మీడియాలో మన,తన ధోరణి

By Ravuri.SG Feb. 15, 2020, 09:47 am IST
మీడియాలో మన,తన  ధోరణి

జగన్ వాళ్ళ పెదనాన్న గారి మాంగారి బామ్మర్దికి.. వేలు విడిచిన పిన్నమ్మ గారి అల్లుడి తోడల్లుడి మనవడింట్లో కానీ ఈ ఇన్కం ట్యాక్స్ సోదాలు జరిగుంటే 'మన వాళ్ళ' మీడియా ఈ పాటికి ...

"వలలో చిక్కిన చిన్న చేప" - అంటూ పెద్ద అక్షరాలతో బ్యానర్, దాని కింద చిన్న అక్షరాలతో 'త్వరలోనే తిమింగలానికీ గురి', 'తిలా పాపం తలా పిడికెడు' అని చిన్న అక్షరాలతో రెండు లైన్లు.. జరిగిన సోదాల గురించి, సదరు శాఖ విడుదల చేసిన ప్రెస్ నోట్ గురించి ఒక ఫోర్ కాలం వార్త; పక్కనే ఐటి అధికారులు ఇంటి లోపలకు వెళ్ళినప్పటి నుంచి ప్రతీ క్షణం ఏమేం చేశారో బాక్స్ కట్టి సింగిల్ కాలం వార్త; వార్తకు ఒక వైపు వైఎస్ జగన్ బొమ్మతో మెయిన్ పేజిలో దాదాపు సగం పూర్తి. ఆ పేపర్ మడత పైన ఒక వరసలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోక్ సత్తా జేపీ, సీపీఐ రామకృష్ణ లు ఇచ్చిన స్టేట్మెంట్లు వారి ఫోటోలతో పాటు డబ్బాలు కట్టి 'వార్త ఫలానా పేజీలో' అని నింపేసేవారు. కింద సగంలో అక్కడ లెక్క తేలని సొమ్ములు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి అధికారం అడ్డు పెట్టుకుని జగన్ సంపాదించినవే అంటూ ఫోర్ కాలం లో ఒక కథనాన్ని వైవిధ్యంగా వండి వార్చేవారు. ఆ కిందన 'వేసవి మొదలైనా, సార్ నిన్నటి నుంచి ఏసీ వేయద్దంటున్నారు' అని ఒక ప్యూన్ గది బయట ఉన్న అధికారులకు చెప్తున్నట్టు, గది లోపల వైఎస్సార్ భయపడుతూ ఫొటోలో నుంచి చూస్తుంటే వైఎస్ జగన్ వణికిపోతున్నట్టు బొమ్మ వేసి పాకెట్ కార్టూన్ ఒకటి వేసి హాస్యాన్ని పండించేవారు. ఈ వార్తలన్నీ వేయగా మిగిలిన మెయిన్ పేజీలో నాలుగో భాగం ఒక వాణిజ్య ప్రకటన.

రెండో పేజిలో ఏ దేశం నుంచి ఏ దేశానికి నిధులు ఎలా వెళ్ళాయో మ్యాపులు వేసి, బ్యాగ్రౌండ్లో పంచెకట్టులో వైఎస్సార్, దాని ముందు గళ్ళ చొక్కాలో వైఎస్ జగన్, దాని ముందు ప్రస్తుతం ఐటి అదుపులో ఉన్న వ్యక్తి బొమ్మలతో పెద్ద పెద్ద క్యారికేచర్లు వేసి; ఆ పేజి మొత్తం మనీ లాండరింగ్ మీద రాష్ట్ర ప్రజలకు అవగాహన కలిగించేలా 'మన వాళ్ళ' దగ్గర ఒక నాలుగు వ్యాసాలు రాయించి పారేసుంటారు. మూడో పేజిలో అసలు ఏం జరిగింది? ఈ ఆరోపణలు నిరూపితమైతే ఏ సెక్షన్ కింద ఎన్ని సంవత్సరాలు ఎవరెవవరికి ఏ శిక్షలు పడతాయో, ఎన్ని లక్షల జరిమానాలు విధిస్తారో, కోర్టులు ఏ తీర్పు ఇవ్వచ్చో కూడా మాజీ న్యాయమూర్తుల అభిప్రాయాలతో అచ్చేసుంటారు. ఇక నాలుగో పేజీలో "ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు చేసి, కేసులు వేసి వాయిదాలతో కాలయాపన చేస్తే సరిపోదు, న్యాయస్థానాలు సైతం ఈ కేసుల మీద సత్వరమే విచారణ జరిపించి దోషులకు సరైన శిక్ష పడేలా చేసినప్పుడే సామాన్యులకు చట్టం మీద నమ్మకం కలుగుతుంది" అంటూ సంపాదకీయంతో పాఠకులకు జ్ఞానబోధ చేసుంటారు. అలా ఒక వారం పాటు వింత వింత హెడ్డింగులతో విచారణ మొత్తాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తూ ఊదరకొట్టేసేవారు.

ఆ మీడియా పనిగట్టుకుని మరీ టీడీపీ యేతర పక్షాల మీద చేసే డిటైలింగ్ ,రిపోర్టింగ్ చంద్రబాబు మీద ఆరోపణలు వచ్చినప్పుడు "ప్రముఖ వ్యక్తి"గా ట్రాన్సలేట్ అయిపోతాయి... గట్టిగా మాట్లాడితే "నేరాల చిట్టా" పేరుతొ పాత కథలను కొత్తగా మళ్లి తెరమీదికి తెస్తారు... ఇది మన వాళ్ళ మీడియా నైజం..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp