తిరుపతిలోనూ నిరాశ తప్పదా..?

By Jaswanth.T Dec. 14, 2020, 07:50 am IST
 తిరుపతిలోనూ నిరాశ తప్పదా..?
ప్రస్తుతం ఏపీలో తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక రాజకీయాల్లో హీట్‌ను పెంచుతోంది. సహజంగా అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య ఈ హీట్‌ ఏర్పడడం సహజం. కానీ తిరుపతి ఉప ఎన్నిక మాత్రం ప్రతిపక్షాల మధ్యనే వేడికి కారణమవుతోంది. ప్రస్తుతం ఏపీలో అధికారిక ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది. అనధికారిక ప్రతిపక్షంగా బీజేపీ–జనసేనలు వ్యవహరించేస్తున్నాయి.

అధికార వైఎస్సార్‌సీ తరఫున ఇప్పటికే అభ్యర్ధిని ఖరారు చేసి, ఆ తరువాత కార్యక్రమాల్లో ఆ పార్టీ నేతలు మునిగిపోయారు. కానీ టీడీపీ తరపున ప్రకటించిన అభ్యర్ధి అసలు పోటీలో ఉంటారో? లేదో?నన్న సందేహంతో చాన్నాళ్ళపాటు ఊగిసలాడారు. ఎట్టకేలకు సదరు అభ్యర్ధి నోరువిప్పి బైటకు రావడంతో కొంత మేరకు వారు సేఫ్‌లోనే ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే అయితే టీడీపీ తరపున ఇది నిజమైన పోటీయేనా? అన్న సందేహాలు లేవనెత్తేవారికి కూడా కొదవలేదు. ఇక బీజేపీ–జనసేనల పరిస్థితి ఒకడుగు ముందుకు నాలుగున్నర అడుగులు వెనక్కు అన్నరీతిలో ఉంటోందంటున్నారు. ఈ రెండు పార్టీలు ఏపీలో సహజీవనం చేస్తున్నాయి. దీంతో ఇద్దరి తరపున ఉమ్మడి అభ్యర్ధిని ప్రకటిస్తారని రాజకీయవర్గాలు ఆశిస్తున్నాయి. కానీ ఇందుకు భిన్నంగా తామే పోటీ చేస్తామని జనసేన ఢిల్లీ వెళ్ళిచ్చి చెప్పకనే చెప్పుకుంది. బీజేపీ నాయకులేమో బీజేపీ అభ్యర్ధే ఉంటాడని ఖరాఖండీగా తేల్చేస్తున్నారు.

సాధారణంగా పొత్తులో ఉన్న పార్టీలు ఉమ్మడి కమిటీ ఏర్పాటు చేసుకుని ఎన్నికలప్పుడు అభ్యర్ధులను ప్రకటించుకుంటాయి.లేదా ఏదో ఒక పార్టీ మరో పార్టీ తరపున కూడా ఫలానా సీట్లు తమతో కలిసి వస్తున్న పార్టీకి కేటాయిస్తున్నామని చెప్పుకుంటాయి. కానీ తిరుపతి ఉప ఎన్నికలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితిని బీజేపీ–జనసేనల వ్యవహారం తెరపైకి తెస్తోందంటున్నారు. పన్‌కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌లు ఒకలా ప్రకటిస్తుంటే ఇక్కడ సోమువీర్రాజు, జీవీఎల్‌లు మరో ప్రకటన చేస్తున్నారు.

నిజానికి ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విషయంపైనే అనేకానేక సందేహాలు ఏర్పడే పరిస్థితులు గత కొన్నాళ్ళుగా చోటు చేసుకుంటున్నాయంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు. జీహెచ్‌యంసీ ఎన్నికల విషయంలో పవన్‌కు జరిగింది ఇంకా జనసేన కేడర్‌ మర్చిపోలేదనే చెబుతున్నారు. ఇప్పుడు తిరుపతిలో కూడా అదే జరిగుతుందేమోనన్న సందేహం వారికి ఇప్పటికే బలపడిపోయింది. అయితే పార్టీ అధినేత మాట కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు.

ఏది ఏమైనా పవన్‌ను పొత్తు పెట్టుకున్న ముందులో ముద్దుచేసినంతగా ఇప్పుడు బీజేపీ నాయకత్వం చేయడం లేదన్నది ఇప్పటికే స్పష్టమైపోయింది. ఈ నేపథ్యంలోనే పవన్‌ స్టాండ్‌ ఏంటన్నది తేలాల్సి ఉంటుందంటున్నారు. మరో వైపు బీజేపీ ఇంతకు ముందుగా కూడా తమకు కావాల్సిన వాళ్లను సంచనెక్కించుకున్న తరువాత వాళ్ళను దింపేయడం, ఆ మట్టుకే వెనక్కి నెట్టేయడం ఎప్పుట్నుంచో చేస్తున్నదే కదా అంటూ చెప్పుకొచ్చేవారు కూడా లేకపోలేదు. ఏతా వాతా తేలేదేంటంటే ఒక వేళ తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధే ఖరారైతే మాత్రం పవన్‌కు మరోసారి నిరాశ తప్పదని చెబుతున్నారు.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp