చివరిదశకు బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు

By Srinivas Racharla Nov. 06, 2020, 10:20 pm IST
చివరిదశకు బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ చివరిదశకు చేరువైంది. తుది,మూడోదశ పోలింగ్‌ శనివారం జరగనుంది. ఇప్పటివరకు రెండు దశలలో 165 స్థానాలలో ఓటర్లు తమ అభిప్రాయాలను ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. కాగా రేపు మూడోదశలో ఉత్తర బిహార్‌లోని 19 జిల్లాల పరిధిలోని 78 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికలతో పోలింగ్‌ ప్రక్రియ పూర్తవుతుంది.

మూడవ దశలో 2.34 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తుది దశ ఎన్నికలలో 110 మంది మహిళా అభ్యర్థులతో కలిపి మొత్తం 1204 మంది పోటీలో ఉన్నారు. ఈ దశలో అసెంబ్లీ స్పీకర్‌తో పాటు నితీశ్‌ కుమార్‌ క్యాబినెట్‌లోని 12మంది మంత్రులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ చౌదరి జెజె (యు) టికెట్‌పై పోటీ చేస్తుండడం గమనార్హం. కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ కుమార్తె సుభాషిణి యాదవ్‌ బిహారిగంజ్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక తుదిదశ ఎన్నికల పోరులో ప్రతిపక్షాలకు చెందిన అబ్దుల్ బారి సిద్దిఖీ (కేవతి), రమై రామ్ (బోచాహా), సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామ్ నరేష్ పాండే (హర్లాఖి), లవ్లీ ఆనంద్ (సహర్సా), శివ చంద్ర రామ్ (పటేపూర్) వంటి ప్రముఖులు ఎన్నికల క్షేత్రంలో పోరాడుతున్నారు.

తుదిదశ అసెంబ్లీ ఎన్నికలతోపాటు వాల్మీకి నగర్ లోక్‌సభ స్థానానికి కూడా శనివారమే ఉపఎన్నిక జరగబోతోంది.ఈ స్థానం నుండి గెలుపొందిన జేడీయూ ఎంపీ బైద్యనాథ్ మహతో మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమయ్యింది. ఉప ఎన్నికలలో జేడీయూ అభ్యర్థిగా బైద్యనాథ్ కుమారుడు సునీల్ కుమార్ పోటీ చేస్తున్నారు.అయితే ఇక్కడ జర్నలిస్ట్‌గా పనిచేసిన పర్వేశ్ కుమార్ మిశ్రా కాంగ్రెస్‌ తరపున బరిలో నిలవడంతో పోటీ హోరాహోరీగా మారింది.

గత ఎన్నికలలో మహాకూటమిదే ఆధిక్యత

శనివారం ఎన్నికలు జరిగే 78 స్థానాలలో 2015 ఎన్నికలలో మహాఘట్ బంధన్‌ 54 అసెంబ్లీ స్థానాలను (జేడీయూ 10+ ఆర్జేడీ 20+కాంగ్రెస్ 10) గెలుచుకుంది.ఆ ఎన్నికలలో జేడీయూ, ఆర్జేడీ రెండూ కాంగ్రెస్ తో కలిసి ఒకే కూటమిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. కానీ జూలై 2017లో మహాఘట్ బంధన్‌ నుంచి జేడీయూ వైదొలిగి ఎన్డీయేలో చేరి కమలం పార్టీ మద్దతుతో మరోసారి నితీశ్‌ కుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు.ఇక బీజేపీకి 19 సీట్లు లభించగా, ఐదు సీట్లు చిన్న ప్రాంతీయ పార్టీలు దక్కించుకున్నాయి.

ముస్లిం,యాదవ్ మరియు అత్యంత వెనుకబడిన తరగతి (ఓబీసీ) ఓట్లు ఎక్కువగా ఉన్న సీమాంచల్, కోసి,మిథిలా ప్రాంతాలతో కూడిన 78 నియోజకవర్గాలలో మూడవ దశ ఎన్నికలు జరగనున్నాయి.దీంతో ఆఖరి దశ పోలింగ్‌లో జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయేపై ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌ పైచేయి సాధించే అవకాశం ఉంది.కాగా 16 సీట్లలో పోటీ చేస్తున్న అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎం,ప్రతిపక్ష గ్రాండ్ అలయన్స్ ఓట్ బ్యాంక్ పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. అయితే ఓవైసీ పార్టీ ఎంఐఎం ఆశించినంత ఫలితాలు సాధించే అవకాశాలు దాదాపు లేవు.కేవలం ఒకటి లేదా రెండు ఎమ్మెల్యే స్థానాలతో ఎంఐఎం తృప్తి పడాల్సి ఉంటుంది.ఇక ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న పూర్ణియా,అరారియా, కతిహార్‌లలో ఎన్డీయే కఠిన పరీక్షని ఎదుర్కొంటుంది.

సత్తా చాటేందుకు సిద్ధం అంటున్న పాశ్వాన్‌,పప్పూ యాదవ్‌

ఎన్నికల బరిలో తన విజయం కంటే అధికార జేడీయూ ఓటమికి కంకణం కట్టుకున్న చిరాగ్‌ పాశ్వాన్‌ అధికార ఎన్డీయేకి కంట్లో నలుసులా తయారయ్యాడు.మూదో దశ పోలింగ్‌ జరుగుతున్న కొన్ని స్థానాలలో అధికార పక్షానికి ఎల్‌జేపీ కూడా గట్టి పోటీ ఇవ్వనుంది.మూడో దశ ఎన్నికల ప్రచారంలో చిరాగ్‌ పాశ్వాన్‌, సీఎం నితీశ్‌ కుమార్‌కి వేసే ప్రతి ఓటు బీహార్‌ అభివృద్ధికి తూట్లు పొడుస్తోందని విస్తృతంగా ప్రచారం చేశాడు.మరోవైపు సీమాంచల్‌ ప్రాంతంలో పట్టున్న మాజీ పార్లమెంట్‌ సభ్యుడు,జన్‌ అధికార్‌ పార్టీ (జేఏపీ) నేత పప్పూ యాదవ్‌ తన సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నాయకత్వంలోని జేఏపీ, ఆజాద్‌ సమాజ్‌ పార్టీ, బహుజన్‌ ముక్తి పార్టీ, సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డీపీఐ)లు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి.ఈ నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ ఓట్లు సాధించి తమ ప్రభావాన్ని నిరూపించుకునేందుకు ఈ కూటమి కూడా శతవిధాలా ప్రయత్నిస్తుంది.ఈ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న పప్పూయాదవ్‌ మాధేపురా నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు.

భావోద్వేగ ఓట్లపై ఆశలు పెట్టుకున్న ఎన్డీయే

వరుసగా నాలుగోసారి ముఖ్యమంత్రి పదవిని కాంక్షిస్తూన్న జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ ఎన్నికల ప్రచారం చివరి క్షణాలలో 'ఇవి నా చివరి ఎన్నికలు' అంటూ ఓటర్లకు భావోద్వేగమైన విజ్ఞప్తి చేశారు.ఈ ప్రకటన ద్వారా చివరి ప్రయత్నంగా ఓటర్లపై సానుభూతి అస్త్రాన్ని సీఎం నితీశ్‌ ప్రయోగించారు.అలాగే ఓటర్లను ఆకర్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తనదైన భావోద్వేగ 'జై శ్రీ రామ్', 'భారత్ మాతా కి జై', పుల్వామా అమరవీరులు, ఆర్టికల్ 370 ను రద్దు చేయడం,పౌరసత్వం (సవరణ) చట్టం, గంగా మరియు ఛతీ మైయా (గంగా మరియు సూర్య దేవత) వంటి అంశాలను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు.

ఇక ప్రతిపక్ష మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ ప్రధానంగా యువతకు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన హామీని పునర్ఘాటిస్తూ విస్తృతంగా ప్రచారం చేశారు.మహా కూటమి తరఫున ప్రచారం చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం,లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడ్డ బీహారీ వలస కార్మికుల సమస్యలు, నూతన వ్యవసాయ చట్టాలు,కార్పొరేట్ రుణాలు మాఫీ,గత ఎన్నికల హామీలను నెరవేర్చక పోవడం వంటి సమస్యలపై అధికార ఎన్డీయేని నిలదీశారు.దీంతోపాటు బీహార్ ప్రజల ఆర్థిక పరిస్థితి పదిహేనేళ్ల నితీష్ ప్రభుత్వంలో ఎందుకు మారలేదని రాహుల్ ప్రశ్నించారు.

కాగా నవంబర్ 10న (మంగళవారం) చేపట్టే ఓట్ల లెక్కింపుతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేది నితీష్ కుమారా లేక తేజస్వీ యాదవా అని తేలనుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp