హలో గూగుల్‌ ‘వాట్‌ హేపెండ్‌ టు యూ..’

By Jaswanth.T Dec. 15, 2020, 12:30 pm IST
హలో గూగుల్‌ ‘వాట్‌ హేపెండ్‌ టు యూ..’
మనకేదైనా డౌటొస్తే గూగుల్‌ తల్లిని అగుతుంటాం.. కానీ కొన్ని గంటల పాటు గూగుల్‌ తల్లికేమైందంటూ నెటిజన్లు గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లోనే సెర్చ్‌ చేయాల్సి వచ్చింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి గూగుల్‌ కీలక సర్వీస్‌లు అయిన జీ మెయిల్, యూ ట్యూబ్, గూగుల్‌ మ్యాప్స్, ప్లేస్టోర్, గూగుల్‌ డ్రైవ్‌ .. తదితర సేవల వినియోగానికి అంతరాయం ఏర్పడింది. సెర్చి ఇంజిన్‌ ఓపెన్‌ అయ్యి, అనుబంధ సర్వీస్‌లలోకి ఎంటర్‌ అయ్యేందుకు మాత్రం కనెక్ట్‌ అయ్యేది కాదు.

సాధారణంగా వెబ్‌పై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడ్డప్పుడు వచ్చే సాంకేతిక పరమైన కారణాలతో ఆయా దేశాల్లోని సర్వర్లు డౌన్‌ అవుతుంటాయి. దీంతో సదరు సర్వర్‌పై ఆధారపడిన ప్రదేశాల్లోనే సేవల్లో అంతరాయం కలుగుతుంటుంది. అందుకు విరుద్దంగా ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల గూగుల్‌ సర్వీసెస్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వార్తలు గుప్పుమన్నాయి. మెయిల్‌ సర్వీస్‌పై ఆధారపడ్డ వాళ్ళు తీవ్రంగానే ఇబ్బందులు పడ్డారు. ఆ తరువాత నెమ్మదిగా సదరు సర్వీస్‌లు అందడం మొదలయ్యాయి.

స్క్రీన్‌పై వస్తున్న సాంకేతిక గుర్తులను బట్టి సర్వర్‌ డౌన్‌ అయినట్లుగా సంబంధిత రంగంలోని నిపుణులు తేల్చారు. అయితే ఇలా ఎందుకు అయ్యిందన్నదానిని గురించి గూగుల్‌ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అసలు ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమైందన్నదానిపై సదరు సంస్థే ప్రకటించాల్సి ఉంది.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp