విమాన ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన సామాన్యులు

By Raju VS Aug. 08, 2020, 09:33 am IST
విమాన ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన సామాన్యులు

ఓవైపు కరోనా మహమ్మారి కలవరపరుస్తోంది. మరోవైపు హోరున వర్షం. ఆ సమయంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అందరినీ కలవరపరిచింది. అయినా వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రమాదం జరిగిన క్షణాల్లో సహాయక చర్యలకు సిద్ధమయ్యారు. సమీపంలో ఉన్న వారంతా చేయూతనిచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారందరినీ ఆదుకునేందుకు నడుంకట్టారు. తమకు అందుబాటులో ఉన్న ట్యాక్సీలు, ఆటలలోనే అనేక మందిని ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడేందుకు మలప్పురం వాసులు చేసిన ప్రయత్నం అందరికీ ఆదర్శనీయంగా నిలిచింది.

శుక్రవారం రాత్రి 7.30 గంటలు దాటిన తర్వాత దుబాయ్ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంపై రన్ వే పై నుంచి జారిపోవడంతో పెద్ద ప్రమాదం జరిగింది. అయితే గతంలో ఎన్నడూ లేని రీతిలో అక్కడ ఇంత పెద్ద ప్రమాదం జరగడంతో అవసరమైనంత మంది సహాయక సిబ్బంది గానీ,సామాగ్రి గానీ అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. రన్ వై నుంచి సమీపంలోని లోతైన ప్రాంతానికి విమానం జారిపోవడంతో అందులో చిక్కుకున్న వారిని వెలుపలికి తీసుకురావడం కష్టంగా మారింది. అలాంటి సమయంలో స్థానికులు చూపించిన చొరవ అనేక మంది ప్రాణాలు కాపాడింది.
ఓవైపు ప్రమాద స్థలంలో బాధితులను బయటకు తీసి, ఆస్పత్రికి తరలించడం, ప్రభుత్వ బృందాలు రాకముందే దాదాపుగా 70 శాతంమందిని స్థానిక ప్రజలే రక్షించడం విశేషంగా చెబుతున్నారు. కరీపూర్ పట్టణంలో జరిగిన విమాన ప్రమాదంలో శిధిలాల కింద చిక్కుకున్న ప్రయాణికుల కోసం రెస్క్యూ బృందాలు దూర ప్రాంతాల నుంచి వర్షంలో అక్కడికి చేరడంలో జరిగిన జాప్యాన్ని స్థానికులు తమ పెద్ద మనసుతో అధిగమించారు. 190 మంది ప్రయాణిస్తున్న విమానంలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోకుండా కాపాడడంలో వారి ప్రయత్నం ఫలితాన్నిచ్చిందని అంటున్నారు.

అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, గాయపడిన వారికి సంబంధించిన సమాచారం కూడా చేరవేసేందుకు ప్రయత్నించారు. విమానాశ్రయం సమీపంలో పనిచేసే ఓ ప్రత్యక్ష సాక్షి, వాట్సాప్‌లో జరిగిన ప్రమాదం గురించి చదివిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నానని చెప్పారు. విమానాశ్రయం ప్రీపెయిడ్ టాక్సలన్నింటినీ పిలిచి సమీపంలోని మెర్సీ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించామని వివరించారు.
కొద్దిసేపటికి కేరళలో ఉన్న వివిధ వాట్సాప్ గ్రూపుల నిండా ఆసుపత్రులకు తీసుకెళ్లేటప్పుడు ప్రయాణికుల గుర్తింపును కోరుతూ ఉన్న ఫోటోలతో నిండిపోయాయి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారనే సమాచారంతో మారుమ్రోగాయి. బంధువులు తమ వారి కోసం ఎక్కువ సేపు వెదకాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆయా ఆస్పత్రులకు వెళ్లడానికి దోహదపడ్డాయి. అలా వెంటనే సమచారం చేరడంతో కొందరు సమీపంలోని మెరుగైన ఆస్పత్రికి తరలించడానికి కూడా తోడ్పడిందని అంటున్నారు. మొత్తంగా మల్లాపురం జిల్లా వాసుల పెద్ద మనసు అనేక మంది ప్రాణాలు కాపాడడంలో తోడ్పడిందని అధికారులు కూడా చెబుతున్నారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp