చిత్తశుద్ధి లేని దీక్షలేల చంద్రబాబు ....

By Sanjeev Reddy Jan. 21, 2021, 01:00 pm IST
చిత్తశుద్ధి లేని దీక్షలేల చంద్రబాబు ....

ఈ నెల 21 నుండి అంటే నేటి నుండి తిరుపతిలో పది రోజుల పాటు పలు గ్రామాల్లో ధర్మ పరిరక్షణ యాత్ర చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు .
ఇప్పటికిప్పుడు ధర్మ పరిరక్షణ యాత్ర చేయటానికి అది కూడా ప్రత్యేకంగా తిరుపతిని ఎంచుకోవటానికి గల కారణాలు టీడీపీ అధినేత చెప్పకపోయినా ప్రజలకి తెలియకపోలేదు. ఇన్నాళ్లు కుల , ప్రాంత సమీకరణాలతో రాజకీయం నడుపుకొంటూ వచ్చిన చంద్రబాబు కొత్తగా బీజేపీతో పోటీ పడాల్సిన పరిస్థితిలో మత రాజకీయాలకు తెరలేపారు . ఆ పర్యావసనమే ఇటీవల బాబు హిందూత్వ వాదాన్ని భుజానికెత్తుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై క్రైస్తవ ముద్ర వేసే ప్రయత్నం చేయడం . ఆలయాల పై దాడులు , ధ్వంసం అంటూ అసంబద్ధ ఆరోపణలకు పాల్పడటం జరిగింది .

వైసీపీ అధికారం చేపట్టాక ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మేనిఫెస్టోని అనుసరించి ప్రతి ఒక్క హామీని తూచా తప్పకుండా అమలు చేస్తుండటం , ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రాజెక్టుల టెండర్లలో పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు రివర్స్ టెండరింగ్ ద్వారా వ్యయం తగ్గిస్తూ ప్రభుత్వ ధనాన్ని ఆదా చేస్తూ అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించడంతో ఏ విధమైన ఆరోపణలకు ఆస్కారం లేక గడిచిన ఏడాది కాలంగా కేవలం అమరావతి విషయంలో ఆరోపణలు చేస్తూ జూమ్ మీటింగ్ లతో కాలం గడిపిన బాబుకి ఆలయాల పై దాడుల ఆరోపణల అంశం వివాదాస్పదం కలిసొచ్చింది .

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా సోము వీర్రాజు నియమితులయ్యాక హిందూ ఆలయాల వద్ద జరిగిన కొన్ని చిన్న చిన్న దుర్ఘటనల నుండి వీర్రాజు రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేయడం గమనించిన చంద్రబాబు వెంటనే ఆ అవకాశాన్ని తానూ అందిపుచ్చుకొనే ప్రయత్నం చేశారు . ఇదే అంశం పై బాబుతో పాటు ఇతర టీడీపీ శ్రేణులు కూడా వైసీపీ ప్రభుత్వం పై ఉద్దేశ్య పూర్వకంగా ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో మత విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేశారు . ఆ తర్వాత కొంత కాలం కొన్ని ఆలయాలలో , విగ్రహాల పై వరుస దాడులు జరగడం టీడీపీ శ్రేణులు ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేయడం నిత్యకృత్యం అయ్యింది . ఈ ఘటనలను సీరియస్ గా తీసుకొన్న ప్రభుత్వం అంతర్వేది రథం దగ్ధం కేసును సిబిఐకి అప్పచెప్పడమే కాకుండా మిగతా ఆలయాల్లో దాడుల , దుష్ప్రచారాల పై విచారణకు ఏపీ పోలీసుల్ని రంగంలోకి దించింది . పోలీస్ విచారణలో కొన్ని ఘటనలు టీడీపీ కార్యకర్తలు ఉద్దేశ్య పూర్వకంగా చేసినట్లు సీసీ టివి ఫుటేజ్ దొరకడం , కొందరు టీడీపీ సోషల్ మీడియా శ్రేణులు కావాలని అసత్య ప్రచారం చేసినట్లు ఆధారాలు దొరకడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది .

నేరాల వెనక టీడీపీ శ్రేణులు ఉన్న విషయం బయట పడ్డాక ఈ విషయం పై వివరణ ఇవ్వని బాబు , విచారణ జరిపి అరెస్ట్లు చేసిన పోలీసుల పై , డిజిపి పై విమర్శలకు దిగారు . ఏకంగా ముఖ్యమంత్రి , హోమ్ మంత్రి , డిజిపిలకు కులాల్ని ఆపాదిస్తూ వీరు ముగ్గురూ క్రిస్టియన్స్ కనుక వీరి ఆధ్వర్యంలో విచారణ జరిగితే న్యాయం జరగదంటూ మరింత మత విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేశారు .

ఈ క్రమంలో బీజేపీని మించిన హిందూ వాదిగా తనని తాను ప్రెజెంట్ చేసుకొనే ప్రయత్నం చేశారు కానీ బాబు గతం తెలిసిన ఏపీ ప్రజలు ఆయన వలలో పడలేదనే చెప్పాలి . గతంలో తిరుమలలో ఏడు కొండల్ని రెండు కొండలకు పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వైఎస్ పై ఆరోపణలు చేసిన బాబు ఇదే అంశం పై అసెంబ్లీ చర్చలో ఆరోపణలకు ఆధారం చూపలేక మౌనం వహించి విశ్వసనీయత కోల్పోయిన విషయం ఆయన మాటలు నమ్మి ఆందోళన వ్యక్తం చేసి తరువాత నిజానిజాలు తెలుసుకొన్న హిందూ వర్గాలు ఇంకా మర్చిపోలేదు .

అంతేకాక 2014 ఎన్నికలలో టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో జాతీయ చట్టానికి విరుద్ధంగా దళిత క్రైస్తవులని ఎస్సీ లుగా గుర్తింపు పొందేట్లు చేస్తానని హామీ ఇచ్చి వారి ఓట్లకి గాలం వేసిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ అంశాన్ని పట్టించుకోకపోగా మళ్లీ 2019 ఎన్నికల్లో సైతం అదే హామీని పొందుపరిచి మరోసారి వంచించే ప్రయత్నం చేశారు .

అలా రెండు సార్లు జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా హామీ ఇచ్చి వంచించిన బాబు నేడు హిందూ ఆలయాల పై దాడులకు క్రైస్తవులే కారణం అన్నట్లుగా ఆ మతానికి చెందిన వారు రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉంటే న్యాయం జరగదని ఆరోపించడంతో లౌకికవాద స్ఫూర్తిని దెబ్బతీయడంతో పాటు క్రైస్తవ వర్గాల నమ్మకం పూర్తిగా కోల్పోయారు .

ఇలా తన రెండు కళ్లనీ తానే పొడుచుకుని అన్ని వర్గాల్లో విశ్వసనీయత పోగొట్టుకున్న చంద్రబాబు ఈ రోజు తిరుపతిలో ధర్మ పరిరక్షణ పేరిట యాత్రలు , దీక్షలు తలపెట్టటం తిరుపతిలో రానున్న ఉప ఎన్నికల్లో కనీసం రెండో స్థానంలో నిలిచి బిజెపి కన్నా మేమే మెరుగ్గా ఉన్నాము అని చెప్పుకొని ఉనికి కాపాడుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదు .

అయితే బాబు గతంలో తిరుమల క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారాల వేదికగా మార్చుకున్న వైనాన్ని , ఆలయ పోటు మూసివేసి మరీ పలు అనుమానాలకు తావిస్తూ పోటులో తవ్వకాలు జరిపిన ఘటనలు కానీ , ఢిల్లీలో తాను ప్రచారార్భాటాలతో చేసిన ధర్మ పోరాట దీక్షలో వసతి ,విందూ విలాసాల కోసం టీటీడీ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా స్వామి వారి నిధులు పక్కదారి పట్టించి వాడుకొన్న వైనాన్ని మరిచిపోని తిరుమల వాస్తవ్యులు చంద్రబాబుని ఆదరిస్తారా అంటే లేదనే చెప్పాలి .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp