టీడీపీ నిరాదరణ.. గౌతు కుటుంబం తెరమరుగేనా!

By Ramana.Damara Singh May. 16, 2021, 01:00 pm IST
టీడీపీ నిరాదరణ.. గౌతు కుటుంబం తెరమరుగేనా!

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో గౌతు కుటుంబానికున్న ప్రత్యేకత మరే కుటుంబానికి లేదు. గౌతు అనగానే సర్దార్ గౌతు లచ్చన్న ఠక్కున గుర్తుకొస్తారు. స్వాతంత్ర్య సమర యోధుడిగా, రైతు నాయకుడిగా, ఆచార్య ఎన్జీ రంగా సహచరుడిగా రాష్ట్ర రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన లచ్చన్న కుటుంబం క్రమంగా రాజకీయ రంగానికి దూరమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సుమారు మూడున్నర దశాబ్దాలపాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా జిల్లా రాజకీయాలపై ప్రత్యేక ముద్ర వేసిన లచ్చన్న తనయుడు గౌతు శ్యామసుందర శివాజీ రాజకీయాల నుంచి దాదాపు తప్పుకోగా.. ఆయన వారసురాలిగా తెరపైకి వచ్చిన శిరీష తెలుగుదేశం నాయకత్వం నిరాదరణతో గత సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి పార్టీకి, నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు.

తిరుగులేని నాయకత్వం

ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన గౌతు శివాజీ.. మరో యువ నేత కింజారాపు ఎర్రన్నాయుడుతో కలిసి జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేశారు. అప్పట్లో అసెంబ్లీలో వీరిద్దరిని జంట ఎమ్మెల్యేలుగా పిలిచేవారు. అప్పట్లో ఉన్న సోంపేట నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు.. 1985, 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిణామాల కారణంగా ఎన్టీఆర్ శివాజీతో పాటు ఎర్రన్నాయుడికి టికెట్లు నిరాకరించగా.. వారిద్దరూ ఇండిపెండెంట్లుగా పోటీ చేసి విజయం సాధించి తమ సత్తా చాటుకున్నారు. ఆ తర్వాత కూడా టీడీపీలోనే కొనసాగారు. నియోజకవర్గాల పునర్విభజనలో సోంపేట స్థానంలో పలాస నియోజకవర్గం ఏర్పడింది. దాంతో 2009 ఎన్నికల్లో పాలసకు జరిగిన తో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శివాజీ ఓటమిపాలయ్యారు. రాజకీయ జీవితంలో ఇదే ఆయన తొలి, చివరి ఓటమి. 2014 ఎన్నికల్లో మళ్లీ గెలిచిన శివాజీ అత్యంత సీనియర్ అయిన తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ చంద్రబాబు పక్కన పెట్టడంతో కుంగిపోయారు. ఓ పత్రికా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకొని మరీ తన బాధను వ్యక్తం చేశారు. గతంలో స్వల్ప కాలమే బీసీ సంక్షేమ మంత్రిగా పనిచేసిన ఆయన.. పూర్తి కాలం పాటు మంత్రిగా చేయాలన్న ఆశ తీరాకుండానే ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పి.. తన వారసురాలిగా కుమార్తె శిరీషను తెరపైకి తెచ్చారు.

పట్టించుకోని టీడీపీ నాయకత్వం

టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా వ్యవహరించిన గౌతు శిరీష.. 2019 ఎన్నికల్లో తండ్రి స్థానంలో పలాస నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. సొంత పార్టీ నేతలే తన ఓటమికి కారణమని ఆమె అప్పట్లో ఆరోపించారు. అయినా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. అలాగే జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆమెను తప్పించి.. మాజీ విప్ కూన రవికుమార్ ను శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న శిరీష స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీకి పనిచేయకుండా దూరంగా ఉండిపోయారు.

వైఎస్సార్సీపీలోకి వలసలు

మరోవైపు ఎన్నికల్లో వరుస ఓటములతో డీలాపడిన పలాస టీడీపీ నేతలు, కార్యకర్తలు చాలామంది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అయిన సీదిరి అప్పలరాజు ప్రోద్బలంతో వైఎస్సార్సీపీ లో చేరిపోవడం నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి చుక్కానిలేని నావలా తయారైంది. పార్టీని కాపాడుకునేందుకు టీడీపీ అధిష్టానం ఏమాత్రం ప్రయత్నించకపోవడంతో శిరీష కూడా నియోజకవర్గానికి దూరంగా విశాఖలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. ఈ పరిణామాలు గౌతు కుటుంబ రాజకీయ ప్రస్థానంపై అనుమానాలు రేపుతున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp