మానవ నిర్మిత మహా సరస్సుకు ముప్పు

By Ramana.Damara Singh Jun. 23, 2021, 03:30 pm IST
మానవ నిర్మిత మహా సరస్సుకు ముప్పు

ప్రపంచంలో మానవ నిర్మిత సరస్సుల్లో అతి పెద్దది.. అమెరికాలో కోట్లాది ప్రజలకు జీవనాధారం. పర్యాటకుల స్వర్గధామం నేడు పెను ముప్పు ముంగిట నిలిచింది. అదే అమెరికా పశ్చిమ ప్రాంతంలో ఉన్న లేక్ మెడ్ సరస్సు. గత కొన్నేళ్లుగా నీటి ప్రవాహం తగ్గిపోయి చరిత్రలో తొలిసారి సరస్సు నీటి మట్టం కనిష్ట స్థాయికి పడిపోయి ఏడు రాష్ట్రాల జీవనాన్ని ఆగమ్యగోచరం చేసింది. గత కొన్నేళ్లుగా పశ్చిమ అమెరికాను వేధిస్తున్న కరువు కాటకాలు, వాతావరణ మార్పులు, మంచు కొండలు కరగకపోవడం, కొలరాడో నదీ పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు లేక్ మెడ్ ను వట్టిపోయేలా చేస్తున్నాయి.

ఘనమైన చరిత్ర

సుమారు 85 ఏళ్ల క్రితం ఈ మహా సరస్సు వినియోగంలోకి వచ్చింది. కొలరాడో నదిపై గ్లేన్ కెన్యాన్ డ్యామ్ నిర్మాణ పనులను పర్యవేక్షించిన అమెరికన్ బ్యూరో ఆఫ్ రీక్లిమేషన్ కమిషనర్ ఎల్ వుడ్ మెడ్ ఆధ్వర్యంలో నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు హోవార్ డ్యాం కట్టడం ద్వారా మానవ నిర్మిత సరస్సు రూపుదాల్చింది. అందువల్లే దీనికి లేక్ మెడ్ అనే పేరు వచ్చింది. దీని పొడవు 190 కిలోమీటర్లు, ఉపరితల విస్తీర్ణం 640 చదరపు కిలోమీటర్లు, లోతు 532 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 26.12 మిలియన్ అడుగులు. లాస్వేగాస్ కు 40 కి.మీ. దూరంలో ఆరిజోనా-నేవేడా సరిహద్దుల్లో కొలరాడో నదిపై హోవర్ డ్యాం ఉంది. 1935 సెప్టెంబర్ 30న తొలిసారి లేక్ మెడ్ వరద నీటితో నిండింది.

బహుళార్థ సార్ధకం

అప్పటి నుంచి హోవర్ డ్యామ్, లేక్ మెడ్ సుమారు నాలుగు కోట్ల మందికి బహుముఖంగా ఉపయోగపడుతున్నాయి. ఆరిజోనా, కాలిఫోర్నియా, కొలరాడో, నేవేడా, న్యూ మెక్సికో, ఉత్త అండ్ వ్యోమాండ్ రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తోంది. ఈ సరస్సు ద్వారానే 5.5 మిలియన్ ఎకరాలు సాగవుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. బోటింగ్, ఫిషింగ్, స్విమ్మింగ్, సన్ బాతింగ్, స్కీయింగ్ తదితర క్రీడా, వినోద రంగాలకు కేంద్రంగా మారి ఆయా రాష్ట్రాలు పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధించాయి. లాస్ వేగాస్, ఫీనిక్స్ వంటి పెద్ద నగరాలకు ఈ సరస్సే ఆధారం.

కరువుతో కష్టకాలం

గత కొన్నేళ్లుగా కొలరాడో నదీ పరివాహక ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. రుతుపవనాలు గతి తప్పడం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా అధిక శాతం నీరు ఆవిరైపోవడం, కాలిఫోర్నియా సెంట్రల్ వ్యాలీ రైతుల అతి వినియోగం వల్ల
కొలరాడో నదిలోకి, దానిపైన నిర్మించిన గ్లేన్ కెన్యాన్ డ్యాములోకి వరద నీటి ప్రవాహం బాగా తగ్గిపోయింది. 2014 నుంచి ఇది మరింత తగ్గడంతో లేక్ మెడ్ సరస్సు నీటి మట్టం పడిపోవడం ప్రారంభమైంది. 2020 ఏప్రిల్లో 1096 అడుగుల మేరకు ఉన్న నీటిమట్టం ఈ ఏడాది జూన్ 9 నాటికి కనిష్ట మట్టమైన 1075 అడుగుల స్థాయికి తగ్గిపోయింది. సరస్సు నీటి సామర్థ్యం 39.04 శాతానికి పడిపోయింది. సరస్సు చరిత్రలోనే ఇది అత్యంత కనిష్టం.

బయటపడుతున్న మునక ప్రాంతాలు

సరస్సు డెడ్ లెవెల్ స్థాయికి తగ్గిపోవడంతో హోవర్ డ్యామ్ నిర్మాణం వల్ల గతంలో మునిగిపోయిన అనేక నగరాల, కట్టడాలు ఇప్పుడు బయటకు కనిపిస్తున్నాయి. 1938లో ముంపునకు గురైన సెయింట్ థామస్ పట్టణం వెలుగులోకి వచ్చి ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. దాంతో సందర్శకుల తాకిడి పెరిగింది. గ్రాండ్ కెన్యాన్ యోసమైట్ వ్యాలీకి వచ్చేవారి కంటే అధికంగా సందర్శకులు ఇక్కడికి తరలివస్తున్నారు. మరోవైపు సరస్సు నీటిమట్టం పడిపోవడం వల్ల దీనిపై ఆధారపడిన వ్యవసాయం, వినోద, క్రీడా, పర్యాటక, విద్యుత్ రంగాలు దెబ్బతింటున్నాయి. ప్రజా జీవనంపై ఇవి పెను ప్రభావం చూపుతున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp