తామే ఆలయాల చుట్టూ విధ్వంసం సృష్టించడం, మళ్లీ వెంటనే ఏదో జరిగిపోతోదంటూ కొండెక్కి రాగం తీయడం వరకూ వెళ్లింది. అంతటితో సరిపెట్టకుండా ఏపీలో ప్రభుత్వమే మత మార్పిడి చేస్తుందనే విమర్శలకు సైతం విపక్షాలు వెనుకాడని స్థాయికి చేర్చింది. ఆలయాలను కూల్చే కుట్రల వెనుక సూత్రధారుల సంగతి వెలుగులోకి వస్తున్న సమయంలో కొత్త రాగం అందుకుంటున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. పొంతనలేని అంశాలతో ఏపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే తప్ప బాధ్యతగా ప్రజల మనసులు గెలుచుకునే పనికి పూనుకోవడం బాబుకి తెలియని విద్యగా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడే పరిస్థితి వచ్చింది. దాంతో ఏపీ రాజకీయాల్లో కాలం చెల్లిన కుట్ర యత్నాలతో నెట్టుకురావాలని చంద్రబాబు వేస్తున్న స్కెచ్ జగన్ వ్యూహాల ముందు చెల్లుబాటు కావడం లేదని వాస్తవం తాజా పరిణామాలు చాటుతున్నాయి. విపత్కర పరిస్థితుల్లోనూ ఏపీని ముందుకు నడిపిస్తున్న నేతగా జగన్ ఆదరణ పెరుగుతున్న దశలో విపక్షాలకు మరింత ఉలికిపాటు అనివార్యంగా మారుతోంది.


Click Here and join us to get our latest updates through WhatsApp