సోమిరెడ్డికి అలుపేరాదా..?

By Karthik P Jun. 08, 2021, 06:00 pm IST
సోమిరెడ్డికి అలుపేరాదా..?

ప్రజా క్షేత్రంలో ఒకసారి ఓడిపోతే కృంగిపోతాం.. మమూలు మనిషి కావడానికి చాలా సమయం పడుతుంది. రెండోసారి కూడా ఓడిపోతే భవిష్యత్‌పై ఆశలు వదిలేసుకుంటాం. ముచ్చటగా మూడోసారి కూడా ఓడిపోతే.. ఇక అంతే సంగతులు. కానీ ఆ రాజకీయ నేత వరుసగా ఐదుసార్లు ఓడిపోయారు. రెండు దశాబ్ధాలుగా గెలుపు రుచి చూడకపోయినా.. మొక్కోవని దీక్షతో, గెలుపుపై ఆశతో పోటీ చేస్తూనే ఉన్నారు. ఓడిపోయే కొద్దీ.. ఆయనలో హుషారు పెరుగుతోంది. తనతోపాటు ఓడిపోయిన వాళ్లు.. మళ్లీ ఐదేళ్ల తర్వాత కనిపిస్తున్నా.. సదరు నేత మాత్రం నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఆయనే టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి.

సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి 1994లో తొలిసారి ఎమ్మెల్యే అయిన సోమిరెడ్డి, తదుపరి 1999 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 2004లో సోమిరెడ్డి హవాకు ఆదాల ప్రభాకర రెడ్డి బ్రేక్‌ వేశారు. 1999 తర్వాత ఇప్పటి వరకు సోమిరెడ్డి గెలుపు మొహం చూడలేదు. రెండు దశాబ్ధాలుగా ఓడిపోతూనే ఉన్నా.. సోమిరెడ్డి పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా పోరాడుతూనే ఉన్నారు.

2004 ముందు వరకు టీడీపీలో ఉన్న ఆదాల ప్రభాకర్‌ రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరి సర్వేపల్లి నుంచి పోటీలోకి దిగారు. 2009లోనూ సోమిరెడ్డిని ఆదాల వరుసగా రెండోసారి ఓడించారు. రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ పరిస్థితులలో ఆదాల ప్రభాకర్‌ రెడ్డి మళ్లీ టీడీపీలో చేరి 2014లో నెల్లూరు లోక్‌సభ నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు. 2019లో ఆదాలను టీడీపీ తమ అభ్యర్థిగా ప్రకటించినా.. అనూహ్యంగా ఆదాల వైసీపీ కండువా కప్పుకున్నారు. నెల్లూరు ఎంపీగా గెలుపొందారు.

2009 తర్వాత ఆదాల అడ్డుతొలగడంతో... ఈ సారి గెలుపు ఖాయమనే భావనలో ఉన్నారు సోమిరెడ్డి. ఈ ఉత్సాహంతోనే ఆయన 2014లో మరోసారి సర్వేపల్లి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్థన్‌ రెడ్డి రూపంలో ఆదాల ప్రభాకర్‌ రెడ్డిని మించిన ప్రత్యర్థి సోమిరెడ్డికి ఎదురయ్యారు. ఈ సారి కూడా సోమిరెడ్డికి ఓటమి తప్పలేదు. అంతకు ముందు 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కొవూరు నుంచి బరిలోకి దిగారు సోమిరెడ్డి. జనరల్‌ ఎన్నికల్లో కాకపోయినా.. ఉప ఎన్నికల్లోనైనా గెలుపు తలుపుతడుతుందని భావించారు. అయితే జగన్‌ హవా ముందు సోమిరెడ్డి.. వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. నియోజకవర్గం, అభ్యర్థి మారినా.. సోమిరెడ్డి తలరాత మాత్రం మారలేదు.

Also : తోట వర్సెస్‌ వేగుళ్ల – రసవత్తరంగా మండపేట రాజకీయం

2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. కానీ సోమిరెడ్డి ఓడిపోయారు. గెలిస్తే మంత్రి అయ్యేవారు. ఆ ఛాన్స్‌ ప్రారంభంలో రాకపోయినా.. రెండేళ్ల తర్వాత చంద్రబాబు కేబినెట్‌లో బెర్త్‌ దక్కింది. తనకు నమ్మకస్తుడుగా, పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సోమిరెడ్డికి చంద్రబాబు సముచిత స్థానం కల్పించారు. ఎమ్మెల్సీని చేసి తన కేబినెట్‌లో వ్యవశాయ శాఖను కేటాయించారు. దాదాపు మూడేళ్లపాటు మంత్రిగా సోమిరెడ్డి పని చేశారు. మంత్రిగా పని చేసినా.. 2019లోనూ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆశ్సీసులు మాత్రం పొందలేకపోయారు. ఈ సారి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్థన్‌రెడ్డి చేతిలో వరుసగా రెండోసారి ఓటమిచవి చూశారు.

వరుసగా రెండు దశాబ్ధాల పాటు ఐదు ఎన్నికల్లో (ఇందులో ఒకటి ఉప ఎన్నిక) పోటీ చేసినా గెలుపు దక్కకపోవడం, మంత్రిగా పని చేసిన తర్వాత కూడా ఓటమి పాలవడం సోమిరెడ్డికి ఏ మాత్రం రుచించలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత తన రాజకీయ ప్రత్యర్థి కాకాణిపై నిత్యం విమర్శలు, ఆరోపణలు చేస్తూ హల్‌చల్‌ చేస్తున్నారు. అవినీతి, అక్రమాల వ్యవహారంలో ఇరువురు నేతలు పోటాపాటీ సవాళ్లు చేసుకున్నారు. తాజాగా ఆనందయ్య మందు విక్రయం అంశాన్ని ఆధారంగా చేసుకుని కాకాణిపై సోమిరెడ్డి అవినీతి ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో సోమిరెడ్డిపై పోలీసు కేసు కూడా నమోదైంది.

టీడీపీ ప్రభుత్వంలో అనేక మంది మంత్రులుగా పని చేశారు. ఇందులో పలువురు గత ఎన్నికల్లో గెలిచారు. మరికొందరు ఓడిపోయారు. ఒకరిద్దరు తప్పా.. దాదాపు వారందరూ రాజకీయంగా స్తబ్ధుగా ఉన్నారు. అందరికీ భిన్నంగా సోమిరెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. దూకుడుగా వెళుతున్నారు. అటు వైసీపీ ప్రభుత్వంపై, ఇటు తన రాజకీయ ప్రత్యర్థిపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. సోమిరెడ్డికి అలుపేరాదా..? అని టీడీపీ శ్రేణులే అనుకునేలా ఈ మాజీ మంత్రి రాజకీయాలు చేస్తుండడం విశేషం. మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందాలనే సోమిరెడ్డి ఆశలు 2024లోనైనా నెరవేరుతాయా..? ముచ్చటగా మూడోసారి కూడా కాకాణి చేతిలో మట్టికరుస్తారా..? వరుస ఓటములకు బ్రేక్‌ వేస్తారా..? వేచి చూడాలి.

Also Read : బుచ్చయ్యే కాదు.. వారసుడూ కనిపించడం లేదు..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp