వస్తామన్నోళ్లు రాలేదు.. ఈలోపే అభిమానులోచ్చేశారు..

By Sridhar Reddy Challa Feb. 29, 2020, 12:58 pm IST
వస్తామన్నోళ్లు రాలేదు.. ఈలోపే అభిమానులోచ్చేశారు..

గతవారం అమరావతి జేఏసీ పేరుతొ కొందరు వ్యక్తులు జూబ్లీహిల్స్ లోని చిరంజీవి ఇంటి ముందు ఫిభ్రవరి 29 న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా చేస్తున్నాం, అమరావతి కి మద్దతు ఇచ్చేవాళ్లందరు చిరంజీవి ఇంటిని ముట్టడిద్దామని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అమరావతి మద్దతుదారులంతా తమ దీక్షకు సంఘీభావం తెలపాలని హైదరాబాద్‌లో జరిగే దీక్షను జయప్రదం చేయాలని అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ పేరిట ఓ స్టేట్‌మెంట్ వైరల్‌గా మారింది.
ఈ నేపథ్యంలో ఈ రోజు జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు చిరంజీవీ ఇంటి ముందు హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పరిసరాల్లోకి ఎవరిని రానివ్వకుండా బారీకేడ్లను ఏర్పాటు చేశారు.

కాగా ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ అభిమానులు ఈరోజు పెద్ద ఎత్తున చిరంజీవి ఇంటి వద్దకు చేరుకొని ఆయనకీ మద్దతుగా కొద్దిసేపు నినాదాలు చేశారు. మెగాస్టార్‌కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని అభిమానులు హెచ్చరించారు. అయితే అమరావతి జేఏసీ పేరుతొ ధర్నాకు పిలుపునిచ్చినప్పటికీ వారికి మద్దతుగా ఇల్లుని ముట్టడించడానికి ఇంతవరకు ఎవరు రాకపోవడం విశేషం.

ఐతే దీనిపై అమరావతి జేఏసీ శుక్రవారం ఒక క్లారిటీ ఇచ్చింది. అమరావతి పరిరక్షణ సమితి పేరిట చిరంజీవి ఇల్లు ముట్టడికి సంభందించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమరావతి జేఏసీ తరపున గద్దె తిరుపతిరావు నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. చిరంజీవి ఇల్లు ముట్టడి వార్తలను ఖండించిన ఆయన ఆ ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని ప్రజలకు సూచించారు. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కావాలనే కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

గతంలో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసినప్పుడు దానికి చిరంజీవి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. జీఎన్ రావు కమిటీ సిఫార్సులు సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేలా ఉన్నాయని చిరంజీవి తన వ్యక్తిగత అభిప్రాయం తెలిపారు. అయితే ఏపీలో మూడు రాజధానులకు చిరంజీవి మద్దతు తెలపడం అప్పట్లోనే రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. చిరంజీవి ప్రకటన కి నిరసనగా అమరావతి రైతులు గతంలో సినిమా హీరోల ఇళ్ల ఎదుట కూడా ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp