మండపేట లో తోట త్రిమూర్తులు ఏమి మ్యాజిక్ చేశాడు ?

By Jaswanth.T Mar. 14, 2021, 08:45 pm IST
మండపేట లో తోట త్రిమూర్తులు ఏమి మ్యాజిక్ చేశాడు ?

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణానిది విలక్షణమైన రాజకీయశైలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీ హయాయే నడుస్తోంది. అసెంబ్లీ, మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులే విజయం సాధించడం సహజంగానే జరిగితుండేది. టీడీపీకి సహజ బలంగా పరిగణించే కమ్మ సామాజికవర్గం పట్టు ఈ నియోజకవర్గం, ముఖ్యంగా మండపేట పట్టణంపై ఎక్కువగా ఉండడంతో వారు లేదా వారి తరఫున పోటీలో నిలిచిన అభ్యర్ధులనే విజయం వరించేంది. దీంతో ఇతర పార్టీలు ఇక్కడ పట్టుకోసం అనేకానేక ప్రయత్నాలే చేస్తుండేవి. అడపాదడపా విజయం దక్కించుకున్నప్పటికీ అత్యధికశాతం విజయాలు మాత్రం టీడీపీ ఖాతాలోనే ఉండేవి. ముఖ్యంగా మండపేట మున్సిపల్‌ ఛైర్మన్‌గిరీ ఆ పార్టీ మద్దతుదారులే విజయం సాధిస్తుండేవారు.

వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం అనంతరం కూడా ఇక్కడ ఆ పార్టీ అనేక ప్రయోగాలు చేసింది. అయినప్పటికీ విజయం మాత్రం దక్కలేదు. దీంతో 2019 ఎన్నికల అనంతరం వైఎస్సార్‌సీపీలోకి చేరిన తోట త్రిమూర్తులుకు ఇక్కడ కో- ఆర్డినేటర్‌ బాధ్యలు అప్పగించారు. అలాగే అమలాపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షులుగా కూడా ఆయన బాధ్యతలు చూస్తున్నారు.

ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తామని అంచనా వేసుకున్న మూడు మున్సిపాలిటీలలో మండపేటది మొదటి స్థానం,దీనితో పాటు అద్దంకి ,తాడిపత్రి గెలుస్తామని టీడీపీ భావించింది. 2009 నియోజకవర్గాల పునఃవిభనజలో భాగంగా ఏర్పడిన మండపేట నుంచి టీడీపీ తరుపున వి.జోగేశ్వర రావ్ హాట్రిక్ విజయం సాధించాడు.

మున్సిపల్‌ ఎన్నికల్లో తనదైన మార్కు రాజకీయంతో దాదాపు 35 సంవత్సరాల తరువాత మండపేట మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకు రాగలిగారు. ఇందుకు తోట మార్కు రాజకీయమే కారణమని పట్టణ ప్రజలు గంటాపథంగా చెబుతున్నారు. తోట త్రిమూర్తులు రాజకీయానికి పిల్లి సుభాష్ చాణుక్యం తోడవటంతో మొత్తం 30 వార్డులకు గాను 22 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్ధులే విజయం సాధించారు. మరో స్థానంలో స్వతంత్రంగా బరిలో నిలిచిన వైఎస్సార్‌సీపీ రెబల్‌ అభ్యర్ధి విజయం దక్కించుకున్నారు. గత కొన్నేళ్ళుగా అధికారం చెలాయించిన తెలుగుదేశం పార్టీ కేవలం ఏడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది.

Also Read : గోదావరి తీరం వైసీపీకి హారం!

వైఎస్సార్‌సీపీ గెల్చిన స్థానాలన్నీ దాదాపు 100 నుంచి 300 ఓట్ల వరకు మెజార్టీతో వచ్చినవే కావడం మండపేట పట్టణంపై తోట ఏ స్థాయిలో ప్రభావం చూపారన్నది అర్ధం చేసుకోవచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు. కింగ్‌లు, కింగ్‌ మేకర్‌లు, డక్కా మొక్కీలు తిన్న రాజకీయ ఉద్దండులంతా టీడీపీ తరఫున పోటీకి రాగా తోట త్రిమూర్తులు ఒక్కరే వారికి ఎదుర్కొడ్డి నిలిచి, వైఎస్సార్‌సీపీని విజయతీరాలకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించారంటున్నారు.

మండపేట అసెంబ్లీ, మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానాన్ని కైవసం చేకునేందుకు టీడీపీ ప్రత్యర్ధి పార్టీలు అనేక మార్లు ప్రయత్నాలు చేసాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో సైతం ఒక సారి కాపు సామాజికవర్గం అభ్యర్ధికి, మరోసారి బీసీ సామాజికవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్ధులను బరిలో నిలిపి మరీ ప్రయోగాలు చేసింది. కానీ విజయం దక్కించుకోలేకపోయింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున అసెంబ్లీకి పోటీలో నిలిచిన అభ్యర్ధికి కనీసం ఇల్లు కూడా దొరక్కుండా సదరు టీడీపీ ఉద్దండులు ముప్పుతిప్పలు పెట్టిన విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.

అలాగే 2019లో కూడా ఇక్కడి నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఓటమి పాలయ్యారు. అయితే మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో తోటకు మండపేట నియోజకవర్గ బాధ్యతలను సీయం వైఎస్‌ జగన్‌ అప్పగించారు. ఆయన నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా తన సత్తాను తోట త్రిమూర్తులు చాటుకున్నారు. మండపేట మున్సిపాల్టీపై వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేసారు. దీంతో రానున్న 2024 ఎన్నికల్లో సైతం మండపేట నియోజకవర్గంలో సైతం వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేయడం ఖాయమంటూ ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవాల్లో ఢంకాభజాయించి చెబుతున్నారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలోనే అదిపెద్ద జిల్లాగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని పట్టణ ఓటర్లు వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారన్నది స్పష్టమైంది. మొన్న జరిగిన పంచాయతీఎన్నికల్లో సైతం ఇదే విషయం తేలింది. జిల్లాలోని ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీల్లో మొత్తం 268 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 35 ఏకగ్రీవం కాగా, 233 వార్డులకు పోలింగ్‌ జరిగింది. వీటిలో 218 వార్డులను వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులు గెలుపొందారు. టీడీపీ 34 వార్డులకే పరిమితమైపోయింది. ఇతరులు 16 వార్డులతో సరిపెట్టుకున్నారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో సైతం సీయం వైఎస్‌ జగన్‌ పట్టు నిలుపుకున్నట్లుగా స్పష్టమైంది.

Also Read : రాజ‌ధానికే విశాఖ ఓటు - జీవీఎంసీపై వైస్సార్‌సీపీ జెండా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp