పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారు..?

By Srinivas Racharla Aug. 26, 2020, 07:40 am IST
పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారు..?

సాధారణంగా ప్రతి సంవత్సరం జూలై మధ్యలో ప్రారంభమై ఆగస్టు చివరి వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. ఈ ఏడాది దేశంలో కరోనా వైరస్ విజృంభణతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణపై నీలి నీడలు నెలకొన్నాయి.

అయితే రాజ్యాంగం ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి చట్ట సభలు తప్పనిసరిగా సమావేశం కావాలి.దీంతో వచ్చే నెలలో ఈ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తేదీలు దాదాపు ఖరారయ్యాయి. సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 1 వరకు18 రోజుల పాటు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్లమెంట్‌ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సిఫార్సు చేసింది.
మరోవైపు కరోనా నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణ కోసం అధికారులు ఉభయసభల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా ఉభయసభలలో సభ్యులకు సీట్ల కేటాయింపు కసరత్తు కూడా ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఉభయ సభలలోనూ ఛాంబర్‌లు,గ్యాలరీలను సభ్యుల సీటింగ్‌కే కేటాయిస్తున్నారు.

లోక్‌సభ సభ్యులకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో,రాజ్యసభ సభ్యులకు లోక్‌సభ,రాజ్యసభలో సీట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.రాజ్యసభ సభ్యులలో 60 మంది ఛాంబర్‌లో,మరో 51మంది గ్యాలరీలలో,మిగతా 132 మంది సభ్యులు లోక్‌సభలో కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.సభ్యులు సమావేశాలను వీక్షించేందుకు అనుగుణంగా ఆయా ప్రదేశాలలో భారీ తెరలను ఏర్పాటు చెయ్యనున్నారు.ఇక సమావేశాలు జరిగే ప్రతి రోజూ ఉదయం లోక్‌సభ,మధ్యాహ్నం రాజ్యసభ సమావేశాలు నిర్వహించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు.

ఇప్పటికే మోడీ క్యాబినెట్‌లోని పలువురు కేంద్ర మంత్రులతో పాటు,కొంత మంది పార్లమెంట్ సభ్యులు వైరస్ బారిన పడటంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణపై సర్వత్ర ఆసక్తి నెలకొని ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp