నేటి నుంచే అసెంబ్లీ : రాజ‌కీయ దుమారం ఖాయం!

By Kalyan.S Sep. 24, 2021, 07:30 am IST
నేటి నుంచే అసెంబ్లీ : రాజ‌కీయ దుమారం ఖాయం!

ఇప్పటి వరకు వీధి పోరాటాలు.. ఒకరిపై ఒకరు ట్విట్టర్ యుద్ధాలు.. వ్యాఖ్యల మంటలు రాజేసుకున్న తెలంగాణ అధికార‌, ప్ర‌తిప‌క్ష నాయకులకు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ.. మరో ప్రధాన పోరాట వేదిక కానుందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈసారి కాంగ్రెస్ స‌భ్యులు గ‌ట్టిగా గొంతెత్తేలా పార్టీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల‌కు దిశా నిర్దేశం చేశారు. ప్ర‌తిప‌క్షం మున‌ప‌టిలా నెమ్మ‌దిగా ఉండ‌డం లేదు కాబ‌ట్టి.. ఈ అసెంబ్లీ స‌మావేశాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఏర్ప‌డింది. వాడివేడిగానే స‌భా స‌మ‌రం కొన‌సాగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

స‌మ‌రానికి సిద్ధం

ఇప్పుడు అసెంబ్లీ వేదిక.. రాజకీయ దుమారం సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఇటీవలే రేవంత్ చేసిన డ్రగ్స్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేయడం..దీనిపై స్థానిక కోర్టు రూ.కోటి జరిమానా విధించడం.. వంటివాటిని కాంగ్రెస్ ఆయుధంగా చేసుకునే అవకాశం ఉంది. అదేసమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దళిత బంధను తీసుకువచ్చారని.. తరచుగా విమర్శిస్తున్న బీజేపీ దీనిని హైలట్ చేయనుంది. అదేసమయంలో కాంగ్రెస్ బీజేపీలు సంయుక్తంగా లేవనెత్తే మరికొన్ని అంశాలు కూడా అధికార పార్టీకి ఇబ్బంది పెట్టనున్నాయని అంటున్నారు. ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను ప్రధానంగా ప్రస్తావించే అవకాశంఉంది. అయితే.. దీనికి దీటుగా అధికార పార్టీ కూడా రంగం సిద్ధం చేసుకుంటోంది. సో.. ఎలా చూసినా.. ఈ సభ.. సమరాంగణాన్ని తలపించడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.

ద‌ళిత బంధుపై చ‌ర్చ ర‌చ్చ‌కు దారి తీయ‌నుందా?
గత అసెంబ్లీ సమావేశాలు మార్చి 15న ప్రారంభమై, 26వ తేదీతో ముగిశాయి. అప్పటి నుంచి ఆరు నెలల్లోగా సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అందుకే ఇటీవ‌ల సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి... 24 నుంచి శాసన సభా సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనేది ఆ రోజున జరిగే శాసన సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణ‌యించ‌నున్నారు. దళిత బంధు పథకానికి కొత్త చట్టాన్ని తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందనుంది. బిల్లును ప్ర‌వేశ పెట్టే క్ర‌మంలో జ‌రిగే చ‌ర్చ‌, ర‌చ్చ రసవత్తరంగా ఉంటుందని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

వాటిపై వాడి - వేడి..

ద‌ళిత బంధు తెలంగాణ వ్యాప్తంగా అంద‌రికీ అమ‌లు చేయాల‌ని ఇప్ప‌టికే కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ద‌ళితుల‌తో పాటు గిరిజ‌నుల‌కూ ఇవ్వాల‌నేది ఆ పార్టీ స్టాండ్‌. అయితే, ప్ర‌స్తుతానికి హుజురాబాద్‌తో పాటు మ‌రో నాలుగు మండ‌లాల‌కు మాత్ర‌మే ద‌ళిత బంధు అమ‌లు చేయ‌నుంది కేసీఆర్ స‌ర్కారు. తెలంగాణ‌లోని ద‌ళిత కుటుంబాల‌న్నిటికీ 10 ల‌క్ష‌ల చొప్పున ఇవ్వాలంటే ల‌క్షా 70 వేల కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. మ‌రి, ఆ సొమ్ము ఎక్క‌డి నుంచి తీసుకొస్తార‌ని కాంగ్రెస్ నిల‌దీస్తోంది. వ‌చ్చే నాలుగేళ్ల‌లో ద‌ళితులంద‌రికీ ద‌ళిత బంధు ఇస్తామ‌నేది స‌ర్కారు మాట‌. అంద‌రికీ ఒకేసారి ఇవ్వాల‌నేది కాంగ్రెస్ వాద‌న‌. అసెంబ్లీ వేదిక‌గా ఈ వాడి-వేడి మ‌రింత పెరిగే అవ‌కాశం ఉందంటున్నారు. దీంతో పాటు.. బంధు పథకం మాదిరిగానే గిరిజన బంధు, బీసీ, మైనారిటీ బంధు వంటి పథకాలను ప్రవేశపెట్టాలంటూ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్న తరుణంలో దీనిపై అసెంబ్లీలో గట్టిగానే వాదించే అవకాశముంది.

ఉన్న‌ది ఇద్ద‌రే అయినా..

మ‌రోవైపు.. రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర చేప‌డుతున్నారు. పాద‌యాత్ర ద్వారా త‌మ నాయ‌కుడు దృష్టికి వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప‌ట్ట‌బ‌ట్ట‌నున్నారు. ఇద్ద‌రు ఎమ్మెల్యేలే అయినా.. బీజేపీ సైతం స‌భ‌లో గ‌ట్టిగా త‌మ వాయిస్ వినిపించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. కేంద్ర నిధుల‌తోనే రాష్ట్ర ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నార‌ని ఆ పార్టీ మొద‌టినుంచీ ఆరోపిస్తోంది. ఇక ఇటీవ‌ల కేంద్రం తెలంగాణ‌కు అన్యాయం చేస్తోంద‌ని.. కాద‌ని నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ మంత్రి కేటీఆర్ చేసిన స‌వాల్‌ను కాషాయం పార్టీ త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక‌, ఎప్ప‌టిలానే ఎంఐఎం సైతం పాత‌బ‌స్తీ స‌మ‌స్య‌ల‌పై గ‌ట్టిగానే నిల‌దీసే అవ‌కాశం లేక‌పోలేదు.

మొత్త‌మ్మీద ఆర్నెళ్ల త‌ర్వాత వ‌స్తున్న‌ అసెంబ్లీ స‌మావేశాల్లో అధికార‌ప‌క్షాన్ని నిల‌దీసి, ఇర‌కాటంలో పెట్టేలా.. విప‌క్షం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ప్ర‌తిప‌క్షాల‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఎప్ప‌టిలానే అధికార పార్టీ ఎదురుదాడినే న‌మ్ముకోనుంది. ఆ పార్టీ ప‌క్షాన అధినాయ‌కుడు కేసీఆర్ ఎలాగూ ఉంటారు. ఈ మేర‌కు 24 నుంచి జ‌ర‌గ‌బోయే తెలంగాణ శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లి స‌మావేశాల‌కు అస్త్ర‌శ‌స్త్రాలు రెడీ చేస్తున్నాయి రాజ‌కీయ పార్టీలు. ఈ క్ర‌మంలో స‌భా స‌మ‌రం ఎలా ఉండ‌నుందో వేచి చూడాల్సిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp