పది లక్షల ఉద్యోగాలా..? అది ఒట్టి బూటకమే..

By Srinivas Racharla Oct. 30, 2020, 09:30 pm IST
పది లక్షల ఉద్యోగాలా..? అది ఒట్టి బూటకమే..

బీహార్ శాసనసభ రెండవ దశ ఎన్నికల ప్రచారం నేతల ఘాటైన వ్యాఖ్యలతో కాక పుట్టిస్తోంది. పాలక ఎన్డీయే కూటమి గెలుపు బాధ్యత తన భుజాలపై వేసుకున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రచారంలో ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై విరుచుకుపడుతున్నారు.

బీహార్ తొలిదశ ఎన్నికలలో అధికార ఎన్డీయే కొంత వెనకబడిందనే అంచనాల మధ్య సీఎం నితీశ్ కుమార్ ఆర్జేడీ ప్రధాన ఆకర్షణీయమైన ఎన్నికల హామీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించాడు. శుక్రవారం పర్బట్టలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో నితీశ్ మాట్లాడుతూ గత 15 ఏళ్ల తన పాలనలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామని ప్రకటించారు. దీనితోపాటు పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించినట్లు ఆయన తెలిపారు. కాగా ఆర్జేడీ 15 ఏళ్ల పాలనలో కేవలం 95 వేల కొలువులు మాత్రమే భర్తీ చేసిందని దుయ్యబట్టారు. ఆర్జేడీ నేత తేజస్వీ ఎన్నికల హామీ 10 లక్షల ఉద్యోగాల కల్పన బూటకమని సీఎం నితీశ్ ఆరోపించారు.

ప్రతిపక్ష మహాఘట్ బంధన్‌ మేనిఫెస్టోలో పేరుకొన్న హామీలు నీటిపై రాత లాంటివన్నీ జేడీయూ అధినేత నితీశ్ కొట్టిపారేశారు. తాము ఆచరణ సాధ్యమైన హామీలనే ఇస్తున్నామని ఆయన ప్రకటించారు. ఓటర్లను గందరగోళంలో పడేసి వారిని తప్పుదోవ పట్టించడానికి ఇటువంటి హామీలను మహా కూటమి నేతలు ఇస్తున్నారని సీఎం నితీశ్ కుమార్ విమర్శించారు.ఇక వీధి దీపాలను సౌర విద్యుత్‌‌తో వెలిగించి గ్రామాలను విద్యుత్ కాంతులతో నిలుపుతామని ఆయన హామీ ఇచ్చారు.

కాగా కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన బీహార్ వలస కార్మికులు ఆర్జేడీ ఉద్యోగావకాశాలు కల్పిస్తామనే హామీని బలంగా విశ్వసిస్తున్నట్లే కనిపిస్తోంది.అలాగే గత 15 ఏళ్లుగా పరిపాలనలో ఉన్న నితీష్ కుమార్ చేసిన అభివృద్ధిపై ఓటర్లు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లు కుల రాజకీయాలను పక్కనపెట్టి ఉద్యోగ,ఉపాధి అవకాశాలలో రాష్ట్ర వెనకబాటును ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆర్జేడీ ఉద్యోగాల కల్పన హామీ తమ విజయావకాశాలను దెబ్బ తీస్తుందని బీజేపీ పసిగట్టింది.నితీశ్ మిత్రపక్షమైన బీజేపీ మరో అడుగు ముందుకేసి ఆర్జేడీ కంటే రెట్టింపుగా 19 లక్షల ఉద్యోగ కల్పిస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది.

ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ ఆర్జేడీ 10 లక్షల ఉద్యోగాల హామీ ఆచరణ సాధ్యం కాదంటే తమ మిత్రపక్షం బీజేపీ ఇచ్చిన 19 లక్షల ఉద్యోగాల సంగతి ఏమిటనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సీఎం నితీశ్ వ్యాఖ్యలు అధికార ఎన్డీయే విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ఉండడంతో కూటమి విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp