కొత్త జిల్లాల‌పై క‌మిటీ అధ్య‌య‌నం చేసే అంశాలివే..

By Kalyan.S Aug. 08, 2020, 06:50 am IST
కొత్త జిల్లాల‌పై క‌మిటీ అధ్య‌య‌నం చేసే అంశాలివే..

13 జిల్లాల ఆంధ్ర‌ప్ర‌దేశ్ త్వ‌ర‌లోనే 25 జిల్లాలుగా అవ‌త‌రించ‌నుంది. స‌ర‌ళ‌మైన‌, సుల‌భ‌మైన పాల‌నా అందించే దిశగా కృత‌నిశ్చ‌యంతో ఉన్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొత్త జిల్లాల అధ్య‌య‌నాకి సంబంధించి శుక్ర‌వారం క‌మిటీని కూడా ఏర్పాటు చేసింది. మూడు రాజ‌ధానులు.. 25 జిల్లాల‌తో ఏపీ భౌగోళిక స్వ‌రూపం స‌మూలంగా మారిపోనుంది.

ఇటీవల ఏపీ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాల పునర్ వ్య‌వస్థీకరణ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీని నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల ఏర్పాటుకు ఈ కమిటీ పనిచేయనుంది. సభ్యులుగా సీసీఎల్‌ఏ, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ, ప్రణాళికా శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారిని నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. కమిటీ కన్వీనర్‌గా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఉండనున్నారు. మూడు నెలల్లోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించింది. ఈమేరకు గడువు విధిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్న విష‌యం తెలిసిందే.

ప‌రిగ‌ణ‌న‌లోకి ఈ అంశాలు

కొత్త జిల్లాల ముఖ‌చిత్రం ఎలా ఉండాలి..? జిల్లా ప్ర‌ధాన కేంద్రం ఏ ప‌ట్ట‌ణంలో ఉండాలి..? అనే అంశాల‌పై ఈ క‌మిటీ అధ్య‌య‌నం చేయ‌నుంది. ఆయా జిల్ల‌లాలోని మండ‌లాలు, గ్రామాల వివ‌రాల‌ను సేక‌రిస్తుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ జిల్లాల ఏర్పాటు చ‌ట్టం - 1974 ప్ర‌కారం కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్ర‌జ‌ల అభ్యంత‌రాల‌ను, సూచ‌న‌లను స్వీక‌రిస్తుంది. ఆయా ప్రాంతాల వారీగా వ‌చ్చే అభ్యంత‌రాలు, సూచ‌న‌ల‌పై క‌మిటీ స‌భ్యులు చ‌ర్చిస్తారు. ఆయా ప్రాంతాల‌లోని రాజ‌కీయ‌, అధికార ప్ర‌ముఖ‌ల అభిప్రాయాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుంది. ఇదిలా ఉండ‌గా.. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందే.. గ్రామ‌, మండ‌ల‌, రెవెన్యూ డివిజ‌న్ల పున‌ర్విభ‌జ‌న చేయాల్సి ఉంటుంద‌న్న అభిప్రాయం కూడా వ్య‌క్తం అవుతోంది. కొన్ని లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాలు రెండు జిల్లాల ప‌రిధుల్లోనూ ఉన్నాయి. వాటిలోని మండ‌లాల‌ను స‌మంగా రెవెన్యూ డివిజన్ల‌కు పంపిణీ చేయాలి. ఇది జ‌ర‌గాలంటే తొలుత మండ‌లాలు, డివిజ‌న్ల పున‌ర్విభ‌జ‌న చేయాల్సిందేన‌ని తెలుస్తోంది. దీనిపై కూడా క‌మిటీ నిర్ణ‌యం తీసుకోనుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp