గ్రేటర్ సుడిగాలిలో గల్లంతైన టీడీపీ

By Kranti Dec. 05, 2020, 07:30 am IST
గ్రేటర్ సుడిగాలిలో గల్లంతైన టీడీపీ

హైదరాబాదుకు అంతర్జాతీయ ఖ్యాతినిచ్చింది మేమే చెప్పుకున్న పార్టీ గ్రేటర్ గలాటలో తప్పిపోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉనికిని కూడా చాటుకోలేకపోయింది. 106 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ ఒక్క చోట కూడా విజయాన్ని దక్కించుకోలేక పోయింది. నిన్నటి దాకా... మేమున్నామని గుర్తించండి అనే స్థాయిలో నిలబడిన ఆ పార్టీ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. తెలంగాణలో తెలుగుదేశానికి భవిష్యత్తులేదని చెప్పడానికి గ్రేటర్ ఫలితాలు తాజా ఉదాహరణగా నిలిచాయి.

జీహెచ్ఎంసీ ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడా కనిపించలేదు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో గెలుచుకున్న ఒక్కస్థానాన్ని కూడా ఈసారి చేజార్చుకుంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన మెజార్టీ డివిజన్లలో తెలుగుదేశం పార్టీ రెండో స్థానంలో నిలిచి ఉనికిని చాటుకుంది. సీట్లు గెలుచుకోలేకపోయినా ఓటర్ల బలం ఉందనిపించుకుంది. కానీ గడిచిన ఐదేళ్లలో టీడీపీ నాయకత్వాన్ని ఆకర్షించడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయ్యింది. టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకును కూడా తనవైపు మలుపుకోగలిగింది. ప్రధానంగా సెటిలర్లు అధికంగా ఉండే స్థానాల్లో కూడా ఓటర్ల మనసు గెలుచుకోగలిగింది టీఆర్ఎస్ పార్టీ.

గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుకోసం టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల అగ్రనేతలు స్వయంగా ప్రచారాన్ని ముందుండి నడిపించారు. ప్రత్యర్థుల వైఫల్యాలను ఎత్తిచూపుతూ సుడిగాలి పర్యటనలు చేశారు. కానీ... వందకు పైగా స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ తరుపున మాత్రం ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రచారం చేయలేక పోయింది. ఓటమిని ముందే ఊహించి చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రచారంలో పాల్గొనలేదనే వాదన బలంగా వినిపిస్తోంది. హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని గ్రేటర్ నేలపై నిలబడి మాట్లాడడానికి వెనకాడారు.

జాతీయ పార్టీగా చెప్పుకునే టీడీపీ పరిస్థితి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ నామమాత్రంగా మారింది. టీడీపీకి బలమైన ఓటుబ్యాంకుగా చెప్పుకునే ఒక సామాజికవర్గం నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో వ్యతిరేక వ్యక్తమవుతోంది. ప్రజలకు దూరంగా ఉంటూ పదవులు దక్కించుకోవాలనే ఆరాటాన్ని ప్రదర్శించడమే ఆ పార్టీ పతనానికి కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 16శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకున్న టీడీపీ ఈసారి సింగిల్ డిజిట్ కి పడిపోయింది. మొత్తానికి తెలుగుజాతి ఆత్మగౌరవంటూ మొదలైన టీడీపీ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp