తెలంగాణాలో నేడే పురపోరు

By Kotireddy Palukuri Jan. 22, 2020, 06:49 am IST
తెలంగాణాలో నేడే పురపోరు

తెలంగాణ రాష్ట్రంలో పురపోరు మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది. 120 మున్సిపాలిటీలు, 9 మున్సిపల్‌ కార్పొరేషన్లకు నేడు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. 2,647 వార్డులకు 11,099 అభ్యర్థులు, 324 డివిజన్లకు 1,744 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల పరిధిలో 40,40,582 మంది, కార్పొరేషన్ల పరిధిలో 13,15,360 మంది ఓటర్లున్నారు.

25న ఫలితాలు..

7,961 పోలింగ్‌ కేంద్రాల్లో తెలుపు రంగు బ్యాలెట్‌ పత్రాలతో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. 15 వేల మంది పోలీసు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. శుక్రవారం కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 58 వార్డులకు (ఏకగ్రీవాలు మినహాయించి) ఎన్నికలు జరుగుతాయి. కరీంనగర్‌ ఫలితాలను 27న ప్రకటిస్తారు.

బరిలో భారీగా స్వతంత్రులు..

బుధవారం ఎన్నికలు జరగనున్న 120 మున్సిపాలిటీల పరిధిలో 80 వార్డులు, 9 కార్పొరేషన్ల పరిధిలో ఒక డివిజన్‌ ఏకగ్రీవమైంది. మొత్తం వార్డులు, డివిజన్లకు కలిపి 12,898 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అన్ని వార్డులు, డివిజన్లలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అత్యధికంగా 3,750 మంది స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్‌ నుంచి 2,616, బీజేపీ నుంచి 2,313, టీడీపీ నుంచి 347, ఎంఐఎం నుంచి 276, సీపీఐ నుంచి 177, సీపీఎం నుంచి 166, మంది పోటీ చేస్తున్నారు. ఎస్‌ఈసీ దగ్గర గుర్తింపు పొంది, గుర్తులు ఖరారు కాని రికగ్నైజ్డ్‌ పార్టీల నుంచి 281 మంది పోటీలోఉన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp