టీడీపీకి సీనియర్ల వరుస షాకులు

By Ramana.Damara Singh Sep. 25, 2021, 09:00 pm IST
టీడీపీకి సీనియర్ల వరుస షాకులు

నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన.. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిందన్న పేరున్న తెలుగుదేశం పార్టీ ఇటీవలి వరుస పరిణామాలతో ముఖం మాడ్చుకోవాల్సి వస్తోంది. ఎన్నికల్లో వరుసగా ఎదురవుతున్న దారుణ పరాభవాలు ఒక ఎత్తు అయితే.. కొద్దికాలంగా సీనియర్ నేతలు పార్టీ నుంచి జారుకుంటుండటం మరో ఎత్తు. ఈ పరిణామాలు ప్రధాన ప్రతిపక్షాన్ని కోలుకోనివ్వకుండా చేస్తున్నాయి. పార్టీ ప్రస్తుత దుస్థితికి అధినేత చంద్రబాబు పుత్ర వాత్సల్యం.. ప్రధాన కార్యదర్శిగా ఆయన పుత్రుడు లోకేష్ కోటరీ రాజకీయాల కారణమని పార్టీని వీడుతున్న సీనియర్ నేతలే ఆరోపిస్తున్నారు.

అసంతృప్తి ఎందుకంటే..

2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చేతిలో దారుణ పరాభవాన్ని చవిచూసిన టీడీపీ నుంచి వలసలు అప్పుడే మొదలయ్యాయి. రెండున్నరేళ్లుగా అవి కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నాళ్లుగా మళ్లీ ఊపందుకున్నాయి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా డ్రామాను కొన్నాళ్లు కొనసాగించి చివరికి ఆయనతో సర్దుబాటు చేసుకున్నా తాజాగా ఎంపీ కేశినేని నానీ, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే మురగడ హనుమంత రావు ఉదంతాలు పార్టీలో సీనియర్లకు పొమ్మనకుండా పొగ పెడుతున్న తీరును తలపిస్తున్నాయి. మంగళగిరిలో లోకేష్ ను పోటీకి దింపేందుకు చంద్రబాబు తనను పక్కన పెట్టారని టీడీపీకి రాజీనామా చేసిన సందర్బంగా మాజీమంత్రి హనుమంత రావు నేరుగానే ఆరోపించారు.

Also Read : బాబూ మేము పార్టీలో ఉండాలా బయటకు పోవాలా?కొత్త జడ్పీటీసీల ప్రశ్న .. !

విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా పార్టీ అధినేతపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో తనకు వ్యతిరేకంగా మాట్లాడిన బుద్దా వెంకన్న, బోండా ఉమాలపై చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆయనకు మింగుడు పడలేదు. అప్పటి నుంచి చంద్రబాబుతో ఆంటీ ముట్టనట్లు ఉంటున్న కేశినేని అదే ఆగ్రహంతో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పేశారు. తన కుమార్తె శ్వేత కూడా టాటా ట్రస్ట్ లో ఉద్యోగానికి వెళ్లిపోయిందని చెబుతూ ఆమె కూడా పోటీ చేయదన్నట్లే చెప్పుకొచ్చారు. పార్టీలో మాత్రం కొనసాగుతానని చెప్పడం కంటి తుడుపేన ని.. పార్టీకి ఆయన పూర్తిగా దూరం అయినట్లేనని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన జె.సి.దివాకర్ రెడ్డి ఇటీవల హైదరాబాద్లో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో పాల్గొనబోనని చెప్పారు.

Also Read : టీటీడీ మీద 'జియో' అభాండాలు.. ఇంకెన్నిసార్లు?

తండ్రీకొడుకుల తీరే కారణం

రాజకీయ పార్టీలన్న తర్వాత గెలుపు ఓటములు సహజం. కానీ 2019 ఎన్నికల నాటి నుంచీ టీడీపీకి ఎదురవుతున్న ఓటములు చిన్నవి కావు. నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమై చిత్తుగా ఓడిన టీడీపీ రెండేళ్లపాటు సౌండ్ లేకుండా కుంగిపోయింది. కరోనా సాకుతో అధినేత చంద్రబాబే ఏడాదికిపైగా హైదరాబాద్ లో ఉండి పోయారు. రాష్ట్ర ప్రజల గురించి, పార్టీ గురించి పట్టించుకోలేదు. దాంతో నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. చాలామంది వేరే దారులు చూసుకున్నారు.

మరోవైపు పార్టీ బాధ్యతలను పూర్తిగా తన పుత్రుడు లోకేష్ కు కట్టబెట్టే క్రమంలో ప్రతి చిన్న అంశానికి అతన్నే పంపుతూ ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేతలను విస్మరిస్తున్నారు. లోకేష్ కూడా సీనియర్లను ఔట్ డేటెడ్ నేతలుగా ముద్ర వేసి అవమానాలకు గురిచేస్తున్నారు. దీనికి తోడు ఈ ఏడాది జరిగిన పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజల్లో ఏకమొత్తంగా వైఎస్సార్సీపీ కే మద్దతు ప్రకటించారు. ఓట్ల పరంగా, సీట్ల పరంగా టీడీపీని అసెంబ్లీ ఎన్నికల కంటే మరింత అథమ స్థానానికి నెట్టేశారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం వృధా అని భావిస్తున్న సీనియర్లు వరుసగా బయటపడుతున్నారు.

Also Read : రాజకీయాలకు కేశినేని గుడ్ బై .. వారసురాలి రంగ ప్రవేశం?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp