TDP, Prathipati Pulla Rao - విమర్శకు ఓ హద్దుంటుంది పుల్లారావు..

By Aditya Dec. 08, 2021, 08:30 pm IST
TDP, Prathipati Pulla Rao  - విమర్శకు ఓ హద్దుంటుంది పుల్లారావు..

ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్‌లే మద్యం అమ్మే పరిస్థితి వచ్చిందంటూ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన తలాతోకా లేని ఆరోపణలు చేసి ప్రభుత్వంపై తన అక్కసును వెళ్లగక్కారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన ప్రత్తిపాటి రోజూ వార్తల్లో ఉండేవారు. ఎందుకో.. ఏమో.. టీడీపీ అధికారం కోల్పోయాక మీడియాతో దూరం పాటిస్తున్న ఆయన చాన్నాళ్ల తరువాత మళ్లీ బయటికొచ్చారు. ఎప్పటిలాగే పొంతన లేని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడటంలో పూర్తిగా విఫలమైందని.. ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదని.. ప్రభుత్వం పోలీసులను శాంతి భద్రతలకు వినియోగించకుండా.. ఎమ్మెల్యేలు, మంత్రులకు కాపలాకు ఉపయోగిస్తోందంటూ విమర్శించారు. చివరకు ఐఏఎస్‌లు కూడా మద్యం అమ్మే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా రోడ్డెక్కుతున్నారని.. ప్రభుత్వాన్ని పాలించే అర్హత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కోల్పోయారని విమర్శించారు.

ఐఏఎస్‌లు మద్యం అమ్మడమేంటో!

అధికారానికి దూరమైన తెలుగుదేశం పార్టీ నాయకుల మానసిక స్థితికి అద్దం పట్టేలా పుల్లారావు వ్యాఖ్యలు ఉన్నాయి అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఐఏఎస్‌లు మద్యం అమ్మే పరిస్థితి రావడం ఏమిటో ఆయన వివరించాలని వైఎస్సార్‌ సీపీ నాయకులు అంటున్నారు. దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ దిశగా పలు చర్యలు తీసుకొందని గుర్తు చేస్తున్నారు.రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నా సరే మద్యం అమ్మకాలను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నియంత్రిస్తోంది. తెలుగుదేశం హయాంలో రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా వెలసిన బెల్టుషాపులను నిషేధించింది. పర్మిట్‌ రూములకు అనుమతులను రద్దు చేసింది. గుడికి, బడికి దగ్గరలో ఉన్న మద్యం షాపులను మూయించి వేసింది. తెలుగుదేశం హయాంతో పోలిస్తే మద్యం దుకాణాల సంఖ్యను రాష్ట్రవ్యాప్తంగా గణనీయంగా తగ్గించింది. మందుబాబులకు షాక్‌ ఇచ్చేలా మద్యం ధరలను పెంచింది. గడచిన రెండున్నరేళ్లలో ఆబ్కారీశాఖ లెక్కలు చూస్తే ఈ ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా తీసుకున్న చర్యలు అర్థం అవుతాయని వైఎస్సార్‌ సీపీ నేతలు అంటున్నారు.

Also Read : YCP MLC, AP Council - నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం…మండలిలో మారిన లెక్కలు ఇవే!

అప్పట్లో మంత్రే బ్రాండ్‌ అంబాసిడర్‌!

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఒక ఆదాయ వనరుగా చూడడంతో షాపులకు విచ్చలవిడిగా లైసెన్స్‌లు ఇవ్వడమే కాకా ఊరూవాడా బెల్ట్‌షాపుల సంస్కృతిని ప్రోత్సహించింది. దీంతో 24/7 మద్యం అందుబాటులో ఉండేది. మంచినీళ్లు దొరకని ఊరైనా ఉండేదేమో కాని మద్యం లభ్యంకాని కుగ్రామం కూడా అప్పట్లో లేదంటే అతిశయోక్తికాదు. అప్పటి కేబినెట్‌ మంత్రి జవహర్‌ అయితే ఒక బ్రాండ్‌ అంబాసిడర్‌లా బీరును హెల్త్‌ డ్రింక్‌గా అభివర్ణించారు! ఈ వ్యాఖ్యలను బట్టే అర్ధం చేసుకోవచ్చు టీడీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై ఎంత ఆసక్తి కనబరిచిందో. ‍ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిన టీడీపీ నేతలకు అసలు మద్యం అమ్మకాలపై మాట్లాడే నైతిక అర్హతా ఉందా? అన్న అధికార పక్ష నాయకుల ప్రశ్నకు పుల్లారావు ఏం సమాధానం చెబుతారు?

పోలీసులు ఎలా పనిచేయాలో చెబుతారా?

ప్రజలకు రక్షణ లేదని.. ప్రభుత్వం పోలీసులను శాంతి భద్రతలకు వినియోగించకుండా.. ఎమ్మెల్యేలు, మంత్రులకు కాపలాకు ఉపయోగిస్తోందంటూ పుల్లారావు చేసిన వ్యాఖ్యలు మరీ వింతగా ఉన్నాయి. పోలీసులు తమ విధులను ఎలా నిర్వహించాలో ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు. ఎవరికి ఏ స్థాయిలో భద్రత కల్పించాలన్నదానిపై వారికి క్లారిటీ ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అలిపిరిలో దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్పీజీ భద్రత కావాలని ఆయన కొనసాగించుకుంటున్నారు. ఒక్క అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకే కాకుండా మాజీ మంత్రులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు కూడా అవసరాన్ని బట్టి పోలీసులు భద్రత కల్పిస్తారు. మంత్రిగా పనిచేసిన పుల్లారావుకు ఈ విషయం తెలియదా? అయినా రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఇప్పుడు ఏం ముప్పు వాటిల్లిందని ఈయన ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారో అర్థం కాదు. ఏదో రూపంలో విష ప్రచారం చేసి ప్రభుత్వ అధికారుల, పోలీసుల స్థైర్యం దెబ్బతీయడమే టీడీపీ నేతల పని అని, అందుకే పుల్లారావు నోట ఇలాంటి మాటలు వస్తున్నాయని వైఎస్సార్‌ సీపీ నేతలు విమర్శిస్తున్నారు.

Also Read : Chandrababu - మాఫీ హామీలతో ముంచేసిన బాబు- ఓటీఎస్ పై మళ్లీ అదే మాయాజాలం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp