TDP, Pattabhiram - టీడీపీ కీ.. పరిగెడుతున్న పట్టాభి..

By Aditya Dec. 01, 2021, 08:00 pm IST
TDP, Pattabhiram - టీడీపీ కీ.. పరిగెడుతున్న పట్టాభి..

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆర్థిక అవకతవకల పరంపర నానాటికీ వేగంగా ముందుకెళ్తోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఎప్పటిలా అడ్డగోలుగా విమర్శలు చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ షెల్, సూట్ కేస్ కంపెనీలు పెట్టి మనీలాండరింగ్‌తో ఆర్జించిన నైపుణ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా సూట్ కేస్, షెల్ కంపెనీలు పెట్టి వాటి ద్వారా డబ్బులు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి గవర్నర్‌తో పాటు మరికొంతమంది ఐఏఎస్‌లను షేర్ హోల్డర్లుగా పెట్టారని విమర్శించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్నిశాఖలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, సొసైటీల సొమ్ముని  ఏపీ స్టేట్ పైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్‌లో డిపాజిట్ చేయాలని జీవో 1998 ఇచ్చారన్నారు. దాన్ని సమర్ధించుకోవటం కోసం పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సొమ్ము రూ. 9.60 కోట్లు, ఏపీ ఆయిల్ కోఆపరేటివ్ ఫెడరేషన్  డబ్బు రూ.5 కోట్లు  దోపిడీకి గురయ్యాయని, బ్యాంకుల్లో ఉన్న డబ్బుకి  భద్రతలేదంటూ జీవో 1998 విడుదల చేశారని విమర్శించారు.

అవాస్తవాలతో పదే పదే అవే ఆరోపణలు

షెల్, సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఆర్జించారని దాదాపు పుష్కర కాలంగా వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పై పచ్చ బ్యాచ్‌ చేస్తున్న ఆరోపణలనే పట్టాభి కొత్తగా వినిపిస్తున్నారు. వారు చేసిన ఆరోపణలు , పెట్టిన కేసులు, పన్నిన కుట్రలను ఛేదించుకొని ప్రజామోదంతో ముఖ్యమంత్రి అయినా జగన్‌ను బదనాం చేయడానికి అవే ఆరోపణలను మళ్లీ చేస్తుండడం గమనార్హం. రూ.లక్ష కోట్లు దోచేశారంటూ న్యాయస్థానాల్లో వీరు పెట్టిన కేసులు చాలావరకు వీగిపోయాయి. మిగిలినవి కూడా న్యాయస్థానాల్లో నిలబడవని, తమ నేత కడిగిన ముత్యంలా బయటపడతారని వైఎస్సార్‌ సీపీ నేతలు అంటున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఇమేజ్‌ను దెబ్బతీయడానికి రాజకీయ కారణాలతో వేసిన ఈ వ్యాజ్యాలు ఆయనను ఏమీ చేయలేవని చెబుతున్నారు. న్యాయ నిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో  టీడీపీ గెలవడానికి తాము చేసిన ఈ ఆరోపణలు కూడా కారణమని ఆ పార్టీ నేతలు నమ్ముతుంటారు. అందుకే పదే పదే వాటినే చేస్తుంటారు.

Also Read : Atchannaidu, TDP - అంత సీన్‌ లేదన్న అచ్చెన్న ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడేంటి..?

షెల్‌, సూట్ కేస్ కంపెనీలు అంటే అర్థం తెలుసా?

ప్రజల డబ్బు కొల్లగొట్టేందుకు ఇప్పుడు ఏపీ స్టేట్ పైనాన్షియల్  సర్వీసెస్ కార్పొరేషన్ అనే సూట్ కేస్ కంపెనీతో మరో కొత్త ఎత్తుగడ వేశారని విమర్మిస్తున్న పట్టాభిరామ్‌కు అసలు షెల్‌, సూట్‌కేస్‌ కంపెనీలంటే అర్థం తెలిసే మాట్లాడుతున్నారా? ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న స్టేట్ పైనాన్షియల్  సర్వీసెస్ కార్పొరేషన్‌ను సూట్ కేస్ కంపెనీతో పోల్చడాన్ని బట్టే ఆయన తెలివితేటలు ఏమిటో అర్థం అవుతున్నాయి. ప్రభుత్వ శాఖల సొమ్ము ఆ కార్పొరేషన్‌లో జమ చేయమని ఇచ్చిన జీవో ఏ విధంగా తప్పు అవుతుంది. ప్రభుత్వ పాలనలో భాగంగా, పూర్తి పారదర్శకంగా జరిగే ఇలాంటి అంశాలను పట్టుకొని షెల్, సూట్ కేస్ కంపెనీలు, మనీలాండరింగ్‌ అంటూ హడావుడి చేసి ఏదో అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు చేయడం అవివేకం అనిపించుకోదా? ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాకు అకౌంటింగ్‌, ఆడిటింగ్‌, జవాబుదారీతనం ఉంటాయి. ఇందులో డబ్బులు కొల్లగొట్టేయడం ఏముంటుంది?

అప్పులపైనా పాత పల్లవి

ఇప్పటికే రూ.3 లక్షల కోట్లు అప్పులు చేశారని, డ్వాక్రా, పంచాయితీలు, విశ్వవిద్యాలయాల నిధులు అన్ని కాజేశారని పట్టాభిరామ్‌ పాత ఆరోపణలు చేశారు.  చంద్రబాబు హయాంలో చేసిన రుణాలకు అసలు, వడ్డీలు కట్టడానికి కూడా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అప్పులు చేయాల్సి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ నిమిత్తం ఈ ప్రభుత్వం ఏటా రూ.20వేల కోట్లు చెల్లిస్తోంది. కాంట్రాక్టర్లకు, వివిధ ప్రభుత్వ పనులకు చెల్లింపులు చేయకుండా టీడీపీ సర్కారు వేల కోట్ల బకాయిలు పెట్టింది. వాటిని తీరుస్తూ, కరోనా కష్టకాలంలో భారీగా రాబడి పడిపోయిన నేపథ్యంలో జనం ఇబ్బంది పడకూడదని భారమైనా సంక్షేమ పథకాలను మాట తప్పకుండా నిర్వహించడం వల్ల అప్పులు అనివార్యంగా చేయాల్సి వచ్చింది. ఈ వాస్తవాన్ని ప్రభుత్వ తరఫున ముఖ్యమంత్రి, మంత్రులు తరచు చెబుతున్నా పాత పల్లవినే పట్టాభి అందుకోవడం రాజకీయం కాక మరేమిటి? కరోనా కారణంగా ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే కాక కేంద్రంతో సహా, అన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున అప్పులు చేయాల్సి వచ్చింది. అలా చేయకుంటే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఈ వాస్తవాలను మరుగుపరుస్తూ మాట్లాడడమే కాక డ్వాక్రా, పంచాయతీలు, విశ్వవిద్యాలయాల నిధులు అన్ని కాజేశారని అడ్డగోలుగా ఆరోపణలు చేయడం జనాన్ని పక్కదారి పట్టించే కుట్ర కాదా? అని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేని ఇలాంటి గాలి ఆరోపణలను జనం నమ్మరని అంటున్నారు.

Also Read : Tdp,Chandrababu - ఒక్క దెబ్బతో టీడీపీకి, నందమూరి వంశానికి జూనియర్ ని దూరం చేసిన బాబు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp