అబ్బే మా తప్పేం లేదు

By Kiran.G Nov. 19, 2019, 04:01 pm IST
అబ్బే మా తప్పేం లేదు

ఒక స్వామిజి రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికినా, ఒక రాజకీయ నాయకుడు అవినీతి చేస్తూ స్టింగ్ ఆపరేషన్ లో దొరికినా, ఒక సినీ నటుడు డ్రగ్స్ తీసుకుంటూ కెమెరాలకు చిక్కినా, ఆ దొరికిన వ్యక్తుల నుండి ముందుగా వచ్చే మాట అబ్బే మా తప్పేం లేదు, మా ఫోటోలు వీడియోలు పథకం ప్రకారం మార్ఫింగ్ చేసారని. మా ఎదుగుదలను చూడలేక కావాలని మాపై బురద జల్లుతున్నారని స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇప్పుడు పరిపాటిగా మారింది. అక్కడెక్కడో బ్రెజిల్ దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండను చూశామని అది దాదాపు 130 అడుగుల పొడవు ఉందని, అమెరికాలో ఏలియన్స్ ని, ఎగిరే పళ్ళాలను చూశామని, హిమాలయాల్లో యతి కనబడిందని, హిమాలయాల్లో తిరిగే మూషికా సర్పం పిక్ ని షేర్ చేస్తే మంచి జరుగుతుందని, జనాల్ని మాయ చేస్తూ, గ్రాఫిక్స్ లో తయారుచేసిన ఫోటోలు పెడితే నమ్మిన జనాలు, తమ కళ్ళముందు జరిగిన వాటిని మాత్రం నమ్మలేకపోతున్నారు. దీన్నే చిత్రం అనుకోవాలేమో ?

ఎందరో నాయకులకు సంబంధించిన వీడియో క్లిప్స్ బయటకు వచ్చినా, వాయిస్ రికార్డులు దొరికినా అబ్బే అదంతా నిజం కాదు. ప్రతిపక్షాల కుట్ర అని స్టేట్మెంట్ ఇచ్చేసి తప్పించుకోవచ్చు. ప్రజలు కూడా వాటిని నమ్మే స్థితిలో ఉండటం లేదు. ఓటుకు నోటు విషయంలో ఒక నాయకుడు అడ్డంగా దొరికినా అదంతా నన్ను ఇరికించాలని చేసిన ఒక ప్రయత్నంగా ఆ నాయకుడు చెప్పుకున్నాడు, ప్రజలు కూడా ఆ విషయం మర్చిపోయారు.కానీ ఆ విషయం మాత్రం కొన్ని రోజులపాటు మీడియాకి మాత్రం హెడ్ లైన్స్ వేసుకునే వార్తగా అది మిగిలిపోయింది. అలాగే ఇప్పుడు తాజాగా ఒక రాజకీయ నాయకుడికి, కలెక్టర్ కి మధ్య జరిగిన సంభాషణలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. దానికి సంబంధించి సదరు కలెక్టర్ ని వివరణ కోరగా ఎన్నికలు జరిగిన తరువాత ఆ నాయకుడితో మాట్లాడిన మాట నిజమేనని, కానీ పూర్తి వాయిస్ క్లిప్ ను కట్, కాపీ, పేస్ట్ చేసి ఇష్టమొచ్చిన విధంగా మలచుకున్నారని, పూర్తి వాయిస్ క్లిప్ వింటే నిజాలు తెలుస్తాయని, అసలైన ఆడియో క్లిప్పును ప్రభుత్వానికి ఇచ్చానని వివరణ ఇచ్చారు. ఇలాంటి క్లిప్పులు, రికార్డింగ్ లు ఎన్ని బయటకు వచ్చిన ఇదంతా గ్రాఫిక్స్ లో మార్చారనో లేదా కట్ కాపీ పేస్ట్ చేసారనో వివరణ ఇచ్చేసి చేతులు దులుపుకుంటే, ప్రజలు కొన్ని రోజులు ఆ విషయం గురించి మాట్లాడుకుని మెల్లగా కొత్త విషయం దొరికినపుడు పాత విషయం మర్చిపోతారు..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp