రాష్ట్ర అధ్యక్షుడికి ఇలాకాలో వలసల కలవరం..

By Jaswanth.T Dec. 05, 2020, 11:20 am IST
రాష్ట్ర అధ్యక్షుడికి ఇలాకాలో వలసల కలవరం..

పార్టీ భవిష్యత్తుపైనా, తాము నమ్ముకున్న నాయకుడిపైనా ఏ మాత్రం అపనమ్మకం ఏర్పడినా కేడర్‌ తమకు సేఫ్‌గా ఉండే పార్టీ వైపు చూడడం ప్రస్తుత రాజకీయాల్లో అత్యంత సహజం. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ కేడర్‌ ప్రత్యామ్నాయాల వైపు చూస్తోందన్నది ఇప్పటికే స్పష్టమైపోయింది. ఎవరికి అనుకూలంగా ఉండే చోటును వారు ఎంపిక చేసుకుని కేడర్‌ గోడ దూకే పనిలో నిమగ్నమైపోయారు.

దాదాపు 175 నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోందని చెబుతున్నారు. దీంతో ఆక్కడున్న ఆ పార్టీ నాయకులు వీరిని ఎలా ఆపాలో అర్ధం కాక దిక్కులు చూస్తున్నారంటున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడికి కూడా ఎదురవుతోందంటున్నారు. అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కిలి నియోజకవర్గంలో టీడీపీ కీలకంగా భావించే పలు గ్రామాల నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరికలు ఇటీవలి కాలంలో భారీగా పెరిగాయట. దీంతో అచ్చెన్నకు కలవరం తప్పడం లేదని చెబుతున్నారు.

ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పుడు వైఎస్సార్‌సీపీ గాలి వీస్తోంది. అదే పరిస్థితి టెక్కలిలో కూడా కన్పిస్తోందంటున్నారు విశ్లేషకులు. అంతే కాకుండా ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండే అచ్చెన్నాయుడు ఇప్పుడు అక్కడెవర్ని పట్టించుకోకపోవడంతో వారు ప్రత్యామ్నాయాలవైపు చూస్తున్నారని తేల్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ నుంచి బైటుకు వచ్చేందుకు సిద్ధపడిపోతున్నారంటున్నారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నుంచి, క్రింది స్థాయి నాయకుడి వరకు తమ వైఫల్యాలను ఏ మాత్రం ఒప్పుకోని నైజం కొనసాగిస్తుంటారు. అందులో భాగంగానే టీడీపీ నుంచి బైటకు వెళ్ళిపోతున్న కేడర్‌ను ఆయా పార్టీలు బెదిరించి తీసుకుపోతున్నాయంటూ ఆరోపణల పరంపరను వెలిబుచ్చుతున్నారంటున్నారు. అసలేమీలేని చోటు తమ అనుంగు మీడియాతో నానా హంగామా చేసే టీడీపీ బృందం, నిజంగా అక్కడి కార్యకర్తలు, నాయకులను ఒత్తిడిలకు లోను చేస్తే చూస్తూ ఊరుకుంటుందా? అన్న ప్రశ్నను అధికార పక్షం నాయకులు సంధిస్తున్నారు.

టీడీపీ, ఆ పార్టీ నాయకత్వంపై నమ్మకం లేకపోవడం కారణంగానే కేడర్‌ ఇతర పార్టీలవైపు మళ్ళుతోందని తేల్చి చెప్పేస్తున్నారు. అయితే ఇతర నియోజకవర్గాల మాటెలా ఉన్నా ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్న నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడడంతో టీడీపీ బృందం తలలు పట్టుకుంటోందట. ఈ పరిస్థితి నుంచి ఎలా బైటపడాలా? అన్న మంత్రాంగంలో తలమునకలైపోతున్నారని రాజకీయవర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp