ఉప ఎన్నికలు: మధ్యాహ్నం ఒంటి గంటకు ఆశాజనకంగా పోలింగ్‌

By Karthik P Apr. 17, 2021, 03:21 pm IST
ఉప ఎన్నికలు: మధ్యాహ్నం ఒంటి గంటకు ఆశాజనకంగా పోలింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభకు, తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు కరోనాతో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగనుంది. చివరి గంటల కోవిడ్‌ బాధితులకు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. తిరుపతి, నాగార్జున సాగర్‌.. రెండు స్థానాల్లోనూ ఊహించనట్లుగానే పోలింగ్‌ నమోదవుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుపతి లోక్‌సభలో 36.67 శాతం, నాగార్జున సాగర్‌లో 53.30 శాతం మేర పోలింగ్‌ నమోదైంది.

Also Read : తిరుప‌తిలో ప‌ర‌ప‌తి ద‌క్కించుకునేవారెవ‌రు..?

కోవిడ్‌ ప్రభావం, ఎండలు, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం.. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్‌ పై పడుతుందనే ఆందోళనలు అన్ని పార్టీలు వ్యక్తం చేశాయి. అనుకున్నట్లుగానే తిరుపతి ఉప ఎన్నికల్లో పోలింగ్‌ మందకొడిగా సాగుతోంది. 2019లో 79.76 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ సారి అంత స్థాయిలో పోలింగ్‌ నమోదవుతుందా..? అనే అనుమానాలు నెలకొన్నాయి. మెజారిటీపై వైసీపీ, గతం కన్నా ఎక్కువ ఓట్లు సాధించాలని టీడీపీ, టీడీపీని వెనక్కి నెట్టి రెండో స్థానం పొందాలని బీజేపీలు లక్ష్యాలు పెట్టుకున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం నమోదైన పోలింగ్‌ శాతం ఆశాజనకంగానే ఉంది.

తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా సూళ్లూరుపేటలో 40.76 శాతం పోలింగ్‌ నమోదైంది. సర్వేపల్లిలో 38.10 శాతం, గూడూరులో 36.84, వెంకటగిరిలో 37.63, తిరుపతిలో 32.13, శ్రీకాళహస్తిలో 36.98, సత్యవేడులో 36.00 శాతం చొప్పున పోలింగ్‌ నమోదైంది.

Also Read : నాగార్జున సాగ‌ర్ : త్రిముఖ పోరు.. ఎవ‌రిది జోరు..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp