మన సీతాకోకచిలుకలను అందాల పోటీలో గెలిపిద్దామా?

By Kiran.G Sep. 27, 2020, 08:50 am IST
మన సీతాకోకచిలుకలను అందాల పోటీలో గెలిపిద్దామా?

జాతీయస్థాయిలో మన సీతాకోకచిలుకల అందాలు కనువిందు చేయనున్నాయి. 2021 సంవత్సరానికి గాను ఉత్తమ సీతాకోకచిలుకల పోటీ జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుండి మూడు జాతుల సీతాకోకచిలుకలు తుది జాబితాకు అర్హత సాధించాయి. వీటిలో ఉత్తమ సీతాకోకచిలుకలను ఆన్లైన్ ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు.
సెప్టెంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభమైన ఆన్లైన్ ఓటింగ్ అక్టోబర్ 08వ తేదీ వరకు జరుగనుంది. కాగా ఈ సీతాకోకచిలుకల అందాల పోటీల్లో ఎవరైనా పాల్గొని తమకి నచ్చిన జాతికి ఓటు వేయవచ్చని వైల్డ్ లైఫ్ డివిజనల్ ఫారెస్టు అధికారి సి.సెల్వమ్ వెల్లడించారు.

ఈ పోటీలో పశ్చిమగోదావరి జిల్లా పాపికొండల అభయారణ్యంలో మొత్తం 130 జాతుల సీతాకోకచిలుకలు ఉండగా వాటిలో తుది జాబితాకు కామన్‌ జేజేబెల్, కామన్‌ నవాబ్, ఆరెంజ్‌ ఓకలీఫ్‌ అనే మూడు జాతులు ఎంపికయ్యాయి. తుదిజాబితాకు ఎంపికైన సీతాకోకచిలుకలు అత్యంత అరుదైనవని వైల్డ్ లైఫ్ శాస్త్రవేత్త కె.బాలాజీ వెల్లడించారు. దాదాపు 9 నెలల పాటు కష్టపడి ఫొటోలు సేకరించామని, జాతీయస్థాయిలో సీతాకోకచిలుకలు విజేతగా నిలిస్తే పాపికొండల ప్రాంతానికి మరింత పేరు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా సెప్టెంబర్‌ 11వ తేదీ నుంచి ఆన్‌లైన్ ఓటింగ్ ప్రారంభమైంది. మన సీతాకోకచిలుకల అందాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అంటే https://forms.gle/u7WgCuuGSYC9AgLG6 ఈ ట్యాగ్ లింక్ ద్వారా ఓటు వేయవచ్చు. ఓటింగ్ పూర్తి అయిన అనంతరం ఉత్తమ సీతాకోక చిలుకను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటిస్తారని అధికారులు తెలిపారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp