ఆపరేషన్ సక్సెస్.. కేండేట్ డౌట్

ఆపరేషన్ సక్సెస్.. కానీ పేషెంటే డౌట్.. అంటూ ఓ సెటైర్ సంభాషణల్లో తరచుగా విన్పిస్తుంటుంది. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి అలాగే ఉందంటున్నారు పరిశీలకులు. తన అనుభవాన్నంతా రంగరించి ఎంతో ముందు చూపు, మరెంతో రాజకీయ విజ్ఞతతో ఒక్కో స్టెప్ వేస్తున్నానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. కానీ వేసే ప్రతి స్టెప్ అయితే బూమరాంగ్ అవుతోంది, లేకపోతే ఎదుటి పార్టీకి ప్లస్‌గా మిగిలిపోతోందన్నది వీరి వాదన.
ఇందుకు ప్రధాన ఉదాహరణ తిరుపతి పార్లమెంట్‌కు టీడీపీ అభ్యర్ధిని ముందుగానే ప్రకటించడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా ప్రజాప్రతినిధి మృతి చెందితే, వారి కుటుంబ సభ్యులకు ఏకగ్రీవంగా పదవిని ఇవ్వడం గత కొంతకాలంగా సాంప్రదాయంగా పాటిస్తున్నారు. గతంలో ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వైఎస్సార్సీపీ తరపున పోటీకి నిలపకుండా జగన్ హుందానే వ్యవహరించారు.
అయితే తిరుపతి ఎంపీ దుర్గాప్రసాదరావు మృతిచెందడంతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని ఎన్నికల సంఘం నోటిఫై చేసింది. దీంతో నేడో, రేపో ఎన్నికలు జరగడం ఖాయం. సాంప్రదాయం ప్రకారం ఇక్కడ పోటీ పెట్టకుండా వైఎస్సార్సీపీకే సీటును వదిలేయాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా చంద్రబాబు తమ పార్టీ అభ్యర్ధిగా పనబాక లక్ష్మిని ముందుగానే ప్రకటించేసారు. ఈ ముందస్తు ప్రకటననే అద్భుత వ్యూహంగా ఆయన వందమాగదులు ప్రచారం మొదలు పెట్టేసారు.
అయితే సీటు పొందిన అభ్యర్ధి నుంచి మాత్రం పెద్దగా ఎటువంటి స్పందనా కానరాకపోవడం ఇప్పుడు టీడీపీ నాయకులకు టెన్షన్ పట్టుకుందట. సాధారణంగా అభ్యర్ధిగా ప్రకటించబడ్డ వ్యక్తులు వీలైనంతగా ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ అందుకు విరుద్ధంగా పనబాక వ్యవహారశైలి ఉండడం పట్ల పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అసలు పోటీ చేసేందుకు పనబాక సిద్ధంగా ఉన్నారా? లేదా? అన్న సందేహాలను కూడా లేవనెత్తుతున్నారు.
తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనికి తోడు అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి ఉండే ఎడ్జ్ ఎలాగూ ఉండనే ఉంటుంది. మరో వైపు సంక్షేమ పథకాలు కూడా వైఎస్సార్సీపీ విజయం ఖరారే అన్న సంచనాలను సిద్ధం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తనను టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించడం పనబాకకు పెద్దగా ఇష్టం లేదన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదుంటున్నారు. ఓడిపోయే సీట్లు మాత్రమే టీడీపీ దళితులకు, ఇతర వెనుకబడిన వర్గాలకు కేటాయిస్తుందని గతంలో చోటు చేసుకున్న పలు ఘటనలను ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఓడిపోతారని తెలిసి కూడా వర్ల రామయ్యను పోటీలో నిలపడమే దీనికి ప్రభల నిదర్శనంగా చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఎంతో ముందుగానే అభ్యర్ధిగా ప్రకటించినప్పటికీ పనబాక బైటకు వచ్చేందుకు మొగ్గు చూపడం లేదన్న వాదనలు జోరందుకున్నాయి.
అయితే ఏదో తీవ్రమైన వ్యూహంతోనే చంద్రబాబు ముందుగానే అభ్యర్ధిని ప్రకటించేసారంటూ టాంటాం వేసేస్తున్న పచ్చమీడియాకు ఇప్పుడు సదరు అభ్యర్ధి వ్యవహారశైలి కూడా మింగుడుపడడం లేదంటున్నారు. పైన చెప్పుకున్నట్టు చంద్రబాబు వ్యూహమే పన్నితే గనుక అభ్యర్ధి ప్రకటన వరకు ఆపరేషన్ సక్సెస్.. కానీ కేండేట్ మాత్రం ఆ పార్టీ తరపున పోటీలో ఉండేది? లేనిదీ మాత్రం డౌటేనన్న వార్తలు మాత్రం జోరుగానే షికారు చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అసలు వ్యూహం ఎంత వరకు సక్సెస్ అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు మరి.


Click Here and join us to get our latest updates through WhatsApp