ఫిర్యాదు చేస్తే సరా..? లాజిక్‌తో పనిలేదా..?

By Karthik P Apr. 19, 2021, 10:24 pm IST
ఫిర్యాదు చేస్తే సరా..? లాజిక్‌తో పనిలేదా..?

దేశంలో తానే సీనియర్‌ రాజకీయనాయకుడనని, తన అంత అనుభవం మరెవరికీ లేదని చెప్పుకుంటుంటారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు తన గురించి తాను చెప్పుకునే మాటలకు.. వాస్తవ పరిస్థితికి ఏ మాత్రం పొంతన ఉండదని తిరుపతి ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుతో మరోమారు తేలిపోయింది.

‘‘ ఈ నెల 17న ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో అప్రజాస్వామికంగా, అత్యంత సందేహాస్పదమైన పోలింగ్‌ జరిగింది. దొంగ ఓట్లు భారీగా వేయించారు. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యల్ప ఓటింగ్‌ జరగడం అక్కడ చోటు చేసుకున్న అక్రమాలను బహిర్గతం చేస్తోంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే 15.17 శాతం తక్కువ పోలింగ్‌ నమోదైంది. దొంగ ఓట్లు వేసేందుకు కడప, కర్నూలు జిల్లాలతోపాటు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, చిత్తూరు, పలమనేరు, పీలేరు, నగరి, చంద్రగిరి, పూతలపట్టు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున స్థానికేతరులను పోలింగ్‌ రోజున తరలించారు. బయట వ్యక్తుల ప్రభావంతోనే తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోలింగ్‌ తగ్గింది. అసలు ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనలేకపోయారు.’’ ఇదీ.. చంద్రబాబు చేసిన ఫిర్యాదులోని సారాంశం.

దొంగ ఓట్లు వేస్తే.. పోలింగ్‌ తగ్గుతుందా..?

ఇది చూసిన వారికి చంద్రబాబు తెలివితేటలపై ఓ అవగాహన వస్తుంది. వాస్తవాలు, లాజిక్‌ లేకపోయినా ఫర్వాలేదు.. ఫిర్యాదు చేస్తే చాలన్నట్లుగా ఉంది చంద్రబాబు తీరు. ఎన్నికల్లో అక్రమాలు జరిగితే.. దొంగ ఓట్లు భారీగా వేయిస్తే.. పోలింగ్‌ శాతం పెరుగుతుంది. ఈ విషయం అర్థమయ్యేందుకు చదువుతో పనిలేదు. కానీ చంద్రబాబు మాత్రం దొంగ ఓట్లు భారీగా వేయడం వల్ల పోలింగ్‌ శాతం 2019 ఎన్నికల్లో కన్నా.. 15.17 శాతం తగ్గిందంటున్నారు. పైగా బయట వ్యక్తులు రావడం వల్ల స్థానికులు ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారంటూ మరో తర్కం లేని వాదన వినిపించారు.

ఎందుకిలా..?

తిరుపతి ఉప ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో పోలింగ్‌కు ముందే అందరికీ తెలిసిపోయింది. కాళ్లకు బలపం కట్టుకుని తిరిగినా.. గతంలో వచ్చిన ఓట్లు కూడా రావని టీడీపీ నేతలకు అర్థమైంది. ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో.. అచ్చెం నాయుడు చేసిన వ్యాఖ్యలతో అందరికీ తెలిసిపోయింది. ఈ ఎన్నికల్లో ఎదురయ్యే ఓటమికి కారణాలు ఏం చెప్పాలో టీడీపీ నేతలకు అర్థం కాలేదు. వలంటీర్ల ద్వారా బెదిరిస్తున్నారనే పల్లవి ఎత్తుకున్నా.. అది ఫలించలేదు. మద్యం పంచారు, అధికారం ఉపయోగించారు.. డబ్బులు పంచారు.. అని చెప్పేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఏం చేయాలో తెలియని టీడీపీ నేతలు.. పోలింగ్‌ రోజున దొంగ ఓట్లు అంటూ అనుకూల మీడియాలో హల్‌చల్‌ చేశారు. తర్వాత ప్రమాణాలు, ఓట్లు వేద్దామంటూ సవాల్‌ చేశారు. తాజాగా చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఫలితాలు వచ్చే మే 2 వరకూ ఈ కథ ఏదో ఒక రూపంలో నడుస్తూనే ఉంటుందనడంలో సందేహం లేదు. ఫలితాల తర్వాత.. ఇవే ఆరోపణలు మరికొన్ని రోజులు వినిపిస్తాయి.. ఆ తర్వాత మాయమవుతాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp