ABN RK Kothapaluku - కొత్త విషయం ఏముంది..?

By Aditya Oct. 17, 2021, 01:00 pm IST
ABN RK Kothapaluku - కొత్త విషయం ఏముంది..?

తనకు పత్రికాధిపతిగా జన్మనిచ్చిన చంద్రబాబునాయుడి రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అక్షరాలు సిగ్గు విడిచేస్తున్నాయి. పాత్రికేయ ప్రమాణాలకు పాతర వేస్తూ ఎప్పటిలాగే ఈ వారం కొత్త పలుకు బొత్తిగా చెత్తగా సాగింది. అనుకుంటున్నారట, తెలిసింది, అట వంటి పడిగట్టు పదాలతో అవాస్తవాలను నిజాలుగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. దివాలా దిశగా ఆంధ్రప్రదేశ్, దక్షిణాదిలోనే తీవ్రంగా బొగ్గు కొరత ఎదుర్కొంటున్న ఏపీ, రాష్ట్రంలో రోడ్లు వేయడానికి ముందుకురాని కాంట్రాక్టర్లు, కులాల కుంపట్లు రాజేస్తున్న ముఖ్యమంత్రి అంటూ విషం చిమ్మారు.

పరస్పర విరుద్దంగా.. పరమదారుణంగా..

అన్ని రకాలుగా సంక్షోభం ఎదుర్కొంటున్న జగన్మోహనరెడ్డిని ఢిల్లీ ప్రభుత్వం ఆదుకొంటోంది అని ఒకచోట రాశారు. జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడైన హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథిరెడ్డిపై ఈడీ దాడులు చేసిందని, ఇక ఆయన పని అయిపోయినట్టే అని అర్థం వచ్చేలా మరోచోట రాసేశారు. జగన్ సన్నిహితుడిపైనే ఈడీ దాడులు చేస్తుంటే ఇక ఢిల్లీ ప్రభుత్వం ఆయనను ఎలా కాపాడుతోందో రాధాకృష్ణకే తెలియాలి.

చీకట్లో చెప్పుతో కొట్టుకున్నాడట..!

రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు నిద్రపోతున్నాయి. ఒక్క పోలీసుశాఖ మాత్రమే పని చేస్తోంది. అదికూడా ప్రభుత్వ అరాచకాన్ని ప్రశ్నించేవారిపై కేసులు పెట్టడానికే అని రాశారు. రాష్ట్రం ఇంతగా దిగజారిపోవడంతో ఒకాయన కలత చెందారట. గత ఎన్నికల్లో జగన్మోహనరెడ్డిని సమర్థించినందుకు బాధపడుతూ తనను తాను చీకట్లో చెప్పుతూ కొట్టుకున్నానని ఈయన గారికి చెప్పారట! ఈలాంటి చీకటి వ్యవహారాలు ఈయనకు మాత్రమే ఎందుకు చెబుతారో తెలియదు.

దేవుళ్లనూ వదలని దైన్యము

రాముడు, అల్లా, జీసస్ కలసి అవతరించినా ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేరని, అంతగా జగన్ పాలనలో పరిస్థితి దిగజారి పోయిందని బ్రాధ పడిపోయారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల ఆస్తులు క్రమంగా పెరిగి పోతున్నాయని వాపోయారు. అయితే వాటికి ఎటువంటి ఆధారాలు ఉదహరించ లేదు. అంటే ఈయన రాశారు కనుక వారంతా అవినీతి పరులని మనం అర్థం చేసుకోవాలన్న మాట. గుజరాత్ కు చెందిన పారిశ్రామిక వేత్త గౌతమ్ ఆదానీ సీఎం జగన్మోహనరెడ్డికి ఎందుకు ఆప్తుడిగా మారారు అని ప్రశ్నించిన ఈయన ముందు ముందు ఆర్థికంగా ఆదుకోవడానికే అంటూ సమాధానం కూడా ఇచ్చారు!

కులం చుట్టూ కలం చక్కర్లు

ఆంధ్రప్రదేశ్ లో కులాల మధ్య ముఖ్యంగా కాపు, కమ్మ వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి సీఎం జగన్మోహనరెడ్డి ప్రయత్నం చేస్తున్నారని రాసిన రాధాకృష్ణ అందుకు ఒక్క ఉదంతాన్ని ఉదహరించలేదు. ఏ ఆధారం చూపించలేదు. కానీ తన వ్యాసంలో వ్యక్తుల పేర్లు, కులాలు, బంధుత్వాలు ఉదహరిస్తూ వారి మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నట్టు అక్షరాలా దొరికిపోయారు. మా ఎన్నికల్లో సీఎం జగన్ జోక్యం చేసుకొని తన బంధువు మంచు విష్ణును గెలిపించారని రాశారు. కమ్మ కులస్తుడైన విష్ణు గెలవడంతో చిరంజీవి కుటుంబం సపోర్టు చేసిన ప్యానెల్ ఓడిపోయింది. ఆ విధంగా కాపులపై కమ్మలు ఆధిపత్యం సాధించారని, ఈ కారణంగా భవిష్యత్తులో పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడు ల పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయవని విశ్లేషించారు. వారి డెడ్లీ కాంబినేషన్ తో వైఎస్సార్ సీపీ ఓడిపోకుండా ఉండేందుకు జగన్ మా ఎన్నికల్లో జోక్యం చేసుకుని కమ్మ, కాపుల మధ్య చిచ్చు పెట్టారని, జనసేనతో టీడీపీ కలవకుండా రాజకీయం చేశారని రాశారు.

ఒంటరిగా పోటీ చేసి 51 శాతం ఓట్లతో విజయం సాధించిన జగన్ కు టీడీపీతో జనసేన కలిస్తే నష్టం ఏమిటి? చిత్తుగా ఓడిపోయిన ఈ పార్టీలకు భయపడి సీఎం స్థాయి వ్యక్తి పట్టుమని వెయ్యి ఓట్లు కూడా లేని మా ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం ఏమిటి? లాజిక్కులు లేకుండా రాసే ఈ రాతలు ఎవరు నమ్ముతారు.

వైఎస్సార్ అభిమానులకూ నచ్చని పాలన అట..

జగన్మోహనరెడ్డి పాలన వైఎస్సార్ అభిమానులకు సైతం నచ్చడం లేదని సూత్రీకరించారు. జీతాలు, పెన్షన్లు సరిగా ఇవ్వకపోవడం, బొగ్గు కొరతతో విద్యుత్ కోతలు, పారిశ్రామిక వేత్తలు ముందుకు రాకపోవడం వంటి కారణాల వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో కూరుకుపోతోందని నిర్థారణ చేశారు. దీనిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని ఆ మధ్య ట్విటర్ లో పవన్ కల్యాణ్ కోరారని పేర్కొన్నారు. అయితే ఆ సమావేశానికి లోకాయుక్త లక్ష్మణరెడ్డి, వడ్డి శోభానాద్రీశ్వరరావు, యలమంచిలి శివాజీ, ఐవైఆర్ కృష్ణారావు వంటి మేధావులను పిలవాలని సూచించడం బాగా లేదని వారంతా గతంలో జగన్ విధానాలను సమర్థించారని, ఈ ఆర్థిక సంక్షోభానికి వారే కారకులని రాసేశారు.అమరావతి గొంతు నులిమి చంపుతున్నా వీరెవరూ మాట్లాడడం లేదని వారిపై తన అక్కసు వెళ్లగక్కారు. అసలు రెండున్నర ఏళ్లలో జగన్ ఏమి సాధించారని ఒక ప్రశ్న సంధించారు. నవరత్నాలకు తూట్లు పొడిచారు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమ్మ ఒడి డౌటే, ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా మసక బారింది. జగన్ ప్రత్యర్థులను వేధించటం కోసం పోలీసు కేసులు పెడుతున్నారు అంటు తన ఇష్టానుసారం రాసేశారు.

దీనికేమంటారో?

రాధాకృష్ణ లెక్క ప్రకారం రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోంది. అదే నిజమైతే అత్యధిక మెజార్టీతో ప్రజలెన్నుకున్న ప్రభుత్వంపై నిత్యం విషం కక్కుతూ వారం వారం ముఖ్యమంత్రి ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా కొత్తపలుకును అచ్చోసి వదిలేస్తున్న ఈయన గారిని పోలీసులు ఎందుకు వదిలేశారు?

తన బాస్ కోసమే..

సంక్షేమ యజ్ఞంతో ప్రజల హృదయాల్లో కొలువైన ప్రభుత్వం ఎక్కువ కాలం పరిపాలిస్తే తన బాస్ చంద్రబాబునాయుడుకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనే భయంతోనే ఇలా బరితెగించి బరికేస్తున్నారు. ఈయన కోరుకుంటున్నట్టు ప్రజలు కులాల వారీగా విడిపోయి కొట్టుకొనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు. రాదు కూడా. జనం విజ్ఞతను తక్కువగా అంచనా వేసి చేసే కలం విన్యాసం వల్ల రాష్ట్రంలో కులాల కుంపట్లు రాజుకోవు గాక రాజుకోవు. 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp