ప్రజలను రక్షించే ప్రమాణాలు 108లో పాటించడం - తెలుగుదేశానికి కుంభకోణం అట

By Krishna Babu Jun. 23, 2020, 12:00 pm IST
ప్రజలను రక్షించే ప్రమాణాలు 108లో పాటించడం - తెలుగుదేశానికి కుంభకోణం అట

రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని ప్రజోపయోగ పధకాలని ప్రవేశ పెట్టి రాష్ట్రాన్ని ప్రగతి పధంలో నడిపిన ముఖ్యమంత్రి గా "డా. వై.యస్ రాజశేఖర రెడ్డి" చరిత్ర లొ నిలిచిపోయారు. ఆయన ప్రవేశ పెట్టిన పధకాల్లో దేశ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందినది నిస్సందేహంగా 108 అని చెప్పవచ్చు. రాత్రి పూట ఎవరికి ప్రాణం మీదకి వచ్చినా, ఏ రహ దారులలో వాహానాల కింద పడి రక్తపు మడుగులో ప్రాణాల కోసం గిల గిల లాడే దుస్థితి వచ్చినా క్షణాలలో వచ్చి వాలిన అద్భుత సేవా పధకం 108. అయితే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఈ సర్వీస్ పై తెలుగుదేశం నాయకులు ఆరోపణలు సంధించడం మొదలు పెట్టారు . తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 108 సర్వీస్ నిర్వహించిన సంస్థకు ఇంకా సమయం ఉండగానే వై.యస్.ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి గారి అల్లుడు రోహిత్ రెడ్డి డైరెక్టరుగా ఉన్న అరబిందో ఫార్మా కంపెనీకి అధిక ధరలు చెల్లిస్తూ ఈ కాంట్రాక్టు కట్టబెట్టారని. ఇది 300 కోట్ల కుంభకోణం అని గగ్గోలు పెడుతున్నారు.

తెలుగుదేశం ఎన్నికల్లో ఓటమి పాలయిన దగ్గర నుండి కొత్త పందాకి శ్రీకారం చుట్టుంది. నిజాలను దాస్తూ , అర్ధసత్యాలను, అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వం పై ఏదో ఒక రకంగా బురద జల్లి ప్రజలను గందరగోళానికి గురిచేసి రాజకీయంగా లబ్ది పొందడమే లక్ష్యంగా పావులు కదపడం మొదలు పెట్టింది, అందులో బాగంగానే ఇప్పటి వరకు మడ అడవులు అంటూ, తిరుపతి పై శిలువ అంటు అనేక అసత్య ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం పై దుష్ప్రచారానికి పూనుకుంది టీడీపీ . ఇక తాజాగా వారి సహచరులు ఈ.ఏస్.ఐ స్కాంలో , నకిలీ బస్సుల స్కాం లో ఇరుక్కుని అరెస్టు అవ్వడంతో, రేపో మాపో రాజధాని స్కాంలో, అగ్రీగోల్డ్ స్కాంలో మరికొందరు అరెస్టుకు సిద్దంగా ఉన్న నేపధ్యంలో ఉక్కిరిబిక్కిరైన తెలుగుదేశం, తమకి అంటుకున్న అవినీతి మరకను ఈ ప్రభుత్వానికి కూడా అంటించి వారు చేసిన అన్యాయాలు కుంభకోణాలు నుండి ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడ వేశారు.

108 పై తెలుగుదేశం ఆరోపణలలో నిజనిజాలు చూస్తే

దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డి గారు తన మానసపుత్రికగా ప్రవేశపెట్టిన 108 సర్వీస్ , 2009 నుంచి 2017 డిసెంబరు వరకు నిర్వహణ బాధ్యతలను జీవీకే సంస్థ పర్యవేక్షించింది. 108 వాహనాల నిర్వహణ భాద్యతలు సక్రమంగా నిర్వర్తించడం కోసం ఒక్కో వాహనానికి నెలకు 1లక్షా 23వేలు ప్రభుత్వం ఈ సంస్థకు చెల్లించింది. అయితే గత తెలుగుదేశం ప్రభుత్వం ఈ సంస్థ నిర్వహణ భాద్యతలను జీవీకే సక్రమంగా నిర్వహించడంలేదని చెప్పి మహారాష్ట్రలోని భారత్‌ వికాస్‌ గ్రూప్‌ (బీవీజీ)కి 2017 డిసెంబర్ 13 నుండి 2020 డిసెంబర్ 12 వరకు 108 అంబులెన్సు నిర్వహణ భాద్యతలను తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కో అంబులెన్సు కు 1లక్షా 31 వేల చొప్పున ఆ సంస్థకు కట్టబెట్టింది

అయితే ఈ కొత్త సంస్థ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వాహనాల మరమ్మతుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోందనే విమర్శలు వచ్చాయి. షెడ్లకు చేరిన వాహనాలు తుప్పుపట్టి పనికి రాకుండా పోయినా పట్టించుకోలేదని. బీవీజీ సంస్థకు అన్ని వాహనాలకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం సకాలంలో మంజూరు చేస్తున్నా చిన్నపాటి మరమ్మతులను కూడా చేయించకుండా నిర్వహణ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా అప్పటివరకు 130 రకాల మందులు ఇతర పరికరాలు ఉండాల్సిన అంబులెన్సుల్లో ఈ సంస్థ చేతిలోకి వచ్చాక కేవలం 90 రకాల మందులు , పరికరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కనీసం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి టి.టి ఇంజెక్షన్లు, పాము కాటుకు గురైన వారికి యాంటీ వీనం ఇంజెక్షన్లు లేకుండానే అంబులెన్సులు తిరిగాయి. అలాగే అన్ని అంబులెన్సుల్లో రోగులును క్షతగాత్రులను వాహనాల్లోకి మార్చేందుకు కీలకంగా ఉపయోగపడాల్సిన స్టెక్ట్చర్లు 90% పూర్తిగా రిపేర్లకు వచ్చినా పట్టించుకోలేదు. ప్రభుత్వం అంబులెన్స్ నిర్వహణ కోసం ఇచ్చే ధనాన్ని తీసుకుంటూ కనీస అవసరాలను కూడా అంబులెన్స్ లో పొందుపరచకుండా తీవ్ర మైన నిర్లక్ష్య దోరణితో వ్యవహరించింది. అయితే నాటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా కనీసం వాటి పై దృష్టిపెట్టిన పాపాన పోలేదు. 108 ఉద్యోగులకు వేతనాలు కూడా పెంచలేదు. దీంతో సకాలంలో 108 సర్వీసులకు నోచుకోక అనేకమంది మృత్యువాత పడటం మార్గమధ్యంలో డీజిల్ అయిపోవడంతో అంబులెన్సులోనే ప్రసవించడం లాంటి అనేక ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి.

దీంతో నాటి ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షనేత గా ఉన్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చేసిన పాదయాత్రలో వై.యస్ రాజశేఖర రెడ్డీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 108 అంబులెన్సుల పనితీరుపై అనేక ఫిర్యాదులు ప్రజల నుండి రావడం , అలాగే 108 ఉద్యోగస్తులు పడుతున్న ఇబ్బందులు వారు నేరుగా జగన్ గారికే మొరపెట్టుకోవడంతో , తాను అధికారంలోకి రాగానే 108 అంబులన్సులను ఇప్పుడున్న వాటి కన్న ఇంకా మెరుగ్గా సాంకేతికంగా అత్యుత్తమ ప్రమాణాలతో నడిచేలా చేస్తాం అని, అలాగే ఉద్యోగులు ఎదుర్కుంటున్న సమస్యలను కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

హామీ ఇచ్చిన విధంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే తన తండ్రి వై.యస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక అయిన 108 అంబులెన్సుల పనితీరును పూర్తిగా ప్రక్షాలణ చేయటానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. 13 జిల్లాల్లో ఉన్న అన్ని మండలాలలోనూ 108 వాహనాలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో అదనంగా 432 కొత్త అంబులెన్సులను తీసుకువచ్చారు. వీటి కోసం అంతర్జాతీయ వైద్య ఉపకరణాల తయారీ సంస్థ ‘రెస్‌మెడ్‌​’ నుంచి కొనుగోలు చేసిన మొబైల్‌ వెంటిలేటర్లను అమర్చారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బాధితులను రక్షించడంలో భాగంగా ఈ వాహనాలు పనిచేసేలా వీటిని తయారు చేశారు. అలాగే 104 వాహనాల్లోనూ వెంటిలేటర్‌తో పాటు డిఫ్రిబ్యులేటర్‌(గుండె సంబంధిత ఇబ్బంది వచ్చినప్పుడు కాపాడే యంత్రం), పల్సాక్సీ మీటర్‌(రక్తంలో ఆక్సిజన్‌ శాతం నియంత్రణ) వంటి అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. అలాగే ప్రమాధ స్థలాలను వేగం గా గుర్తించడంతోపాటు మెరుగైన సేవలను అందిచడం కోసం అన్ని అంబులెన్సుల్లో కొత్తగా ఆటోమేటిక్‌ కాల్‌ డిస్ట్రిబ్యూటర్‌ (ఏసీడీ) వ్యవస్థను, కంప్యూటర్‌ టెలిఫోని ఇంటర్‌ఫేస్‌ (సీటీఐ), వాయిస్‌ లాగింగ్‌ కేపబిలిటీస్, జీపీఎస్‌ ఇంటిగ్రేషన్, హైలీ సెక్యూర్డ్‌ నెట్‌వర్క్‌లను రూపొందిoచబోతున్నారు. ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ అప్లికేషన్‌ను రూపొందించి ఈ అప్లికేషన్‌ను విపత్తు నిర్వహణకు అనుసంధానం చేసి అన్ని ‘108’అంబులెన్స్‌లకు జీపీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు .

ఇక ముఖ్యమంత్రి గా జగన్ భాద్యతలు చేపట్టాక 108 ఉద్యోగులకు హామీ ఇచ్చినట్టుగానే వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు, ప్రస్తుతం 108 వాహనాల్లో 2 వేలమందికిపైగా పనిచేస్తున్నారు , వీరిలో పైలెట్‌(డ్రైవర్‌)కు గతంలో రూ.13 వేల వేతనం ఉండగా.. దాన్ని రూ.28 వేలకు, ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌)కి గతంలో రూ.15 వేలు వేతనం ఉండగా.. దాన్ని రూ.30 వేలకు పెంచుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే 104 వాహనాల్లో సుమారు 1,500 మంది ఉద్యోగులు ఉండగా , వీరిలో ఫార్మసిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్లకు రూ.17,500 చొప్పున వేతనం ఉండగా, దాన్ని రూ.28 వేలకు, డ్రైవర్‌కు రూ.15,000 వేతనం ఉండగా, దానిని రూ.26 వేలకు పెంచుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వంలో అంబులెన్సుల నిర్వహణ కోసం ఒక్కో అబులెన్సుకు 1 లక్షా 30వేల చొప్పున భారత్ వికాస్ గ్రూప్ కు చెల్లించినా ఆ సంస్థ అంబులెన్స్ నిర్వహణలో ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించకపోగా అవి మరమత్తులకు గురైనా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీనికి ఉదాహరణ ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించిన ఏసీబీ దాడుల్లో కండీషన్ లో లేని 108 వాహనాలని నడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో సీఎం జగన్ ఆ సంస్థకు ఇంకో ఏడాది సర్వీసు కాంట్రాక్టు ఉండగానే వాటిని రద్దు చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడే అంబులెన్సులో పూర్తిగా అత్యంత అధునాతన పరికరాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు, ప్రజలకు సంభందించిన ఆ వ్యవస్థలో లోటు కనపడకుండా ఉండేలా గతంలో కేటాయించినదానికన్న ఆధునిక సదుపాయాలు ఉండేలా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పాత అంబులెన్సులకు 2,21,257 గా కొత్త అంబులెన్సులకి 1,78,072గా ధర నిర్ణయిస్తూ అరబిందో సంస్థను దీనికి సర్వీస్ ప్రొవైడర్ గా నియమించారు. దీనికి కోసం జీఒ నెంబర్ 116ని ఫిబ్రవరి 13న విడుదల చేశారు.

ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాల్సిన 108 సర్వీస్ తెలుగుదేశం ప్రభుత్వంలో నాణ్యత లేక, మూలన పడి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై పూర్తిగా రిపేర్ షాపులకే పరిమితం అయ్యేవి. దీంతో పాటు గత ప్రభుత్వంలో 108 ఉద్యొగులకు జీతాలు సక్రమంగా రాక , వచ్చినా అవి అరాకోరా జీతాలు కావడం మూలాన వారు కూడా అనేక సమస్యలను ఎదుర్కున్నారు. ప్రజల ప్రాణాలని కాపాడల్సిన ఈ 108 సర్వీస్ ను గత ప్రభుత్వం మాదిరి కాకుండా అత్యాదునిక ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకుంటూ వాటికి సరిపడా నిధులు వెచ్చిస్తే అదేదో ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడినట్టు తెలుగుదేశం హడావిడి చేయడం విడ్డూరంగా కనిపిస్తుంది.. ఏదో ఒక సంస్థలో ఎవరో ఒకరికి బీరకాయ పీసు చుట్టం ఉంటుంది అనేది కాదనలేని సత్యం . అంతమాత్రన పేరున్న అరబిందో కి అవినీతి మరక అంటించే ప్రయత్నం చేయడం తెలుగుదేశం మార్క్ రాజకీయంగా చెప్పవచ్చు. ఇదే అరబిందో సంస్థ అంబులెన్సుల నిర్వహణ కొరకు తెలంగాణ ప్రభుత్వానికి కూడా అప్లికేషన్ పెట్టుకుoదన్న విషయాన్ని తెలుగుదేశం దాయడం ఉద్దేశపూర్వకం కాదా ? పైగా ప్రభుత్వం రూల్ ప్రకారమే బిడింగ్ నిర్వహించగా అందులో అన్ని రూల్స్ ప్రకారం అరబిందో ఎంపికైన విషయం కావాలనే ఎందుకు దాచారో ? ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తున్న 104, 108 వాహనాల్లో వైద్యులు, సూపర్‌వైజర్లు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, పైలెట్ / డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేసి 730 మందికి కొత్తగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం ఎందుకు దాచారో? తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా వేసవిలో చంద్రన్న మజ్జిగ పధకం అంటు హెరిటేజ్ మజ్జిగను నేరుగా ప్రభుత్వం మార్కెట్ రేటు కన్న అధికంగా కొనుగోలు చేసి చంద్రబాబు సొంత కంపెనీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించడం తప్పు అవుతుంది కానీ ప్రజలు ప్రాణాలు రక్షించడానికి తీసుకున్న ఈ చర్యలో తప్పు ఆపాదించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబో తేదేపా నేతలు ఆలోచించుకోవాలి.

ఇక 108,104 వాహనాల కొనుగోలులో కూడా పెద్ద ఎత్తున అవీనీతి జరిగిందని పనిలో పనిగా మరొక ఆరోపణ చేసిపడేసింది తెలుగుదేశం, కానీ సిఏం జగన్ చెప్పినట్టు 100 కోట్లు దాటిన ప్రతి వర్క్ జ్యుడిషియల్ కమిటీ అప్రూవల్ తరువాతే కొనుగోలు చేస్తాం అని చెప్పిన విధంగానే 300కోట్లు విలువ కలిగిన 108 , 104 వాహనాల కొనుగోలు జ్యుడిషియల్ కమిటి రివ్యు దాటుకునే వచ్చిదన్న విషయం తెలుగుదేశం ఉద్దేశ పూర్వకంగానే దాయడం, అలాగే ప్రభుత్వం ఆ టెండర్ డాక్యుమెంట్ ని పబ్లిక్ సలహాల కోసం చెప్పిన విదంగానే వెబ్సైట్ లో ఉంచింది, అప్పుడు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు ఆరోపణలు చేయడం వారి కుట్రపూరిత రాజకీయానికి మరొక నిదర్శనంగా చెప్పవచ్చు.

తెలుగుదేశం పార్టీ నాయకుల అభిప్రాయం చూస్తే 108 ని అత్యాధునికంగా తీర్చిదిద్దకుండా గత ప్రభుత్వం మాదిరే వాటిని గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాలి అన్న చందంగా వారు మాట్లాడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏది ఏమైనా తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఈ చౌకబారు ఆరోపణలు పక్కన పెడితే 108 కు తిరిగి జీవం పోసేలా , అలాగే 108 ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపేలా జీతాలు పెంచడం దానికి సరిపడా నిధులు వెచ్చించడం హర్షించదగ్గ విషయం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp